అరటి తింటే.. ఆరోగ్యం మీ వెంటే

Update: 2020-09-05 12:10 GMT
అరటిపండుతో ఉండే లాభాలు అన్నీ ఇన్ని కావు. బీపీ, మలబద్దకం, ఆస్తమా లాంటి దీర్ఘకాలిక రోగాలనే కాదు. ఆధునిక జీవన విధానంతో సంక్రమిస్తున్న డిప్రెషన్​, నిద్రలేమి లాంటి వ్యాధులను కూడా అరటిపండుతో జయించవచ్చు. ప్రతిరోజూ ఒక్క అరటిపండు తీసుకుంటే చాలు ఎంత పెద్ద రోగాన్నైనా తగ్గించుకోవచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.  అరటిపండులో  పిండిపదార్థాలు, కార్బొహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ప్రతి 100 గ్రాముల అరటిలో 20 గ్రాముల కార్బొహైడ్రేట్లు, 1 గ్రాము మాంసకృతులు అంటే 0.2 గ్రాముల కొవ్వుపదార్థాలు, 80 కిలో క్యాలరీల శక్తి ఉంటుందని చెబుతున్నారు సైంటిస్టులు.   అరటిపండు మలబద్దకాన్ని దూరం చేస్తుంది. అరటి పండు మాత్రమే కాదు కాండం, ఆకులు, పువ్వులు కూడా ఎంతో మేలు చేస్తాయి. అరటిపువ్వును వంటల్లో విరివిగా వాడొచ్చు. అరటి కాండంలోని సున్నితమైన మధ్యభాగం దూట కూడా వంటల్లో ఉపయోగిస్తారు.  అరటి పువ్వు తింటే జీర్ణ క్రియ తేలికగా అవుతుంది. ఇందులోని ఐరన్, కాల్సియం, పొటాసియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, వగైరాలు నాడీ వ్యవస్థ మీద ప్రభావంచూపి సక్రమముగా పనిచేసేటట్లు చేస్తాయి. అరటిపువ్వులో ఉండే విటమిన్​ సీ రోగనిరోధకశక్తిని పెంచుతుంది. స్త్రీలకు పిరియడ్స్​ టైంలో ఎక్కువగా రక్తస్రావము కాకుండా అరటి పువ్వు కాపాడుతుంది. మగవారిలో వీర్యవృద్ధికి కూడా అరటిపువ్వు దోహదపడుతుందని పరిశోధనల్లో తేలింది. అరటిఆకులో భోజనం ఎంతో ఆరోగ్యదాయకమని నమ్ముతారు మన పూర్వికులు ఇప్పటికీ పలు హోటల్లలో అరటిభోజనం పెడుతున్నారు.

బీపీ పేషెంట్లకు మంచిదే
ప్రతిరోజు ఓ అరటిపండును ఆరగిస్తే బీపీని దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు సైంటిస్టులు. మరోవైపు అరటిపండులో 74 శాతం కన్నా అధికంగా నీరు ఉంటుంది. పచ్చి అరటిపండులో కార్బొహైడ్రేట్లు స్టార్చ్​ రూపంలో ఉంటాయి. పండుతున్న కొద్దీ అవి చక్కెరగా మారతాయి. అందువల్ల షుగర్​ వ్యాధిగ్రస్థులు బాగా మాగిన పండ్లను తినకపోవడమే బెటర్​. అరటిపండు సత్వరం శక్తిని ఇస్తుంది. ఇందులో ఉండే పొటాషియం బీపీని అదుపులో ఉంచుంది. పెద్ద పేగు వ్యాధిగ్రస్తులకు చాలా చక్కని ఆహారం. అందుకే అరటి పండు పేదవాడి ఆపిలు పండు అని అంటారు. ఎందుకంటే, రెండింటిలోనూ పోషక విలువలు సమానంగానే ఉంటాయి. అరటి పండులో ఉండే పోషకాలు అధిక రక్తపోటు మధుమేహం ఆస్తమా క్యాన్సర్ అజీర్తి జీర్ణ సమస్యలను నిరోధిస్తుంది.అరటి పండులో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది ఎముకలకు మరియు దంతాలకు చాలా మంచిది. కిడ్నీల ఆరోగ్యానికి కూడా ఇది ఉపకరిస్తుంది. వారానికి రెండు లేదా మూడు అరటి పండ్లు తినడం వల్ల మహిళలు కిడ్నీ జబ్బుల బారిన పడే ముప్పు నుండి తప్పించుకోవచ్చు అని ఒక అధ్యయనంలో తేలింది.

అరటితో ఆస్తమా దూరం..
రోజుకో అరటిపండు తింటే ఆస్తమా లక్షణాలు తగ్గుముఖం పడతాయి. క్యాన్సర్​ కణాలను తగ్గించేశక్తి కూడా అరటికి ఉంది.  అరటిపండులో  కొవ్వు ఉండదు అలాగే కాలోరీలు కూడా చాలా తక్కువ.  పూర్తిగా పక్వానికి రాని అరటిలో రెసిస్టన్స్ స్టార్చ్ ఉంటుంది. ఇది కడుపు నిండిన భావన కలిగించి  ఆకలిని తగ్గిస్తుంది. తద్వారా అరటి పండు బరువు తగ్గటానికి ఉపకరిస్తుంది. అరటిపండులోని పొటాషియం శరీర కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. డైటింగ్ చేస్తున్నవాళ్లు ఒకపూట భోజనం లేదా టిఫిన్ మానేసి అరటిపండు, వెన్న తీసిన పాలు తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి.

మలబద్దకానికీ అరటి పండే మందు
అరటిలో ఉండే ఫైబర్ మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. పేగులను ఉత్తేజితం చేసి జీర్ణాశయంలోని వ్యర్థాలను బయటకు పంపేందుకు సహకరిస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అరటికి ఎయిడ్స్‌ వైరస్‌పై పోరాడే శక్తి ఉంది.అరటిలోఉండే ‘బాన్‌లెక్‌’ అనే రసాయనం ఎయిడ్స్‌ వైరస్‌పై శక్తిమంతంగా పోరాడుతుందని తేల్చారు. అరటిపండుతో ఒత్తిడిని జయించి సుఖనిద్ర పోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఇన్ని లాభాలున్న అరటిపండ్లను తరుచూ లాగించేయండి మరి.
Tags:    

Similar News