దేవుడి దయతో ముఖ్యమంత్రిని అవుతా.. మీ లెక్కలు తేలుస్తా? కవిత హాట్ కామెంట్స్

బీఆర్ఎస్ నుంచి తనను బయటకు పంపడాన్ని జీర్ణించుకోలేకపోతున్న కవిత.. ఆ పార్టీ నేతల అందరి చిట్టా విప్పుతానని హెచ్చరిస్తున్నారు.;

Update: 2025-12-12 14:29 GMT

తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. బీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా ఆమె చేస్తున్న కామెంట్లు కాకరేపుతున్నాయి. తనను పార్టీ నుంచి బయటకు పంపిన వారి కళ్లు ఇంకా చల్లబడలేదా? అంటూ ప్రశ్నిస్తున్న కవిత.. తన భర్త ఫోన్ ను ట్యాప్ చేయడంపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో ఒక రోజు తనకు టైం వస్తుందని, రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతానని, ఆ రోజు 2014 నుంచి జరిగిన అక్రమాలను బయటపెడతానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కవిత.

బీఆర్ఎస్ పార్టీలో కవిత వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పార్టీలో ముఖ్య పదవి ఆశించిన కవితను తండ్రి కేసీఆర్ బయటకు పంపారు. అప్పటి నుంచి రగిలిపోతున్న కవిత.. తనకు చెందిన సాంస్కృతిక సంస్థ జాగృతి ద్వారా ప్రజల్లోకి వెళుతున్నారు. ఈ క్రమంలో ఆమెకు అందుతున్న ఫిర్యాదులపై ఘాటుగా స్పందిస్తూ బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై కవిత భూకబ్జా ఆరోపణలు చేశారు. దీనిపై రియాక్ట్ అయిన ఎమ్మెల్యే మాధవరం ప్రత్యారోపణలు చేస్తూ కవితపై నిరాధార నిందలు వేశారని అంటున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం మీడియాతో మాట్లాడిన కవిత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వారంలో బహిరంగ క్షమాపణ చెప్పాలని లేదంటే, చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

బీఆర్ఎస్ నుంచి తనను బయటకు పంపడాన్ని జీర్ణించుకోలేకపోతున్న కవిత.. ఆ పార్టీ నేతల అందరి చిట్టా విప్పుతానని హెచ్చరిస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో కొందరు పారిశ్రామికవేత్తలను ఎంపిక చేసుకుని వారికి ప్రయోజనం కలిగేలా వ్యవహరించారని, భారీ స్థాయిలో అవినీతి చేశారని ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కుమార్తెగా పదేళ్ల పాలనలో లోటుపాట్లు తెలిసిన కవిత ఇలా మాట్లాడటం సంచలనం రేపుతోంది. ఆమె వ్యూహం ఎవరికీ అంతుచిక్కడం లేదని అంటున్నారు. కవిత ఆరోపణలకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? లేక రాజకీయంగా పార్టీని బద్నాం చేయడానికే ఆమె ఇలా వ్యవహరిస్తున్నారా? అనే చర్చ జరుగుతోంది. కవిత వైఖరి వల్ల బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా నష్టమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఇక బీఆర్ఎస్ నేతల అవినీతిపై ఆరోపణలు చేస్తున్న కవిత.. తన భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారని మరో సంచలనానికి తెరతీశారు. ప్రస్తుతం ఒక టాస్క్ మాత్రమే నడుస్తోందని, టెస్ట్ మ్యాచ్ ముందు ఉంటుందని హెచ్చరించిన కవిత.. ఇకపై తాను సైలెంటుగా ఉండనని తేల్చిచెప్పారు. ఇలా కవిత మాట్లాడటం, ఫోన్ ట్యాపింగ్ పై ఆరోపణలు చేయడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం నాటి బీఆర్ఎస్ పెద్దలను ఇరుకున పెట్టేలా నడుచుకుంటోందని అంటున్నారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకరరావు బెయిలు కూడా రద్దు చేయించి విచారణకు సిద్ధమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి అల్లుడి ఫోన్ కూడా ట్యాప్ చేస్తారా? అంటూ కవిత లేవనెత్తిన ప్రశ్న.. బీఆర్ఎస్ ను డిఫెన్స్ లోకి నెట్టేసేలా ఉందని అంటున్నారు.

Tags:    

Similar News