ప్రత్యేక హోదాపై తొడగొట్టిన బాలయ్య

Update: 2016-08-04 07:30 GMT
నందమూరి నటసింహం - హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేకహోదా విషయంలో కేంద్రంపై ఫైరయ్యారు. నేరుగా ప్రధాని మోడీకే హెచ్చరికలు జారీ చేశారు. ‘‘నా తరపు నుంచి హెచ్చరిస్తున్నా” అని వార్నింగ్ ఇచ్చారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. గతంలోనే హోదాపై కేంద్రాన్ని తాను ఒకసారి హెచ్చరించానని… ఇప్పుడు మళ్లీ మళ్లీ హెచ్చరిస్తున్నానని చెప్పారు. ప్రాధేయపడాల్సిన అవసరం తమకు లేదన్నారు. హోదా ఇవ్వకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు.  సీఎం ఢిల్లీ వెళ్లారని కేంద్రంపై ఒత్తిడి తెస్తారన్నారు బాలయ్య. కేంద్రం దిగిరాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని… అంత దూరం పరిస్థితిని తెచ్చుకోవద్దని మోడీ సర్కార్ ను బాలకృష్ణ హెచ్చరించారు.

హైదరాబాదులోని ఉమ్మడి రాష్ట్రాల సచివాలయానికి ఈ రోజు వచ్చిన ఆయన అక్కడ ఏపీ కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కార్యాలయానికి వెళ్లారు. అప్పటికే కార్యాలయానికి చేరుకున్న అచ్చెన్నతో బాలయ్య భేటీ అయ్యారు. హిందూపురంలో స్టేడియం నిర్మాణానికి సంబంధించి అచ్చెన్న గతంలో బాలయ్యకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సదరు స్టేడియం నిర్మాణం అంశం ఎంతదాకా వచ్చిందని బాలయ్య ఈ సందర్భంగా ఆరా తీశారు. అంతేకాకుండా తన నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను ఆయన అచ్చెన్న ముందు ప్రస్తావించారు.

ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో తొడగొట్టారు. మోడీకి హెచ్చరికలు జారీ చేశారు. అయితే... బాలకృష్ణ బావ అయిన సీఎం చంద్రబాబే ప్రత్యేక హోదా విషయంలో మోడీ ముందు గట్టిగా గొంతెత్తలేక సన్నాయి నొక్కులు నొక్కుతున్న వేళ బాలయ్య వార్నింగులను బీజేపీ ఎంతవరకు పట్టించుకుంటున్నది అనుమానమే. పైగా... సీఎం చంద్రబాబు వియ్యంకుడు - బావమరిది ఇలా వార్నింగులు ఇస్తున్నారన్న విషయాన్ని ఏపీ బీజేపీ నేతలు కనుక మోడీ వరకు తీసుకెళ్తే అది కూడా చంద్రబాబు మెడకే చుట్టుకునే అవకాశాలుంటాయి. బాలయ్య ఏదో ఫ్లోలో వార్నింగులు ఇచ్చినా టీడీపీ కానీ, చంద్రబాబు కానీ వార్నింగులు ఇచ్చే పరిస్థితుల్లో లేరని పరిశీలకులు అంటున్నారు.
Tags:    

Similar News