ఇరాన్ వ్యూహం మార్చింది.. గల్ఫ్ దేశాలపై పడుతోంది..

ఇరాన్ ఈ విధమైన వ్యూహాన్ని ఎందుకు అవలంబిస్తోంది అన్నదానిపై విశ్లేషకులు వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.;

Update: 2026-03-02 19:14 GMT

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం రోజురోజుకూ ముదురుతోంది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ప్రారంభమైన ఉద్రిక్తతలు ఇప్పుడు కొత్త మలుపు తీసుకున్నాయి. తాజాగా ఇరాన్ తన వ్యూహాన్ని మార్చినట్లు అంతర్జాతీయ వర్గాల్లో సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు ప్రధానంగా సైనిక స్థావరాలు, వ్యూహాత్మక కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్.. ఇప్పుడు ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్న దేశాల్లో నివసిస్తున్న ప్రజలపైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.

ప్రత్యేకంగా గల్ఫ్ దేశాల్లో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. బహ్రెయిన్, అబుదాబి, దుబాయ్, షార్జా, ఖతార్, కువైట్ ప్రాంతాల్లోని నివాస ప్రాంతాలపై దాడులు జరగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ ప్రాంతాల్లో ఉన్న హైరైజ్ భవనాలు, అపార్ట్‌మెంట్లను ఖాళీ చేయాలని స్థానిక ప్రభుత్వాలు, భద్రతా సంస్థలు సూచిస్తున్నాయి. దాంతో వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.

ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సైరన్‌లు మోగించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. రాత్రి వేళల్లో భయంతో గడుపుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా విదేశీ కార్మికులు, భారతీయులు సహా దక్షిణాసియా దేశాలకు చెందిన వేలాది మంది ఈ ప్రాంతాల్లో నివసిస్తున్నందున వారి భద్రతపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ఎంబసీలు తమ పౌరులకు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశాయి.

ఇరాన్ ఈ విధమైన వ్యూహాన్ని ఎందుకు అవలంబిస్తోంది అన్నదానిపై విశ్లేషకులు వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్న దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు, వారి అంతర్గత స్థిరత్వాన్ని దెబ్బతీయడానికి ఈ చర్యలు చేపడుతున్నట్లు భావిస్తున్నారు. సాధారణ ప్రజలపై భయం కలిగించడం ద్వారా ఆ దేశ ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలని ఇరాన్ ప్రయత్నిస్తోందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదే సమయంలో అమెరికా, ఇజ్రాయెల్ మిత్రదేశాలు కూడా తమ భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తున్నాయి. గల్ఫ్ దేశాల్లోని ముఖ్య నగరాల్లో భద్రతా బలగాలు పెంచడంతో పాటు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను అప్రమత్తంగా ఉంచుతున్నారు. ఎప్పుడైనా దాడులు జరిగే అవకాశమున్నందున ప్రజలు అత్యవసర మార్గదర్శకాలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

ఈ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లపై కూడా ప్రభావం పడుతోంది. ముఖ్యంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. గల్ఫ్ ప్రాంతం ప్రపంచానికి ప్రధాన చమురు సరఫరా కేంద్రం కావడంతో ఇక్కడ పరిస్థితులు మరింత దిగజారితే ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరోవైపు ఐక్యరాజ్యసమితి సహా అంతర్జాతీయ సంస్థలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. యుద్ధం మరింత విస్తరించకుండా అన్ని పక్షాలు శాంతి మార్గాన్ని అనుసరించాలని పిలుపునిస్తున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఉద్రిక్తతలు త్వరలో తగ్గే సూచనలు కనిపించడం లేదు.

ఇరాన్ వ్యూహ మార్పు పశ్చిమాసియా ప్రాంతాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టింది. సాధారణ ప్రజలే లక్ష్యంగా మారడం వల్ల ఈ సంక్షోభం మానవతా విపత్తుగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అన్ని దేశాలు శాంతి చర్చలకు ముందుకు రావాలని ప్రపంచం ఆశిస్తోంది.

Tags:    

Similar News