బీజేపీని బోల్తా కొట్టిస్తున్న ఏజ్ బార్ కేండిడేట్లు

Update: 2019-03-29 01:30 GMT
75 ఏళ్లు దాటినవారికి టికెట్లు ఇవ్వరాదన్న బీజేపీ నియమం ఆ పార్టీలో చాలామంది నేతలను ఇబ్బంది పెట్టేసింది. పాపం టికెట్లు రాక దిగ్గజ నేతలు కూడా షాకైపోయారు. అయితే.. కొందరు మాత్రం తెలివిగా తామింకా అండర్ 75 అంటూ టికెట్లు సాధించేశారట. మధ్యప్రదేశ్‌ లోని సాగర్ నియోజక వర్గ భాజపా ఎంపీ టికెట్ కోసం అలాంటి పనే చేశారు. తప్పుడు వివరాలతో ఆయన పార్టీని బోల్తా కొట్టించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
    
సాగర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న లక్ష్మీ నారాయణ్ యాదవ్ ప్రస్తుతం తన వయసు 74 సంవత్సరాలుగా చెప్పుకుంటున్నారు. అయితే 2014లో ఆయన ఎన్నికల సంఘం వద్ద దాఖలు చేసిన అఫిడవిట్‌ లో మాత్రం 73 సంవత్సరాలని ఉంది. దాంట్లో ఆయన ఏ సంవత్సరంలో జన్మించారో మాత్రం రాయలేదు. కేవలం 73 ఏళ్లని మాత్రమే రాశారు. ఇప్పుడు తనకు 74 ఏళ్లని చెబుతూ టికెట్ తెచ్చుకున్నారు.
    
దీనిపై ఆయన్ను మీడియా ప్రశ్నించగా..తాను 1944 - నవంబరు 9న జన్మించానని - 2014లో అఫిడవిట్‌ లో సమర్పించిన వివరాలు గుర్తు లేవని చెప్పారు. కాగా ఈ 75 ఏళ్ల నిబంధనతో లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన సుమిత్రా మహాజన్‌కు కూడా పార్టీ ఇంతవరకు టికెట్ ఇవ్వలేదు. కానీ - లక్ష్మీనారాయణ యాదవ్ మాత్రం టికెట్ సాధించేశారట. అయితే.. ఇప్పుడీ విషయం బయటపడడతో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


Tags:    

Similar News