అచ్చెన్నాయుడుకు అద్భుత అవకాశం

Update: 2015-09-01 17:32 GMT
ఏపీ మంత్రి అచ్చెన్నాయుడుకు అద్భుత అవకాశం వచ్చింది. తమ పార్టీ చిరకాల ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల నుంచి శాశ్వతంగా బయటకు పంపించే సమయం చేతికి చిక్కింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఆంద్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకీ తిరుగుండదు. అచ్చెన్నాయుడుకూ తిరుగుండదు.

చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో కేసీఆర్, జగన్ కుమ్మక్కయ్యారని అచ్చెన్నాయుడు ఎప్పటి నుంచో విమర్శలు చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఓ హోటల్లో హరీశ్ రావు, స్టీఫెన్సన్, జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారని, ఓటుకు నోటుకు కుట్ర చేశారని ఆరోపించారు. స్టీఫెన్సన్ కు నామినేటెడ్ ఎమ్మెల్యే రావడానికి జగనే కారణమని కూడా ఆరోపించారు. అది కూడా శాసనసభ సాక్షిగా ఈ ఆరోపణలు చేశారు. అయితే అప్పటికప్పుడే వాటిని జగన్ ఖండించారు. తనకు స్టీఫెన్సన్ ఎవరో తెలియదన్నారు. తాను హరీశ్ తో సమావేశం కాలేదన్నారు. ఆయన చెప్పిన హోటల్ కూడా తెలియదన్నారు. ఒకవేళ తాను సమావేశమయ్యానని, లేఖ ఇచ్చానని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటానని సవాల్ చేశారు. ఒక్కసారి కాదు పదిసార్లు అసెంబ్లీ సాక్షిగా ఆయన గట్టిగా సవాల్ చేశారు.

స్టీఫెన్సన్ కు నామినేటెడ్ ఎమ్మెల్యే పదవి రావడానికి జగనే కారణమని ఇప్పుడు కనక అచ్చెన్నాయుడు నిరూపిస్తే అంతకు మించిన రాజకీయ ఎత్తుగడ మరొకటి ఉండదు. జగన్, హరీశ్ సమావేశమయ్యారని నిరూపించినా అంతే. స్టీఫెన్సన్ ఎవరో తెలియదని చెప్పిన జగన్ పూర్తిస్థాయిలో ఇరుక్కుపోవడం ఖాయం. ఒకవేళ అదే నిజమైతే ఆయనను సీమాంధ్ర ప్రజలెవరూ ఇక జీవితంలో నమ్మే పరిస్థితి ఉండదు. అచ్చెన్నాయుడుకు ఇంతకు మించిన అద్భుత అవకాశం జీవితంలో రాదు. దానిని వెంటనే సద్వినియోగం చేసుకోవాలని, జగన్ అబద్ధాలను బయటపెట్టాలని టీడీపీ శ్రేణులు కోరుతున్నాయి.

అచ్చెన్నాయుడు ఆ లేఖలను బయటపెడితే జగన్ తప్పు చేసినట్లని.. అచ్చెన్నాయుడు వాటిని బయట పెట్టకపోతే అచ్చెన్నాయుడివి ఉత్తుత్తి ఆరోపణలని, ఎదురు దాడి మాత్రమేనని, అప్పుడు టీడీపీని కూడా విశ్వసించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
Tags:    

Similar News