కర్మ అనుభవించాల్సిందే...నాగబాబు సంచలన వ్యాఖ్యలు
వైసీపీకి ఓటు వేసిన పాపానికి అయిదేళ్ల పాటు ప్రజలు కర్మ ఫలాన్ని అనుభవించారని ఇపుడు వైసీపీ నేతలు సూత్రధారులు పాత్రధారులు మద్దతుదారులు ఆ కర్మని అనుభవించాలని నాగబాబు అన్నారు;
కర్మ అన్నది వెంటాడుతుంది, దేవుడైనా క్షమిస్తాడేమో కానీ కర్మ అయితే క్షమించదు, అనుభవించి తీరాల్సిందే. జనసేన నేత ఎమ్మెల్సీ నాగబాబు తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు ఇవి. చేసిన కర్మము చెడని పదార్థము అని ఆయన పేర్కొన్నారు. కర్మ విషయంలో ఎవరైనా ఒక్కటే అని ఆయన చెప్పారు. కర్మను సైన్స్ అనుకున్నా లేదా దైవత్వంగా చూసినా ప్రతీ యాక్షన్ కి రివర్స్ లో రియాక్షన్ ఉంటుంది అని ఆయన అన్నారు. మంచి పనులు చేస్తే అంతా బాగుంటారని చెడ్డ పనులు చేస్తే అనుభవిస్తారని ఆయన ఆన్నారు. దేవుడి విషయంలో కూడా చెడు పనులు చేస్తే అది మరింత పాపం అని ఆయన అన్నారు. తాజాగా నాగబాబు సామాజిక మాధ్యమంలో ఒక వీడియోని విడుదల చేశారు. అందులో ఆయన అనేక అంశాలు ప్రస్తావించారు.
సభలో మాట్లాడాల్సింది :
గత నెల 26న లడ్డూ కల్తీ అంశంపై శాసన మండలిలో చర్చ తీర్మానం ప్రవేశ పెట్టారని ఆయన చెప్పారు. అయితే వైసీపీ ప్రతినిధులు సభను సజావుగా జరగనీయకుండా అడ్డుకున్న నేపథ్యంలో ఆ రోజు చర్చను అర్థాంతరంగా ఆపేయడం జరిగిందని అన్నారు. అలా అక్కడ మాట్లాడాల్సిన ఒక మంచి అంశాన్ని గురించి మాట్లాడే అవకాశం లేకుండా పోయిందని ఆయన చెప్పారు. ఆ అంశాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత నాకు ఉందనిపించిందని అయన చెప్పారు.
వైసీపీ అనుభవించాల్సిందే :
వైసీపీకి ఓటు వేసిన పాపానికి అయిదేళ్ల పాటు ప్రజలు కర్మ ఫలాన్ని అనుభవించారని ఇపుడు వైసీపీ నేతలు సూత్రధారులు పాత్రధారులు మద్దతుదారులు ఆ కర్మని అనుభవించాలని నాగబాబు అన్నారు, తిరుమలకు మొక్కులు ముడుపుల రూపంలో భక్తులు హుండీలో వేసిన మొత్తాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వినియోగించాలని ఆయన అన్నారు. అలా కాకుండా కల్తీ లడ్డూల రూపంలో టికెట్ల రూపంలో ఇతరత్రా తప్పులు చేసిన వారు ఆ కర్మ అనుభవించాల్సిందే అని నాగబాబు అన్నారు. దేవుడు అయితే రాగద్వేషాలకు అతీతంగా ఉంటాడు, కర్మకు అవేమీ ఉండవు అది తిరిగి ఇస్తుందని నాగబాబు చెప్పారు.
కర్మ క్యానర్ కన్నా :
కర్మ అన్నది క్యాన్సర్ కన్నా భయంకరమైనది అని నాగబాబు అన్నారు. ఎవరూ నాశనం కావాలని తాను కోరుకోవడం లేదని తప్పు చేసిన వారిని మాత్రం కర్మ వదిలే ప్రసక్తే లేదని చెబుతున్నాను అన్నారు. క్యాన్సర్ కి చికిత్స ఉందేమో కానీ కర్మకు చికిత్స లేదని ఆయన స్పష్టం చేశారు. క్షమించమని ఆ స్వామివారిని కోరుకోవడం ఒక్కటే ఇపుడు మీరు చేసే ప్రాయశ్చిత్తం అని అన్నారు. ఇప్పటికైనా పాప ప్రక్షాళన చేసుకోవాలని లడ్డూ స్కాం పాత్రధారులకు సూత్రధారులకు మద్దతుదారులకు కోరుతున్నాను అని నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
వంద తప్పులు చేసేశారు :
తిరుపతి లడ్డూ కల్తీ విషయంలో తప్పులు చేసిన వారు ఇక కర్మ అనుభవించాల్సిందే అని నాగబాబు చెబుతూ సినీ నటుడు తనికెళ్ళ భరణి రాసిన కవితను చదివి వినిపించారు. తన చేత కల్తీ లడ్డూ తినిపించారని తాను కేశవుడినా లేక గరళం మిగిన శివుడినా అని ఆ దేవదేవుడు ఆవేదనతో ఆగ్రహంతో ప్రశ్నించినట్లుగా భరణి ఈ కవితలో రాశారు అన్నారు వంద తప్పులూ చేశారు ఇక వక్కలు లెక్క బెట్టుకోండి నా సుదర్శన చక్రం ఫ్యాన్ కన్నా స్పీడ్ గా వస్తుంది అని స్వామి హెచ్చరించిన వైనాన్ని కూడా ఈ కవితలో భరణి చెప్పారని అంటూ గోవిందా గోవిందా అని నాగబాబు సెటైరికల్ గా ముగించారు. ఆయన పేరు పెట్టి వైసీపీ నేతలను ఏమీ అనలేదు కానీ ఆయన మాటలు పరోక్ష విమర్శలు అన్నీ ఆ పార్టీ నేతలకు ఘాటుగా సూటిగా తగిలేలా ఉన్నాయని అంటున్నారు.