నెల్లూరు మేయర్ పీఠం.. టీడీపీ వ్యూహమేంటి ..!
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పటి వరకు వైసీపీలో ఉండి.. ఇటీవల టీడీపీ లో చేరిన కార్పొరేటర్లు.. ఐదుగురు తిరిగి జగన్ చెంతకు చేరుకున్నారు.;
నెల్లూరు నగర మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు టీడీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడ 2020-21 మధ్య జరిగిన ఎన్నికల్లో వైసీపీ మెజారిటీ దక్కించుకుంది. దీంతో మేయర్ పీఠం ఆ పార్టీకే దక్కింది. అయి తే. కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. సహజంగానే మార్పులు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే మేయర్ స్రవంతిని గద్దె దింపాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 18న ఆమెపై అవిశ్వాసం కూడా పెట్టనున్నారు. ఈ అవిశ్వాసంలో టీడీపీ విజయం దక్కించుకుంటే.. నెల్లూరు మేయర్ పీఠం ఈ పార్టీకి దక్కుతుంది.
మంత్రి గారి మంత్రాంగం
మంత్రి పొంగూరు నారాయణ సొంత జిల్లా, పైగా సొంత నియోజకవర్గం కావడంతో ఇక్కడ టీడీపీని పరుగు లు పెట్టించాలని భావించారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నుంచి 40 మందిని పార్టీలోకి తీసుకువచ్చారు. వీరి ద్వారా అవిశ్వాసం ప్రవేశ పెట్టి.. ఇప్పుడు ఈ సీటును కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నిజానికి ఈ ప్రయత్నంలో మంత్రి తీవ్రస్థాయిలో మంత్రాంగాన్ని నడిపారు. అయినా.. ఆయన ఊహించినట్టుగా మాత్రం ఎక్కడా పరిస్థితి కనిపించడం లేదు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పటి వరకు వైసీపీలో ఉండి.. ఇటీవల టీడీపీ లో చేరిన కార్పొరేటర్లు.. ఐదుగురు తిరిగి జగన్ చెంతకు చేరుకున్నారు. దీంతో బలాబలా మధ్య ఇద్దరు ముగ్గురు కార్పొరేటర్ల తేడా ఉంది. ఈ నేపథ్యంలో మరో ముగ్గురు ఎమ్మెల్యేలను తమ చెంతకు తీసుకు నేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయం తెలియగానే టీడీపీ క్యాంపు రాజకీయాలకు తెరదీ సింది. కార్పొరేటర్లను వేరే ప్రాంతానికి పంపించారు.
ఇక, అవిశ్వాస తీర్మానంపై ఈ నెల18న కౌన్సిల్‌లో చర్చించనున్నారు. ఆ రోజు జరిగే ఎన్నిక ద్వారా టీడీపీ తరఫున మేయర్‌ను ఎన్నుకుంటారు.కానీ.. ఈ అవకాశం చిక్కుతుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే.. వైసీపీ కూడా దూకుడానే ఉంది. పైగా మాజీ మంత్రి అనిల్‌కుమార్ సొంత ఇలాకా కూడా కావడంతో ఎట్టి పరిస్థితిలోనూ ఈ సీటును వదులు కోరాదని నిర్ణయించారు. దీంతో ఈ నెల 18న ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది.