విశాఖలో మరో గ్యాస్ లీక్.. ఇద్దరు మృతి..పలువురి అస్వస్థత

Update: 2020-06-30 04:15 GMT
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ విషాదం మరువక ముందే మరో విషవాయువు లీక్ తీరప్రాంత నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. విశాఖపట్నం రూరల్ జిల్లాలోని ఆర్ఆర్ వెంకటాపురం లో ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరీన్ గ్యాస్ తో ఇప్పటికే 12మంది చనిపోయారు. ఆ దుర్ఘటన కళ్లముందు కదలాడుతున్న వేళ తాజాగా అదే విశాఖ సమీపంలోని ఫార్మా సిటీలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ లో ఈ మంగళవారం తెల్లవారు జామున మరో విష వాయువులు వెలువడ్డాయి.

ఈ దుర్ఘటనలో ఇద్దరు ఉద్యోగులు నరేంద్రకుమార్, గౌరీశంకర్ లు మరణించారు.  నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. పరిశ్రమలో పనిచేసే పలువురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ విషవాయువును బెంజిమిడైజోల్ గా అధికారులు గుర్తించారు.

గ్యాస్ లీక్ సమాచారం అందుకోగానే విశాఖ కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఫ్యాక్టరీకి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పరిస్థితి ఇప్పుడు అదుపులోనే ఉంది.

కాగా అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలెక్టర్ కు సూచించారు.గ్యాస్ లీకేజీని అరికడుతున్నారు.  ఈ ఘటనతో విశాఖ నగరవాసుల్లో మరోసారి భయాందోళనలు నెలకొన్నాయి.  

కాగా మరణించిన వారి కుటుంబాలకు 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని బాధిత కుటుంబీకులు, తోటి ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
Tags:    

Similar News