శ‌బ్ద‌మే ఆయుధం.. వెనెజులా సైనికుల‌పై అమెరికా తొలిసారి ప్ర‌యోగం

నేరుగా శ‌త్రువుల‌ను తుపాకులు, బాంబుల‌తో కంటే ప‌రోక్షంగా దెబ్బ‌కొట్ట‌డ‌మే న‌యా యుద్ధ‌రీతి.;

Update: 2026-01-12 09:27 GMT

ప‌ది రోజుల కింద‌ట ప్ర‌పంచాన్ని నివ్వెర‌ప‌రిచిన ఘ‌ట‌న‌... వెనెజులా అధ్య‌క్షుడిగా ఉన్న నికొల‌స్ మ‌దురోను అమెరికా ద‌ళాలు నిర్బంధించి ఎత్తుకెళ్ల‌డం..! అస‌లు ఎంత చిన్న దేశానికి అధ్య‌క్షుడు అయినా.. భారీ భ‌ద్ర‌త ఉంటుంది క‌దా..? పైగా సైన్యం ర‌క్ష‌ణ ఉంటుంది క‌దా? మ‌రి అమెరికా కేవ‌లం అర‌గంట‌లో ఆప‌రేష‌న్ మ‌దురోను ఎలా స‌క్సెస్ చేసింది.?? మ‌దురో సైన్యం ప్ర‌తిఘ‌టించ‌లేదా? ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం.. శ‌బ్ద‌మే ఆయుధం..! అని చెప్పాలి. వెనెజులా సైనికుల‌పై అమెరికా తొలిసారి ప్ర‌యోగించిన వైనం బ‌య‌ట‌కు వ‌స్తోంది. దీంతో వెనెజులా సైనికులు త‌మ క‌ళ్ల‌ముందే అధ్య‌క్షుడిని ఎత్తుకెళ్తున్నా ఏమీ చేయ‌లేక‌పోయారు. కొంద‌రైతే వాంతులు, త‌ల‌నొప్పితో విప‌రీతంగా ఇబ్బంది ప‌డ్డార‌ట‌. అంత శ‌క్తిమంత‌మైన ఆయుధాన్ని అమెరికా ప్ర‌యోగించిన‌ట్లు స్వ‌యంగా మ‌దురో గార్డ్ (ర‌క్ష‌ణ సిబ్బంది) ఒక‌రు తెలిపారు.

త‌ట్టుకోలేనంత‌గా ధ్వ‌ని త‌రంగం...

అత్యంత వేగంగా ప్ర‌యాణించే సూప‌ర్ సోనిక్ విమానాల గురించి విన్నాం కానీ.. సోనిక్ వెప‌న్స్ (ఆయుధాల) గురించి క‌నీసం చ‌దివి కూడా ఉండం క‌దా? వీటినే మ‌దురో నిర్బంధం స‌మ యంలో అమెరికా ద‌ళాలు ప్ర‌యోగించాయ‌ని తెలుస్తోంది. దీంతోనే కేవ‌లం నిమిషాల వ్య‌వ‌ధిలోనే వెనెజులా సైనికులు చేతులెత్తేశార‌ని స్ప‌ష్టం అవుతోంది. దీనికిముందు రాడార్ల‌ను అమెరికా ద‌ళాలు నిర్వీర్యం చేశాయి. ఆ త‌ర్వాత డ్రోన్లు మిడ‌త‌లుగా దూసుకొచ్చాయి. అనంతరం 8 హెలికాప్ట‌ర్లలో 20 మంది సైనికులు దిగిపోయారు. వంద‌ల‌మంది వెనెజులా భ‌ద్ర‌తా సిబ్బందిని అవాక్క‌య్యేలా చేస్తూ మ‌దురోను ఎత్తుకెళ్లారు. ఈ క్ర‌మంలో వారు అత్యంత తీవ్ర‌మైన ధ్వ‌ని త‌రంగం వంటిది ప్ర‌యోగించార‌ని మ‌దురో గార్డ్ చెప్పాడు. దాని కార‌ణంగా త‌ల‌లో బ‌ద్ద‌ల‌య్యేంత శ‌బ్దం వెలువ‌డింద‌న్నాడు. ముక్కుల నుంచి ర‌క్తం కారింద‌ని, కొంద‌రికి వాంతులూ అయ్యాయ‌ని వివ‌రించాడు. మ‌రికొంద‌రు నేల‌పై అలా ప‌డి పోయార‌ని తెలిపాడు.

ఇంత‌కూ ఏమిటీ సోనిక్ వెప‌న్స్

నేరుగా శ‌త్రువుల‌ను తుపాకులు, బాంబుల‌తో కంటే ప‌రోక్షంగా దెబ్బ‌కొట్ట‌డ‌మే న‌యా యుద్ధ‌రీతి. ఇందులో భాగ‌మే శ‌త్రు బ‌ల‌గాల‌ను నిశ్చేష్టుల‌ను చేసే సోనిక్ వెప‌న్స్. త‌మ టార్గెట్ ను కొట్టేందుకు మైక్రో వేవ్స్, లేజ‌ర్స్ వంటి వాడే విధానం. దీనికిముందు శ‌త్రువుల‌పై జీవాయుధాల‌ ప్ర‌యోగం అనేది ప్ర‌ధాన ఆందోళ‌న‌గా ఉండేది. ఇప్పుడు సోనిక్ వెప‌న్స్ వెలుగులోకి వ‌చ్చాయి. అమెరికా వ‌ద్ద ఈ ఆయుధాలు ఉన్న‌ట్లు ఇప్పుడు తెలుస్తోంది.

గాల్వాన్ లో భార‌త సైనికుల‌పై చైనా ప్ర‌యోగం?

2020లో అంతా కొవిడ్ లాక్ డౌన్లు, వైర‌స్ వ్యాప్తి ఆందోళ‌న‌ల‌తో ఉంటే.. చెనా మాత్రం భార‌త భూభాగమైన‌ ల‌ద్దాఖ్ లోని గాల్వాన్ లో చొర‌బాటుకు ప్ర‌య‌త్నించింది. ఆ స‌మ‌యంలో భార‌త సైనికుల‌పై చైనా మైక్రోవేవ్ ఆయుధం వాడింద‌నే ఆరోప‌ణ‌లున్నాయి. దీనిని డ్రాగ‌న్ త‌ర్వాత ఖండించింది.

Tags:    

Similar News