కరోనా హాట్ స్పాట్ గా ఏపీ సచివాలయం .. ముగ్గురు మృతి !

Update: 2021-04-19 10:30 GMT
ఏపీలో కరోనా వైరస్ మరోసారి జూలు విదుల్చుతోంది. గతంలో కంటే భయంకరమైన కల్లోలం సృష్టిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య ఇప్పటికే ఏడు వేల మార్కును దాటింది. ఒక్కరోజులో నమోదైన కేసుల సంఖ్యే ఏడు వేలు దాటడం ఆందోళన పెరిగేలా చేస్తుంది. ఇదే పరిస్థితి కొనసాగితే..24 గంటల్లో పదివేల మార్కును అందుకున్నా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. తాజాగా కరోనా విస్తరణ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రజలు, వ్యాపారస్థులు స్వచ్ఛందంగా లాక్ డౌన్ విధించుకుంటున్నారు. తాజాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పాలనకు కేంద్రమైన సచివాలయంలో కరోనా విజృంభిస్తుండడం కలకలం రేపుతోంది. ఇప్పటికే 60 మందికి పైగా ఉద్యోగులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా పాజిటివ్ గా తేలింది.

మూడు రోజుల్లో ముగ్గురు సచివాలయ ఉద్యోగులు కరోనాతో మృతి చెందారు. పంచాయతీరాజ్ శాఖ సెక్షన్ ఆఫీసర్ శాంతకుమారి కరోనాతో మరణించారు. రెండు రోజుల క్రితం శాంతకుమారి భర్త కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే. హోంశాఖలో రికార్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తి కరోనాతో మరణించారు. సాధారణ పరిపాలన శాఖలో సెక్షన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న జి.రవికాంత్‌ ఉదయం కరోనాతో మృతి చెందారు. అలాగే ఆర్థిక శాఖలో అసిస్టెంట్‌ సెక్రటరీగా పని చేసే వి.పద్మారావు కరోనా‌ సోకి మరణించారు. దీంతో సచివాలయం ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా సచివాలయం ఉద్యోగులు కరోనాతో మృతిచెందటం పట్ల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తన చాంబర్ ‌లో రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత వరకు వ్యాక్సినేషన్‌ తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు.
Tags:    

Similar News