ఒకటి తర్వాత ఒకటిగా మూత పడుతున్న ఏపీ థియేటర్లు

Update: 2021-12-25 05:34 GMT
గడిచిన కొద్ది రోజులుగా సినీ పరిశ్రమ వర్సెస్ ఏపీ ముఖ్యమంత్రి అన్నట్లుగా సాగుతున్న పోరులో తాజాగా థియేటర్లు స్వచ్ఛందంగా మూసేసే వరకు విషయం వెళ్లింది. సినిమా టికెట్ల ధరల్ని కారుచౌకగా తగ్గిస్తూ ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని థియేటర్ యజమానలు హాహాకారాలు చేస్తున్నారు. ప్రభుత్వం డిసైడ్ చేసిన ధరలకు టికెట్లు అమ్మితే.. ఒక షోకు హాల్ మొత్తం నిండినా కూడా.. దానికయ్యే కరెంటు బిల్లు కూడా రాదని వాపోతున్నారు. దీంతో.. సినిమాల్ని వేసి దారుణ నష్టాల బారిన పడే కన్నా.. థియేటర్ మూసుకొని ఇంట్లో కూర్చోవటం మంచిదన్నట్లుగా చెబుతున్నారు.

తమ మాటలకు తగ్గట్లే.. క్యాలెండర్ లో రోజు గడిచేసరికి ఏపీలో మూత పడుతున్న థియేటర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తెరిచి ఉన్న థియేటర్లను అధికారులు తనిఖీలు చేసి.. నోటీసుల మీద నోటీసులు జారీ చేస్తున్నారు. భారీగా ఫైన్లు వేస్తున్నారు. మొత్తంగా.. ధియేటర్ల లెక్క తేల్చే విషయంలో ఏపీ అధికారులు కమిట్ మెంట్ తో పని చేస్తున్నారన్న భావన కలిగేలా చేస్తోంది.

తాజా పరిణామాల నేపథ్యంలో తమ సినిమా థియేటర్ ను సాంకేతిక కారణాలతో మూసేస్తున్నట్లుగా కొందరు యజమానులు చెబుతుంటే.. మరికొందరు మాత్రంఏపీ ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరలతో తాము సినిమా హాళ్లను నిర్వహించలేమన్న విషయాన్ని స్పష్టంగా పేర్కొంటూ థియేటర్ కు తాళాలు వేస్తున్నారు. ఇంకొందరు మాత్రం ప్రొజెక్టర్ లో సమస్యలు ఉండటంతో తాము థియేటర్ ను తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లుగా బోర్డులు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే.. శుక్రవారం గుంటూరుజిల్లాలో మొత్తం70 థియేటర్లను తనిఖీ చేసిన అధికారులు.. 35 సినిమా హాళ్లకు నోటీసులు జారీ చేశారు. నాలుగు హాళ్లను సీజ్ చేశారు. మరికొన్నింటికి రూ.10 వేలు చొప్పున ఫైన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విశాఖలో ఫేమస్ అయిన జగదాంబ థియేటర్ల సముదాయంలో త్రీడీ సినిమాకు ఇచ్చే కళ్లాద్దాల కోసం అదనంగా వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదు రావటంతో తనిఖీలు చేస్తున్నారు.

ఆ మాటకు వస్తే.. త్రీడీ సినిమాకు మామూలు షో కన్నా రూ.30 టికెట్ అదనంగా వసూలు చేయటం మొదట్నించి ఉంది. ప్రస్తుతం అది రూల్ కు విరుద్ధంగా ఉందన్న మాట వినిపిస్తోంది.తాజాగా జగదాంబ థియేటర్ కు నోటీసులు ఇచ్చిన అధికారులు.. యాజమాన్యం నుంచి వివరణ కోరుతున్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఒక థియేటర్.. కడప జిల్లాలోని ప్రొద్దుటూరులోని నాలుగు థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. మొత్తంగా ఏపీలో థియేటర్లు అయితే స్వచ్ఛందంగా లేదంటే అధికారుల తనిఖీల్లోనూ మూత పడుతున్నాయి. విషయం ఏదైనా మూతపడటం మాత్రం కామన్ గా మారిందన్న అభిప్రాయం పలువురి నోట వినిపిస్తుండటం గమనార్హం.




Tags:    

Similar News