డీకే కొత్త సీఎం... కర్ణాటకంలో కొత్త ముహూర్తం ?
ఇక కర్ణాటకలో చూస్తే విందు రాజకీయాలు మొదలయ్యాయి. బేలాలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రవీణ్ అన్న నాయకుడికి చెందిన ఫాం హౌస్ లో విందు రాజకీయం స్టార్ట్ అయింది.;
కర్ణాటక కాంగ్రెస్ రాజకీయానికి క్లైమాక్స్ సీన్ దగ్గర పడింది అని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే కొత్త ఏడాదిలో కొత్త సీఎం రావచ్చు అన్నది ఇపుడు అక్కడ వినిపిస్తున్న హాట్ టాక్ గా ఉంది. నిన్నటి దాకా సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ల మధ్య బ్రేక్ ఫాస్ట్ పాలిటిక్స్ నడిచింది. ఇపుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య విందు రాజకీయం స్టార్ట్ అయి శీతాకాలంలో సరికొత్త వేడిని పుట్టిస్తోంది.
డీకే సీఎం అంటూ :
ఇదిలా ఉంటే కర్ణాటకలో శీతాకాల శాసనసభ సమావేశాలు ప్రస్తుతం మొదలయ్యాయి. అయితే ఈ సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల తరువాత కొత్త సీఎం గా డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరిస్తారు అంటూ ఇక్బాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కర్ణాటకలో చర్చనీయాంశం అవుతున్నాయి.
విందు రాజకీయం జోరు :
ఇక కర్ణాటకలో చూస్తే విందు రాజకీయాలు మొదలయ్యాయి. బేలాలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రవీణ్ అన్న నాయకుడికి చెందిన ఫాం హౌస్ లో విందు రాజకీయం స్టార్ట్ అయింది. ఈ విందు సమావేశానికి మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఏకంగా 55 మంది దాకా హాజరయినట్లుగా చెబుతున్నారు. దాంతో అందరి ఫోకస్ ఈ మీటింగ్ మీద పడింది. ఈ సమావేశానికి హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ మాట్లాడుతూ సీఎం మార్పు మీద చేసిన వ్యాఖ్యలతో ఈ సమావేశం అజెండా ఏమిటి అన్నది కూడా చర్చించుకుంటున్నారు. ఈ విందులోనే ఇక్బాల్ మాట్లాడుతూ తాను అందరికీ ఒక గుడ్ న్యూస్ చెబుతున్నాను అని చెప్పుకొచ్చారు. ఆ గుడ్ న్యూస్ డీకే శివకుమార్ తొందరలోనే ముఖ్యమంత్రి అవుతారు అని ఆయన చెప్పారు. ఆ మీదట ఆయన మీడియాతో కూడా మాట్లాడుతూ, తప్పకుండా డీకే శివకుమార్‌కు అవకాశం లభిస్తుందని ఆయన డ్యాం ష్యూర్ గా సీఎం అయి తీరుతారు అని జోస్యం చెప్పుకొచ్చారు.
ఆయన పోరాటం అంటూ :
తాము అంతా కలసి విందు సమావేశం నిర్వహించడం తప్పు కానే కాదని ఇక్బాల్ అంటున్నారు. పైగా అందులో తప్పేం ఉందని ఆయన ప్రశ్నించడం విశేషం. ఇక డీకే చేసినపోరాటం కృషి తప్పకుండా ఫలిస్తుందన్న నమ్మకం తమకు అందరికీ ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక తామంతా కలసి విందులో పాల్గొన్నామని అది సాధారణంగా జరిగే మీటింగ్ గానే చూడాలని అన్నారు. ఎలాంటి బల ప్రదర్శన అది కానే కాదని ఆయన చెప్పడం విశేషం.
జోరు చేస్తున్న పాలిటిక్స్ :
ఇక్బాల్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో కర్ణాటక రాజకీయం ఒక్కసారిగా ఊపందుకుంది. అంతే కాదు విందు రాజకీయాలు మరిన్ని జరిగే అవకాశాలు ఉండే చాన్స్ ఉంది అని అంటున్నారు. డీకే వర్గం విందు రాజకీయం చేస్తే సిద్ధరామయ్య వర్గం కూడా పోటీగా ముందుకు రావచ్చు అని అంటున్నారు. అయితే పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒకే చోట సమావేశం కావడం ఇటీవల కాలంలో అతి పెద్ద రాజకీయ కుదుపుగా భావిస్తున్నారు దీంతో కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఏమైనా సంకేతాలు వచ్చాయా అన్నది కూడా అంతా చర్చిస్తున్నారు. దీంతో కర్ణాటకలో ఏమి జరుగుతుంది అన్న ఉత్కంఠ అయితే మొదలైంది.