కేసీఆర్ దెబ్బేస్తున్నా జగన్ మౌనంగా ఉండటమేంటి?

Update: 2022-02-20 15:30 GMT
తన అవసరం కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా ఉంటుంది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు చూసినప్పుడు. తన ప్రయోజనమే తప్పించి.. అవతల వారి ఇబ్బందిని అస్సలు పట్టించుకోని గులాబీ నేత.. తాజాగా విద్యుత్ మీటర్ల విషయంలో మోడీ సర్కారుపై విమర్శలు చేయటం ఓకే.

ఈ రచ్చలోకి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని లాగిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దశల వారీగా అన్ని రంగాల్లో ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని కేంద్ర విద్యుత్ పాలసీ పేర్కొందని.. తెలంగాణలోని తమ సర్కారు మాత్రం కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణల్ని అమలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పటం గమనార్హం.

ఈ సందర్భంగా ఏపీ ప్రస్తావన తీసుకొచ్చిన కేసీఆర్.. కేంద్రంలోని మోడీ సర్కారు ఒత్తిడికి ఏపీలోని జగన్ ప్రభుత్వం తలొగ్గిందన్న భావం కలిగేలా వ్యాఖ్యలు చేయటంతో ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పడేసేలా చేసింది. మామూలుగా అయితే.. జగన్ స్థానంలో మరెవరు ముఖ్యమంత్రిగా ఉన్నా.. కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించాలన్న ఒత్తిడి ఉండేది.

కానీ.. జగన్ మాత్రం ఎలాంటి వ్యాఖ్య చేయకుండా మౌనంగా ఉన్నారు. మరింత డ్యామేజ్ జరగకుండా తన మంత్రి చేత వివరణ ఇప్పించే ప్రయత్నం చేశారు.

కేసీఆర్ వ్యాఖ్యలపై తాజాగా ఏపీ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలతో తమకు సంబంధం లేదని.. బోర్లకు మీటర్లతో నష్టం లేదని.. మన రైతులకు ఒక్క రూపాయి కూడా నష్టం వాటిల్లదని.. జగన్ సీఎంగా ఉన్నంత వరకు ఇబ్బంది లేదని ఆయన అభియమిస్తున్నారు.

జగన్ సీఎంగా ఉన్నంత వరకు బాగానే ఉందంటున్న మంత్రి.. కేసీఆర్ మాటల కారణంగా తమ రైతులు అనవసరమైన ఆలోచనలో పడిన వైనాన్ని మాత్రం పట్టించుకోకపోవటం గమనార్హం.

సీఎం కేసీఆర్ మాటల్ని చూసినప్పుడు.. జగన్ సర్కారు కేంద్రం ఒత్తిడికి తలొగ్గినట్లుగా చేసిన వ్యాఖ్యలు ఇమేజ్ డ్యామేజ్ చేసేవి కాదా? అన్నది ప్రశ్న. ఒకపక్క తమ ఇమేజ్ ను దెబ్బేసేలా తెలంగాణ సీఎం ప్రయత్నిస్తున్నప్పుడు.. వారికి సరైన రీతిలో సమాధానం చెప్పటం కన్నా.. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు మీకేం ఢోకా లేదని చెప్పటం సరికాదన్న వాదన వినిపిస్తోంది.

కేసీఆర్ లేవనెత్తిన వాదనలో నిజం ఎంత? ఏపీ అనుసరిస్తున్న విధానంలోని మంచి చెడ్డల గురించి వివరించాల్సింది పోయి.. సీఎం జగన్ ఉన్నారు.. ఆయన చూసుకుంటారు.. మీరేం కంగారు పడకండన్నది సరైన సమాధానం కాదంటున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తన మానాన తాను పని చేసుకుంటూ పోతున్నప్పుడు.. ఇలాంటి వ్యాఖ్యలతో కేసీఆర్ కెలికే తీరుకు సరైన రీతిలో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. మరి.. దీనికి సీఎం జగన్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.
Tags:    

Similar News