టీచర్ల అంచనాలు తిరగబడ్డాయా ?

Update: 2023-03-17 12:02 GMT
ఇపుడీ విషయమే అందరిలోను హాట్ టాపిక్ అయిపోయింది. పట్టభద్రులు, టీచర్ల కోటాలో భర్తీ అవ్వాల్సిన ఐదు ఎంఎల్సీ స్ధానాలకు ఎన్నికలు జరిగాయి. దాని ఫలితాలే ఇపుడు వస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా ఓట్ల లెక్కింపు జరుగుతుంటే రెండు నియోజకవర్గాల్లో ఫలితాలు ప్రకటించారు. పోలింగ్ కు ముందు, తర్వాత కూడా అందరిలోను జనరల్ గా వినిపించిన మాటేమిటంటే రెండు టీచర్ల నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని.

కానీ జరిగిందే ఏమిటంటే పూర్తి రివర్సు. నెల్లూరు-చిత్తూరు-ప్రకాశం జిల్లాల టీచర్ల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి పర్వతనేని చంద్రశేఖరరెడ్డి గెలిచారు. ఈయన పీడీఎఫ్ అభ్యర్ధి బాబురెడ్డిపై మంచి మెజారిటితో గెలిచారు. స్వతహాగానే మంచిపేరున్న పర్వతనేని మొదటినుండి గెలుస్తాడని అనుకుంటునే ఉన్నారు.

అయితే ఓట్లేయాల్సింది టీచర్లే కాబట్టి గెలుపు గ్యారెంటీ లేదనే టాక్ కూడా వినబడింది. పీఆర్సీ, బకాయిలు, జీతాల చెల్లింపులో ఆలస్యం తదితర కారణాలతో టీచర్లంతా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు చేసిన ఉద్యమాలు అందరికీ తెలిసిందే. కాబట్టి టీచర్ల నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్ధుల గెలుపుపై ఉత్కంఠ పెరిగిపోయింది. తీరా ఫలితాలు చూసిన తర్వాత అందరు ఆశ్చర్యపోయారు. అలాటే పశ్చిమ రాయలసీమ నియోజకవర్గం నుండి ఎంవీ రామచంద్రారెడ్డి పోటీచేశారు. ఈయన పీడీఎఫ్ అభ్యర్ధి ఒంటేరు శ్రీనివాసులరెడ్డిపై 165 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

రెండు టీచర్ల నియోజకవర్గాల ఎన్నికల్లో రెండింటిలోను వైసీపీ ఓడిపోతుందని టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్, జనసేన నేతలు పెద్దఎత్తున ప్రచారం చేశారు. తీరా ఫలితాలు చూస్తే రెండింటిలోను వైసీపీ అభ్యర్ధులే గెలిచారు. మరి ప్రచారం జరిగినట్లు టీచర్లలో ప్రభుత్వంపై అంతగా ఆగ్రహం లేదా ? లేదా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.  

లేకపోతే అభ్యర్ధులు మ్యానేజ్ చేసుకున్నారా ? బలమైన అభ్యర్ధులను వైసీపీ ముందుగానే ప్రకటించింది. పైగా ఇద్దరు కూడా ప్రైవేటు స్కూల్ నడుపుతున్నవారే. అదీకాకుండా ఇద్దరికీ టీచర్లందరితోను మంచి సంబంధాలున్నట్లు సమాచారం. కారణాలు ఏవైనా ఓడిపోతారని అనుకున్న టీచర్ల నియోజకవర్గాల్లో వైసీపీ గెలవటమే ఆశ్చర్యంగా ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News