హాట్ సీటు మీద ఎంపీ గారి కన్ను... ?

Update: 2022-01-20 02:30 GMT
ఆయన ఒక విధంగా అదృష్టవంతుడు అనే చెప్పాలి. ఆయన విజయనగరం ఎంపీగా గెలిచి సత్తా చాటారు. ఆయనే  బెల్లాన చంద్రశేఖర్. ఆయన  మొదటి నుంచి అలాగే లక్కుని తొక్కుతూనే ఉన్నారు. విజయనగరం జిల్లాలో రాజకీయ దిగ్గజం మంత్రి బొత్స సత్యనారాయణకు ఆయన బంధువు అవుతారు. బొత్స ఆయనకు ఒక విధంగా రాజకీయ గురువుగా చూడాలి. ఆయన 2007 ప్రాంతంలో తొలిసారిగా విజయనగరం జెడ్పీ చైర్మన్ అయ్యారు. నాడు జెడ్పీ చైర్మన్ గా ఉన్న బొత్స ఝాన్సీ రాణి  బొబ్బిలి పార్లమెంట్ కి ఉప ఎన్నిక వస్తే పోటీ చేసి గెలిచారు. దాంతో ఆ సీట్లో వైఎస్ చైర్మన్ గా ఉన్న బెల్లాన చంద్రశేఖర్ కుదురుకున్నారు. ఆ తరువాత ఆయన బొత్సతోనే ఉంటూ వచ్చారు.

అయితే 2009 తరువాత వైఎస్సార్ చనిపోవడం, జగన్ పార్టీ పెట్టడంతో ఆయన కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చి చేరారు. ఆ విధంగా ఆయన ఫస్ట్ పార్టీలో చేరిన నేతగా ఉన్నారు. ఇక 2014 ఎన్నికల్లో ఆయన చీపురుపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి టీడీపీ అభ్యర్ధిని కిమిడి మృణాళిని చేతిలో ఓడిపోయారు. ఆ టైమ్ లో కాంగ్రెస్ నుంచి బొత్స సత్యనారాయణ  చీపురుపల్లిలో పోటీ చేసి బెల్లాన కంటే కూడా ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నారు.

ఇక 2019 ఎన్నికల్లో బెల్లాన చీపురుపల్లి టికెట్ ఆశించినప్పటికీ అప్పటికే పార్టీలో చేరిన బొత్సకే అది దక్కింది. అక్కడ 2004, 2009 లలో రెండు మార్లు గెలిచిన బొత్స 2019లో కూడా మూడవసారి గెలిచారు. దాంతో ఆయన మంత్రి కూడా అయిపోయారు. ఇక బెల్లానను జగన్ విజయనగరం ఎంపీ సీటు ఇచ్చారు. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత అశోక్ గజపతిరాజు మీద బెల్లాన దాదాపు యాభై వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఒక విధంగా జెయింట్ కిల్లర్ అనిపించుకున్నారు.

అయితే ఆయన ఇప్పటిదాకా జిల్లా రాజకీయాల మీద తనదైన ముద్రను వేసుకోలేకపోతున్నారు. బొత్స నీడగానే ఆయన ఉంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే వచ్చే ఎన్నికల్లో ఇదే మ్యాజిక్ రిపీట్ అయి బెల్లాన ఎంపీగా గెలుస్తారు అన్న నమ్మకం అయితే వైసీపీలో లేదు. కచ్చితంగా ఆయన్ని మార్చే సీన్ ఉంటుంది అంటున్నారు. బెల్లాన కూడా ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్నారని టాక్. ఆయన సొంత నియోజకవర్గం చీపురుపల్లి.  దాంతో ఆ సీటు మీద బెల్లాన కన్ను పడింది అంటున్నారు. అయితే  అక్కడ మంత్రి బొత్స  ఉన్నారు. ఆయన మరోసారి పోటీకి సై అంటున్నారు.

ఒకవేళ జగన్ ఆయనను పార్లమెంట్ కి పోటీ చేయిస్తే తప్ప ఆ సీటు ఖాళీ అవదు. అయితే బొత్స కూడా తాను సీటు ఖాళీ చేయాలంటే తన వారికే టికెట్ అని కండిషన్ పెట్టవచ్చు. ఆ విధంగా ఆ సీట్లో ఆయన సతీమణి ఝాన్సీ కానీ, కుమారుడు సందీప్ కానీ పోటీ చేసే వీలుంటుంది అంటున్నారు. మరి బెల్లానకు ఎక్కడ అకామిడేట్ చేస్తారో తెలియదు. ఒక విధంగా ఆయన పదవీ కాలం పూర్తి అయితే మళ్లీ టికెట్ దక్కే సీన్ అయితే ఉండదనే అంటున్నారు. ఈ లోగా బెల్లాన చేయాల్సింది ఏంటి అంటే తన రాజకీయ పలుకుబడిని బాగా  పెంచుకోవడం. ఆ విధంగా పెర్ఫార్మెన్స్ చూపిస్తే మరో మారు ఎంపీగా టికెట్ ఇచ్చే వీలు ఉటుంది అంటున్నారు. మొత్తానికి బెల్లాన ఎంపీ అయ్యారు. అక్కడితో రాజకీయ అదృష్టం ఆగుతుందా లేక  ముందుకు సాగుతుందా అంటే వెయిట్ అండ్ సీ అనే జవాబు వస్తోంది.
Tags:    

Similar News