రివాబా.. ఇది సబబా? జడేజా భార్య వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
కొందరు టీమ్ ఇండియా ఆటగాళ్లు విదేశీ పర్యటనల సందర్భంగా చెడు వ్యసనాలకు లోనవుతారని రివాబా అన్నారు. తన భర్త జడేజా మాత్రం అలాంటివాడు కాదని పొగిడారు.;
టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్య, గుజరాత్ బీజేపీ ప్రభుత్వంలోని మంత్రి రివాబా జడేజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీమ్ ఇండియా కల్చర్ నే అనుమానించేలా ఆమె మాట్లాడారు. 16 ఏళ్లుగా జాతీయ జట్టులో సభ్యుడిగా ఉన్న క్రికెటర్ కు భార్య అయి ఉండి, ఓ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగానూ కొనసాగుతున్న రివాబా అనవసర వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ఏ ఉద్దేశంలో స్పందించారో కానీ.. సోషల్ మీడియా ట్రోలర్లకు దొరికారు. ఇదే పనిగా నెటిజన్లు రివాబా నిబద్ధతను ప్రశ్నిస్తున్నారు. బాధ్యతాయుత పదవుల్లో, హోదాలో ఉన్న మహిళగా ఇలా మాట్లాడడం సరికాదని తప్పుబడుతున్నారు. ఓవైపు తన భర్తకు టీమ్ ఇండియా టెస్టు వైస్ కెప్టెన్ హోదా, వన్డేల్లో పునరాగమనం దక్కగా ఇలాంటి సమయంలో రివాబా ప్రవర్తించిన తీరు సరిగా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, తన వ్యాఖ్యలు ఇంతటి చర్చకు దారితీస్తాయని ఆమె ఊహించినట్లు లేదు. పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా ఎలా స్పందించాలో తెలియక మిన్నకున్నారా? లేకపోతే విషయం తనవరకు చేరలేదా? అన్నది తెలియాల్సి ఉంది.
ఎవరి ఇష్టం వారిది..
కొందరు టీమ్ ఇండియా ఆటగాళ్లు విదేశీ పర్యటనల సందర్భంగా చెడు వ్యసనాలకు లోనవుతారని రివాబా అన్నారు. తన భర్త జడేజా మాత్రం అలాంటివాడు కాదని పొగిడారు. ఎక్కడకు వెళ్లినా ఆయన బాధ్యతగా నడుచుకుంటారని వ్యాఖ్యానించారు. అయితే, తన భర్తను బంగారం అని పొగిడే క్రమంలో రివాబా కాస్త వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సహజంగా ఏ దేశ క్రికెటర్లయినా విదేశీ టూర్లకు వెళ్లిన సమయంలో అక్కడి నగరాలు, ప్రదేశాల సందర్శకు వెళ్తారు. లాంట్ టూర్ అయితే ఇలాంటి మరీ సహజం. కొందరు నైట్ లైఫ్ ఎంజాయ్ చేసేందుకు పబ్ లకు, మార్కెట్లను సందర్శిస్తారు. దీనికి మేనేజర్, కోచ్, కెప్టెన్ పర్మిషన్ కూడా తీసుకుంటారు. ఇక అక్కడ ఏం అలవాటు చేసుకున్నారు? అన్నది తర్వాతి విషయం. కానీ, రివాబా దానిని ప్రస్తావించడం సరైనది కాదని నెటిజన్లు అంటున్నారు.
సంప్రదాయవాది రివాబా
రవీంద్ర జడేజా భార్యగా రివాబాకు మంచి గుర్తింపే ఉంది. బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికకూ అది ఉపయోగపడింది. ఇటీవల మంత్రి కూడా అయ్యారు. ఇక రివాబా భారతీయ సంప్రదాయాలను బాగా ఆచరిస్తారు. గ్రౌండ్ లోనే భర్త జడేజా పాదాలకు నమస్కరిస్తున్న ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. మిగతా క్రికెటర్ల భార్యల్లా కాకుండా చీరకట్టులో గ్రౌండ్ కు వస్తుంటారు. అలాంటి రివాబా అనవసరంగా నోరు జారి విమర్శలకు గురవుతున్నారు. తన భర్త ప్రవర్తనను మెచ్చుకుని ఉంటే సరిపోయేది. కానీ, ఆ క్రమంలో మిగతా క్రికెటర్ల జీవన శైలిని కించపరిచేలా మాట్లాడాడం సరికాదని మర్చిపోయారు. మరి దీనిపై ఆమె ఎలాంటి స్పందన వ్యక్తం చేస్తారో చూడాలి.