విపక్షాలకు నోటీసులిచ్చిన ఏపీ డీజీపీ..ఎందుకంటే

Update: 2021-10-13 05:00 GMT
ఆంధ్రప్రదేశ్ లో డ్రగ్స్ వ్యవహారం అనేది గత కొన్ని రోజులుగా తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. డ్రగ్స్ కేసుకి సంబంధించి విపక్షాలు కీలక ఆరోపణలు చేస్తున్నారు. ఇక దీనిపై డీజీపీ గౌతం సవాంగ్ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసారు. ముంద్రా పోర్టులో పట్టుబడిన హెరాయినుతో ఏపీకి సంబంధం లేదు అని స్పష్టం చేశారు. ఈ విషయం చాలాసార్లు స్పష్టంగా చెప్పినా నిరాధార ఆరోపణలు చేస్తూనే ఉన్నారు అని వివరించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి.. మేం కూడా ఆ సంస్థలతో టచ్లో ఉన్నాం అని ఆయన వెల్లడించారు.

కొన్ని రాజకీయ పార్టీలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయి అని మండిపడ్డారు. ఈ తరహా విమర్శల వల్ల రాష్ట్రానికి చెడ్డ పేరు తెస్తున్నారు అని అన్నారు. రాష్ట్రం పరువు పోయేలా కొన్ని పార్టీలు హెరాయిన్ విషయంలో ఆరోపణలు చేయడం సరికాదు అని హితవు పలికారు. ప్రజల్లో,యువతలో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు అని మండిపడ్డారు. అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారు కాబట్టే నోటీసులు జారీ చేస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలు చేయొద్దని మళ్లీ చెబుతున్నాం అని హెచ్చరించారు. టీడీపీ నేతలు చేసిన విమర్శలు, బయట పెట్టిన అంశాలు పలు పత్రికల్లో వివిధ రకాల హెడ్డింగ్‌ లతో ప్రచారం అయ్యాయి.

రాజకీయ నేతలు చేసిన ప్రకటనలను ఆయా పత్రికలు ప్రచురించాయి. ఇలా వ్యాఖ్యలు చేయడం, వాటిని ప్రచురించడాన్ని డీజీపీ తప్పు పడుతున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతితోపాటు చంద్రబాబు సహా ఆరోపణలు చేసిన టీడీపీ నేతలందరికీ నోటీసులు పంపించారు. అయితే నేరుగా డీజీపీ ఇవ్వలేదు. డీజీపీ తరపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శ్రీనివాసరెడ్డి లీగల్‌ నోటీసులు ఇచ్చారు. రాజకీయ నేతలు ప్రకటించడం.. వాటిని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ప్రముఖంగా ప్రచురించడం పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగించాయని నోటీసుల్లో పొందుపరిచారు.

ఎన్ ఐ ఏ వాళ్లే కాకుండా ఇంకొన్ని దర్యాప్తు సంస్థలు వచ్చి ఉంటాయి అని అన్నారు. ఏపీకి వచ్చి విచారణ చేసుకుంటే తప్పేంటీ, అని నిలదీశారు. ఏపీ పోలీసులకు, ప్రజలకు ఇది గర్వించదగ్గ రోజు అని అన్నారు. కౌంటర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ 7వ జాతీయ స్థాయి ఈవెంట్ లో ఏపీ ఆక్టోపస్ బలగాలు మొదటి స్థానం సాధించాయి అని ఆయన పేర్కొన్నారు. మన గ్రేహౌండ్స్ బలగాలు మంచి పెర్ఫార్మన్స్ చేస్తున్నాయి అని ఆయన తెలిపారు. మన ఆక్టోపస్ బలగాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచేందుకు సిద్ధంగా ఉన్నాయని అన్నారు.




Tags:    

Similar News