ఇరాన్ తో యుద్ధానికి డెడ్ లైన్ పెట్టిన ట్రంప్

ఇరాన్ లో ఉన్న జనాలు ఎవరూ బయటకు రావద్దు అని ట్రంప్ ఈ సందర్భంగా కోరడం విశేషం. తాము ఆపరేషన్ ఎపిక్ ప్యూరీని పూర్తి చేసేంతవరకూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు.;

Update: 2026-03-02 19:19 GMT

ఇరాన్ మీద బాంబుల వర్షం కురిపిస్తున్న అమెరికా ఆ దేశాన్ని తాము రక్షిస్తున్నామని చెబుతోంది. ఆ దేశంలో ఉన్న చెత్తను తొలగిస్తున్నామని అంటోంది. ప్రజలకు మంచి చేస్తున్నామని కూడా అంటోంది. ఇదిలా ఉంటే ఇరాన్ తో యుద్ధం మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తో యుద్ధం పొడిగించడం సుదీర్ఘంగా కొనసాగించడం తమకు ఏ మాత్రం ఇష్టం లేదని చెప్పిన ట్రంప్ ఎపుడు యుద్ధం ముగుస్తుందో ఒక డెడ్ లైన్ కూడా ప్రకటించారు.

నాలుగు వారాల పాటు :

ఇరాన్ తో నాలుగు వారాల పాటు యుద్ధం కొనసాగుతుందని ట్రంప్ చెప్పడం విశేషం. అంటే ఇప్పటికి మూడు రోజులే అయింది, ఇంకా పాతిక రోజులు యుద్ధానికి అమెరికా సిద్ధం అన్న మాట. అంతే కాదు ట్రంప్ మరో మాట అన్నారు. ఇరాన్ తో అమెరికాకు ముప్పు పొంచి ఉందని చెప్పారు. అంటే ఇరాన్ డేంజరస్ కంట్రీ అని భావించే ఈ యుద్ధం చేస్తున్నామని ప్రపంచానికి చెప్పదలచారు అన్న మాట. ఇంకో వైపు చూస్తే ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండడాన్ని తాము ససేమిరా అంగీకరించబోమని కూడా ట్రంప్ స్పష్టం చేశారు.

ఇరాన్ మాట వినలేదు :

తాము చెప్పిన మాటలను ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో వినలేదని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. మా హెచ్చరికలను బేఖాతరు చేసింది అని ఆయన అన్నారు. అంతే కాదు ఇరాన్ వద్ద అమెరికాను టార్గెట్ చేయడానికి తగిన క్షిపణులు కూడా ఉన్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. అందుకే ఇరాన్ క్షిపణి వ్యవస్థను నాశనం చేయడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని ట్రంప్ గట్టిగా చెబుతున్నారు. అసలు ఇరాన్ గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు ఎందుకు చేస్తుంది అని ఆయన ప్రశ్నించారు. ఇరాన్ కి విషయం అర్ధం కావడం లేదని కూడా అన్నారు.

బయటకు రావద్దు :

ఇరాన్ లో ఉన్న జనాలు ఎవరూ బయటకు రావద్దు అని ట్రంప్ ఈ సందర్భంగా కోరడం విశేషం. తాము ఆపరేషన్ ఎపిక్ ప్యూరీని పూర్తి చేసేంతవరకూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. తాము అక్కడి ప్రజల క్షేమం కోసమే పని చేస్తున్నామని అన్నారు. ఇప్పటిదాకా ఒక ఎత్తు ఇక మీదట మరో ఎత్తు అని కూడా అన్నారు.

భీకర పోరు దిశగా :

ఇదిలా ఉంటే ఇరాన్ తో అమెరికా యుద్ధం అన్నది ఇప్పటిదాకా జస్ట్ ట్రైలర్ మాత్రమే అని ఆయన అన్నారు. ఇక ముందు చూడబోయేది మహా యుద్ధం అని కూడా ట్రంప్ కుండ బద్దలు కొట్టారు. పైగా ఒక నెల రోజుల పాటు ఈ యుద్ధం జరుగుతుందని కూడా ఆయన ప్రకటిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే ఇప్పట్లో యుద్ధం అన్నది ఆగేది లేదని అర్ధం అవుతోంది. మరి ఇరాన్ కూడా చేతులు ముడుచుకుని కూర్చోదు కదా దాంతో ఈ యుద్ధం ఏ విధమైన పరిణామాలకు దారి తీస్తుందో అన్నది అంతటా చర్చగా ఉంది. చివరికి ఇతర దేశాలు కూడా ఈ యుద్ధం అనే ముగ్గులోకి దిగితే అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అన్న చర్చ కూడా సాగుతోంది.

Tags:    

Similar News