ఎన్నిక‌ల హామీ..మీరు అద్దెకుంటే కిరాయి మేం చెల్లిస్తాం

Update: 2018-10-02 07:07 GMT
ఎన్నిక‌లు వ‌చ్చిన స‌మ‌యంలో రాజ‌కీయ పార్టీల్లో ఉండే సంద‌డి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ముఖ్య‌నేత‌లు మొద‌లుకొని చోటామోటా నాయ‌కుల దాక సంద‌డే సంద‌డి. అదే స‌మ‌యంలో వారికి మీపై మాకు ఎంత ప్రేమ ఉందో తెలుసా అన్న‌ట్లుగా ప్ర‌జ‌ల కోసం అంటూ మ్యానిఫెస్టోలు విడుద‌ల చేసేస్తూ అన్నింటి గురించి అడిగినా..అడ‌గ‌క‌పోయినా ప్ర‌క‌టించేస్తుంటారు. అలాంటి హామీ తాజాగా తెర‌మీద‌కు వ‌చ్చింద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. అదే బీజేపీ ఇచ్చిన ఇంటి అద్దె చెల్లింపు.

భార‌తీయ జ‌న‌తాపార్టీ తెలంగాణ శాఖ తాజాగా ఆస‌క్తిక‌ర‌మైన హామీని త‌న మ్యానిఫెస్టోలో పొందుప‌ర్చింది. రాష్ట్రంలో అధికారంలో కొస్తే అద్దెకుండే కుటుంబాలన్నింటినీ ఆదుకుంటామని బీజేపీ హామీనిచ్చింది. ప్రతి కుటుంబానికి నెలకు రూ.5 వేలకు తగ్గకుండా అద్దె చెల్లిస్తామని పేర్కొంది. ఈ అంశాన్ని తమ పార్టీ ఎన్నికల ప్రణాళికలో చేర్చామని బీజేపీ సీనియర్‌ నేత ఎన్వీఎస్ ఎస్‌ ప్రభాకర్‌ చెప్పారు. పార్టీ నేత‌ల‌తో స‌మావేశం అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ  డప్పు కొట్టేవారికి - చెప్పు కుట్టే వారికి నెలకు రూ.3 వేల పెన్షన్‌ను అందజేస్తామన్నారు. పాత ఆటోలు - స్కూల్‌ వ్యాన్లు - ఇతరత్రా వాహనాలను నడిపే వారి సౌకర్యార్థం పాత వాహనాలను తీసుకురండి.. కొత్త వాహనాలను తీసుకెళ్లండి అనే నినాదమిస్తున్నామని తెలిపారు. పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. తద్వారా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఫీజులను నిర్ణయించి.. విధిగా అమలయ్యేట్టు చూస్తామని తెలిపారు. ప్రయివేటు పాఠశాలలకు సంబంధించి విద్యుత్‌ - నీరు - ఇతర ఆస్తి పన్నులను కమర్షియల్‌ గా పరిగణించబోమని అన్నారు. నెలకు రూ.6కే నీటి కనెక్షన్నిస్తామని తెలిపారు. ఇది మహా నగరాలతోపాటు పురపాలక సంఘాలు - గ్రామ పంచాయతీలన్నింటిలో అమలవుతుందని చెప్పారు. తమ పార్టీ ఎన్నికల ప్రణాళికపై కొంత కసరత్తు చేశామని - మ్యానిఫెస్టో ముసాయిదాను పార్టీ ఉన్నతస్థాయి కమిటీకి పంపామని చెప్పారు. అక్కడి నుంచి అనుమతి రాగానే పూర్తి స్థాయిలో వివరాలను వెల్లడిస్తామని అన్నారు.

అయితే, బీజేపీ నేత‌లు ప్ర‌క‌టిస్తున్న‌ట్లుగా అద్దెకు ప్రామాణికం ఏంటి? ఏ ప్ర‌మాణాల‌ ప్ర‌కారం అద్దెకు ఉండేవారిని గుర్తిస్తారు? అస‌లు ఈ స్థాయిలో ఆర్థిక‌భారం భ‌రించడం ఎలా? వ‌ంటి సందేహాలు స‌హ‌జంగానే తెర‌మీద‌కు వ‌స్తుంటాయి. మ‌రి దీనికి బీజేపీ నేత‌లు ఏం స‌మాధానం ఇస్తారో?!


Tags:    

Similar News