అనుకున్నదే; అనురాధపై బదిలీ వేటు

Update: 2015-07-06 08:24 GMT
ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర సర్కారు ఎత్తుల్ని గ్రహించటంతో పాటు.. ఏపీకి చెందిన కీలక వ్యక్తుల ఫోన్లను ట్యాపింగ్‌ విషయంలో సమాచార సేకరణతోపాటు.. ఈ మొత్తం వ్యవహారాన్ని గుర్తించటంలో పూర్తిస్థాయిలో వైఫల్యం పొందిందని ఏపీ ఇంటెలిజెన్స్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఒకదశలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఇంటెలిజెన్స్‌ డీజీ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయటం తెలిసిందే.

తాజాగా జపాన్‌ పర్యటనలో ఉన్న చంద్రబాబు బిజీబిజీగా ఉన్న సమయంలో.. ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ అనురాధపై బదిలీ వేటు పడింది. ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ క్యాబినెట్‌ సమావేశంలో ఆమె అనుచితంగా మాట్లాడారని.. దీనిపై మండి పడిన మంత్రివర్గ సభ్యుల తీరుతో ఆమె నొచ్చుకొని సమావేశం నుంచి బయటకు వచ్చేసి.. అధికారిక వాహనాన్ని వదిలేసి వెళ్లిపోవటం లాంటి పరిణామాలు జరిగినప్పుడే.. అనురాధపై వేటు పడటం ఖాయమని తేలింది.

అయితే.. ఓటుకు నోటు విషయంలో పరిస్థితి సున్నితంగా ఉన్న సమయంలో అనురాధపై వేటు వేయటం ఏమాత్రం సరికాదన్న ఉద్దేశ్యంతో ఆగిన చంద్రబాబు.. పరిస్థితుల్ని తన కంట్రోల్‌లోకి తీసుకొచ్చి.. తాపీగా అనురాధపై బదిలీ వేటు వేశారు.

తాజాగా అనురాధను విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడిషనల్‌ డీజీగా బదిలీ చేసి.. ఆమె స్థానంలో విజయవాడ కమిషనర్‌ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఎంపిక చేవారు. మరోవైపు విజయవాడ కమిషనర్‌గా గౌతం నవాంగ్‌ను నియమించారు. తాజా మార్పులతో.. విధి నిర్వహణలో తప్పులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్న సందేశాన్ని చంద్రబాబు ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

Tags:    

Similar News