ట్రంప్, మస్క్ పై గరికపాటి తాండవం.. వైరల్
ప్రస్తుతం ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి.;
అమలాపురంలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల వేదికగా ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌లపై ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ప్రపంచ రాజకీయ పరిస్థితులు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ఆధ్యాత్మిక వేదికలపై వ్యక్తమవుతున్న అభిప్రాయాల మధ్య ఉన్న సంబంధం గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. గల్ఫ్ దేశాలు కూడా ఈ ఉద్రిక్తతల ప్రభావానికి లోనవుతున్నాయి. దుబాయ్ వంటి ప్రాంతాల్లో కూడా భద్రతాపరమైన ఆందోళనలు పెరుగుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో అంతర్జాతీయ సంబంధాలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఈ పరిస్థితుల్లో ప్రపంచం ఏ దిశగా సాగుతుందో అన్న అనిశ్చితి పెరుగుతోంది.
ఇలాంటి గ్లోబల్ పరిస్థితుల నేపథ్యంలో గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆయన ట్రంప్, మస్క్‌లను “రాక్షసులు”గా అభివర్ణిస్తూ.. ప్రపంచాన్ని నాశనం చేసే శక్తులుగా విమర్శించారు. అంతేకాదు వీరిని సంహరించడానికి శ్రీమహావిష్ణువు అవతరించాలంటూ వ్యాఖ్యానించడం సంచలనమైంది.. ఆధ్యాత్మిక వేదికపై ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలు క్షణాల్లోనే అందరి దృష్టిని ఆకర్షించాయి.
ఇక్కడ ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం ఏమిటంటే ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు తమ ప్రవచనాల్లో ఎంతవరకు రాజకీయాలపై వ్యాఖ్యానించాలి? సాధారణంగా ఆధ్యాత్మిక ప్రవచనాలు ధర్మం, జీవన విధానం, నీతులు, సంస్కృతి వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. ప్రజలకు మానసిక ప్రశాంతత, ఆత్మపరిశీలనకు దారి చూపడం వాటి ముఖ్య ఉద్దేశ్యం. అయితే సమాజంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించడం కూడా కొంతవరకు సహజమే. కానీ వ్యక్తిగతంగా నాయకులను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం వైరల్ గా మారింది.
మరోవైపు ట్రంప్, మస్క్‌లపై వచ్చిన విమర్శల నేపథ్యంలో వారి పాత్రపై కూడా చర్చ జరుగుతోంది. ఎలాన్ మస్క్ ఒక వ్యాపారవేత్తగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టడం, కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడం ఆయన వ్యాపార వ్యూహంలో భాగమే. గ్లోబలైజేషన్ యుగంలో వ్యాపారం దేశాల సరిహద్దులను దాటి విస్తరిస్తుంది. దీనిని పూర్తిగా ప్రతికూలంగా చూడడం సరైనదా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.
అలాగే అమెరికా అధ్యక్షుల విధానాల విషయానికి వస్తే, సామ్రాజ్యవాద ధోరణి అనే విమర్శ చాలా కాలంగా ఉంది. ట్రంప్ మాత్రమే కాకుండా గతంలో బరాక్ ఒబామా వంటి నాయకుల పాలనలో కూడా అమెరికా విదేశాంగ విధానంపై ఇలాంటి విమర్శలు వినిపించాయి. కాబట్టి ఒక్క వ్యక్తిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని విమర్శించడం సరైన విశ్లేషణగా భావించలేమని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఈ మొత్తం వివాదంలో ముఖ్యంగా కనిపిస్తున్న అంశం ఆధ్యాత్మిక వేదికల పరిమితులు. ప్రజలు ఆధ్యాత్మిక ఉపన్యాసకుల నుండి ధార్మిక బోధనలు, జీవన విలువలు ఆశిస్తారు. అలాంటి సందర్భాల్లో రాజకీయ వ్యాఖ్యలు, వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల ఆధ్యాత్మికతపై ప్రభావం పడే అవకాశం ఉంది. చాగంటి కోటేశ్వరరావు వంటి ప్రవచనకర్తలు సాధారణంగా ఆధ్యాత్మిక అంశాలపైనే దృష్టి సారించడం వల్ల ప్రజల్లో మంచి ఆదరణ పొందుతున్నారు.
మొత్తంగా చూస్తే ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నాయో, అదే సమయంలో ప్రజా వేదికలపై మాటల బాధ్యత ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. ఆధ్యాత్మికత, రాజకీయాలు, గ్లోబల్ సంఘటనలు.. ఇవన్నీ పరస్పరం సంబంధం ఉన్నప్పటికీ, వాటి మధ్య సరిహద్దులను గుర్తించి మాట్లాడటం సమాజానికి మరింత ఉపయోగకరంగా ఉంటుంది.