ఆ ఒక్క 'మాట'కు... పవన్ కల్యాణ్ కరిగిపోయారంతే!!
ప్రతి మహిళ క్రికెటర్‌కీ పట్టు చీర, శాలువాతోపాటు జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన బహుమతులను అందించి సత్కరించారు.;
రాజకీయాల్లో ఉన్న నాయకులకు నిత్యంఅనేక విజ్ఞాపనలు వస్తుంటాయి. అనేక మంది వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి.. తమ సమస్యలు చెప్పుకొంటారు. తమ ఇబ్బందులు తీర్చాలని కోరుకుంటారు. ఇవన్నీ వ్యక్తిగతం అయితే.. కొంత ఆలస్యంగా.. సామాజిక వర్గాల పరంగా అయితే.. ఒకింత వేగంగా ఆయాపనుల ను పూర్తి చేసేందుకు రాజకీయ నేతలు, ప్రభుత్వ వర్గాలు కూడా ప్రయత్నిస్తాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వద్దకు వచ్చింది. ఆయన ఆ ఒక్కమాటకు కరిగిపోయారు!.
ఏం జరిగింది?
ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు తాజాగా శుక్రవారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా పవన్ అంధుల ప్రపంచ కప్ సాధించిన క్రికెటర్లను అభినందించారు. ఒక్కో క్రికెటర్ కీ రూ.5 లక్షల చొప్పున చెక్ ప్రదానం చేశారు. శిక్షకులకు రూ.2 లక్షలు చొప్పున చెక్కులు అందించారు.
ప్రతి మహిళ క్రికెటర్‌కీ పట్టు చీర, శాలువాతోపాటు జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన బహుమతులను అందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా అంధ క్రికెటర్లు సాధించిన విజయం దేశానికే గర్వకారణమని కొనియాడారు. అంధ క్రికెటర్ల ప్రాక్టీస్ కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని, అన్ని విధాలా అండగా నిలవాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా విజ్ఞప్తి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా..
ఈ సందర్భంగా ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఉన్న ఏపీ క్రీడాకారీణులు దీపిక(జట్టు కెప్టన్), పాంగి కరుణా కుమారి ఉండటం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా జట్టు కెప్టన్ దీపిక తమ గ్రామ సమస్యలు తెలిపారు. ఆమె శ్రీ సత్యసాయి జిల్లా హేమావత్ పంచాయతీ తంబలహట్టి తండాకు చెందినవారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కావాలని దీపిక విజ్ఞప్తి చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకి చెందిన క్రికెటర్ కరుణకుమారి కూడా తమ గ్రామానికి కూడా రోడ్డు వేయాలని అభ్యర్థించారు.
ఈ ఒక్క మాటకు పవన్ కల్యాణ్ కరిగిపోయారు. ఆ వెంటనే ఆయన సంబంధిత కలెక్టర్లతో మాట్లాడారు. మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. సాధ్యమైనంత వేగంగా పనులు ప్రారంభించేలా చేస్తానని క్రికెటర్లకు హామీ కూడా ఇచ్చారు. దీనికి మహిళా క్రికెటర్లు.. పొంగిపోయారు. సంతోషంతో పవన్ కల్యాణ్‌ను కొనియాడారు.