వివాదాలు కొనితెచ్చుకుంటున్న నరసింహన్!

Update: 2018-01-07 15:30 GMT
నరసింహన్... పోలీసు శాఖలో మాజీ ఉన్నతాధికారి. ప్రభుత్వ పార్టీలకు విశ్వసనీయుడు కావడంతో.. గవర్నర్ పదవిని దక్కించుకున్న సెలబ్రిటీ! కేంద్రంలో అధికారం వెలగబెట్టే పార్టీ మారినప్పటికీ.. తన పదవికి హోదాకు మాత్రం భంగం రాకుండా.. విధేయతను చూపడంలో విశిష్ట సేవా పతకం పొందగల స్థాయి వ్యక్తిగా ప్రజల మాటల్లో గుర్తింపు ఉన్న వ్యక్తి. కాంగ్రెసు పార్టీ నియమించిన తన పదవీకాలం పూర్తయిపోయినా కూడా.. భాజపా హయాంలో దానిని పొడిగింపజేసుకుని.. ఏకంగా రెండు రాష్ట్రాలకు తానే దిక్కన్నట్లుగా అధికారంలో ఉన్న సీనియర్ గవర్నర్ ఆయన.

ఇటీవలి పరిణామాలను గమనిస్తే ఆయన వివాదాలను కొని తెచ్చుకుంటున్నారా? అనిపిస్తోంది. ఎందుకంటే.. అటు తెలంగాణలో ఆయన మీద కాంగ్రెస్ నాయకులు ఒక రేంజిలో విరుచుకు పడుతున్నారు. అధికారంలో ఉన్న కేసీఆర్ కుటుంబానికి ఆయన ఏజెంటులాగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇదే గవర్నరు మీద తెలంగాణ ఉద్యమ సమయంలో తెరాస నాయకులు ఏ రేంజిలో విమర్శలు గుప్పించారో కూడా అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి.. తెరాస అధినేతకే కొమ్ము కాస్తున్నాడని ... ఆయనను ఈ పదవిలో నియమించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తులు నూరుతూ ఉండడం గమనార్హం. కేసీఆర్ - కేటీఆర్ ల మీద విమర్శలు తగ్గించాలని గవర్నర్ తమను కోరినట్లు కాంగ్రెస్ నేతల ఆరోపణ. నిజానికి గవర్నర్ తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్లు వెల్లువెత్తే విమర్శలకు మాత్రమే పరిమితం కాలేదు.
Read more!

ఏపీ నుంచి  కూడా ఆయనకు విమర్శలు తప్పడం లేదు. ఇక్కడ అందరితోనూ సంయమనం పాటించాలని మౌనవ్రతం పాటించే చంద్రబాబునాయుడు పార్టీనుంచి ఇబ్బంది లేదు గానీ.. భాజపా నాయకులు ఆయన తీరును తప్పు పడుతుండడం గమనార్హం. నరసింహన్.. ఆంధ్రప్రదేశ్ ప్రగతికి అడ్డు పడుతున్నారనేది.. ఏపీలోని భాజపా శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు  ఆరోపణ. ఏపీ ప్రభుత్వం తన సంతకం కోసం పంపిన నాలా బిల్లును గవర్నర్ నరసింహన్ ఎందుకు ఆపేశారో తెలియదు. కానీ ఇదే తరహా బిల్లు తెలంగాణ ప్రభుత్వం నుంచి తన వద్దకు వచ్చినప్పుడు మూడే రోజుల్లో సంతకం పెట్టేశారని విష్ణురాజు చెబుతున్నారు.

ఏపీలో సేద్యపు పొలాలను వ్యవసాయేతర భూమిగా మార్చే చట్ట సవరణకు సంబంధించినదే ఈ నాలా బిల్లు. ఆయన సంతకం పూర్తయితే.. నాలా పన్ను 9 నుంచి 3 శాతానికి తగ్గుతుంది. పరిశ్రమలు రావడానికి అది బాటలు వేస్తుందనేది అందరి వాదన. మరి గవర్నర్ దాన్ని కూడా ఆపేసి.. అటు భాజపా వారి ఆగ్రహాన్ని కూడా చవిచూస్తున్నారు.

తెలంగాణ లో కాంగ్రెస్ కూడా చాలా రకాలుగా ఆయన మీద అసహనం వ్యక్తం చేస్తున్నది. అయినా ఈ వ్యవహారాలను గమనిస్తోంటే సామాన్యులకు ఓ సందేహం కలుగుతోంది. గవర్నరు మీద ఇన్ని ఫిర్యాదులు చేసే బదులు ఆయనను నియమించిన కాంగ్రెస్ పెద్దలకు తెలంగాణ కాంగ్రెస్ వారు గానీ, ఆయనను కొనసాగిస్తున్న భాజపా పెద్దలకు ఏపీ భాజపా వారు గానీ.. ఫిర్యాదు చేయవచ్చు కదా అనేది ఆ సందేహం. అలా మాత్రం జరగడం లేదు.. ఎందుకో మరి!
Tags:    

Similar News