మోడీ క‌ల‌ల ప్రాజెక్టు కేసీఆర్ స‌హాయం

Update: 2018-04-05 06:39 GMT
ఔను నిజ‌మే. ఇటీవ‌ల వ‌రుస‌గా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై విరుచుకుప‌డుతున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మోడీజీ ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కానికి స‌హాయ స‌హ‌కారాలు అందించ‌నున్నారు. దేశ‌మంత‌టికి ఉద్దేశించిన ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కానికి తెలంగాణ త‌ర‌ఫున అండ‌గా నిలిచేందుకు సిద్ధ‌మ‌య్యారు. దేశవ్యాప్తంగా సుమారు పదికోట్ల కుటుంబాలకు వైద్య సేవలందించేందుకు జాతీయ ఆరోగ్య భద్రతా పథకం (ఆయుష్మాన్ భారత్)ను అమలు చేయాలని భావించిన కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌ లో రూ. 12 వేల కోట్లను కూడా కేటాయించిన సంగ‌తి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న ‘ఆయుష్మాన్ భారత్’ పథకానికి తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రాజీవ్ ఆరోగ్యశ్రీ సాఫ్ట్‌ వేర్‌ ను వాడడంపై ఆలోచన లు జరుగుతున్నాయి.

ఆయుష్మాన్ భారత్ పథకం కింద సుమారు యాభై కోట్ల మందికి ఆరోగ్య సేవలతో పాటు బీమా కల్పించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వివిధ వ్యాధులకు ఆసుపత్రుల్లో చికిత్స (ఇన్ పేషెంట్లుగా)తో పాటు గరిష్టంగా ఐదు లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యం వర్తిస్తుంది. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేయ‌బోయే ప‌థ‌కానికి తెలంగాణ టెక్నాల‌జీని అందిపుచ్చుకోనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని విజ‌య‌వంతంగా అమలుచేస్తున్నందున కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ అధికారులు రాష్ట్రానికి వచ్చి ఈ పథకం అమలు తీరుతెన్నులను అధ్యయనం చేశారు. ఈ పథకం పకడ్బందీగా అమలవుతుండడంతో సంతృప్తి వ్యక్తం చేసి ఈ సాఫ్ట్‌ వేర్‌ ను ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమైన ఈ పథకం ఇప్పుడు తెలంగాణలోనూ అమలవుతున్నందున ఈ సాఫ్ట్‌ వేర్‌ ను వినియోగించుకోడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జాతీయ స్థాయిలో దీన్ని అమలుచేయడంతో పాటు ఈ సాఫ్ట్‌ వేర్ వాడే వెబ్‌ సైట్‌ లో ‘తెలంగాణ ప్రభుత్వ సహకారం’ అనే పదాలను కూడా ప్రదర్శిస్తామని, ‘క్రెడిట్’ను రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని స్పష్టం చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు వైద్యారోగ్య వ‌ర్గాల స‌మాచారం.

రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎలాంటి వైద్య సేవలు ప్రజలకు అందుతున్నాయని, ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్సలు ఏ విధంగా లభ్యమవుతున్నాయి, సాఫ్ట్‌ వేర్ ద్వారా సమన్వయం ఏ విధంగా సాధ్యమవుతోంది, ఆన్‌లైన్ ద్వారానే ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకోవడంలో ఉన్న ప్రత్యేకతలు.. ఇలా అనేక కోణాల నుంచి అధ్యయనం చేసిన కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారుల బృందం ఈ సాఫ్ట్‌ వేర్ పనితీరును ప్రశంసించింది. రాజీవ్ ఆరోగ్య శ్రీ‌ సాఫ్ట్‌ వేర్‌ కు ‘పేటెంట్’ ఉన్నందువల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి విధిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటున్నందున కేంద్రం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసింది. దీనికి తెలంగాణ స‌ర్కారు ఓకే చెప్పేసింది.
Tags:    

Similar News