అమెరికాకు దండం.... యూఏఈ రివర్స్
యుద్ధం ఎవరితో అన్న సందేహం కూడా వారిలో కలుగుతోంది. సాటి ముస్లిం దేశాల మీద ఇరాన్ ఈ తీరున విరుచుకుపడడం ఏంటన్న చర్చ కూడా ప్రపంచ దేశాలకు కూడా కలిగింది.;
నేస్తం కాస్తా నెత్తురోడిస్తున్నాడా, రక్షణ కవచం గురి తప్పుతోందా. తమ గడ్డ మీద అమెరికా యుద్ధ విన్యాసాలు చివరికి అసలుకే ఎసరు తెస్తున్నాయా. ముప్పుతో ముప్పతిప్పలు పెడుతున్నాయా. ఇవన్నీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూఏఈ దేశాల నుంచి వస్తున్న ప్రశ్నలు. మరో విధంగా చూస్తే ఆవేదన కూడా. తమ గడ్డ మీద ఉన్న అమెరికాకు చెందిన బేస్ ల వల్ల రక్షణ మాట దేవుడెరుగు పెను ముప్పు వాటిల్లుతోందని యూఏఈ దేశాలు గగ్గోలు పెడుతున్నాయి.
రక్షణ కవచం గురి తప్పిందా :
ఇదిలా ఉంటే యూఏఈ గడ్డ మీద అమెరికా ఏర్పాటు చేసిన బేస్ కానీ రక్షణ కవచం కానీ ఆ దేశాలను కాపాడలేకపోతున్నాయి. ఇరాన్ చేస్తున్న భారీ దాడులకు కకావికలమవుతున్నాయి. ఇరాను గల్ఫ్ దేశాల మీద చేస్తున్న తీవ్రమైన దాడులతో ఆ దేశాలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అమెరికా రక్షణ కవచం వల్ల ఏ విధంగానూ ప్రయోజనం కలగకపోగా ఇరాన్ దానిని దాటి మరీ వచ్చి చేస్తున్న ప్రతీకార దాడులకు ఈ దేశాలు విలవిలలాడుతున్నాయి. దానికి ఉదాహరణగా కువైట్, ఖతర్ మీద జరిగిన దాడులను చూపుతున్నారు.
యూఏఈ దేశాల మీద :
అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడులు చేస్తున్నాయి. ఇరాని అన్న దేశాన్ని అన్ని రకాలుగా సర్వనాశనం చేయాలని నాలుగు వైపుల నుంచి మోహరించి సాగిస్తున్న ఈ భీకర యుద్ధంలో ఇరాన్ ఇజ్రాయెల్ మీద ఎదురు దాడులు చేయడం సబబు, అది యుద్ధ నీతి కూడా. కానీ ఇరాన్ మొదటి రోజు నుంచి యూఏఈ దేశాల మీద తన లక్ష్యాన్ని గురి పెడుతూ వస్తోంది. దుబాయ్, కువైట్ ఖతర్ సహా గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తోంది. తమ వద్ద ఉన్న పదునైన ఆయుధాలను ఆ వైపుగా పంపిస్తూ ముప్ప తిప్పలు పెడుతోంది. దీంతో అసలు ఈ విషయం ఊహించని యూఏఈ దేశాలు షాక్ తిన్నాయి.
ఇరాన్ వ్యూహం ఫలిస్తోంది :
యుద్ధం ఎవరితో అన్న సందేహం కూడా వారిలో కలుగుతోంది. సాటి ముస్లిం దేశాల మీద ఇరాన్ ఈ తీరున విరుచుకుపడడం ఏంటన్న చర్చ కూడా ప్రపంచ దేశాలకు కూడా కలిగింది. అయితే సరిగ్గా ఇక్కడే ఇరాన్ వ్యూహం ఉంది అని అంటున్నారు ఇపుడు అమెరికా మీద యూఏఈ దేశాలే రివర్స్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కేవలం మూడు రోజుల యుద్ధంలోనే ఈ దేశాలు అన్నీ అమెరికాకు దండం పెడుతున్నాయి. మా దేశాలలో ఉంటూ మా గడ్డ మీద ఉంచిన అమెరికా బేస్ లను తొలగించాలని కోరుతున్నాయి. మీ పుణ్యమాని మా మీద ప్రతీకార దాడులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని కూడా మండిపడుతున్నాయి. పైగా అమెరికా రక్షణ కవచం సైతం గురి తప్పిందని తమకు ఏ విధంగా రక్షణ లేదని కూడా ఆ దేశాలు తల్లడిల్లుతున్నాయి.
ఇరాన్ మీదకు రావాలంటే :
ఇదిలా ఉంటే ఎక్కడో ఉన్న అమెరికా ఇరాన్ మీదకు రావాలి అన్నా యుద్ధాన్ని చేయాలి అన్నా సమీప ప్రాంతాలలో ల్యాండ్ చేయాలి. అందుకే యూఏఈ దేశాలను మిత్రులుగా చేసుకుని తన బేస్ ని అక్కడ ఏర్పాటు చేసుకుంది. పైగా రక్షణ కవచం ఉందని ఏమీ జరగదని కూడా పెద్దన్న చెప్పి ఉంచారని అంటారు. కానీ ఇపుడు అంతా రివర్స్ లో సాగుతోంది. ఇరాన్ ఆయుధాల ధాటికి యూఎస్ బేసులు చెదిరిపోతున్నాయి. రక్షణ మాట పక్కన పెడితే ఇరాన్ భారీ దాడులకు యూఏఈ దేశాలు అయితే ఆర్తనాదాలు చేస్తున్నాయి.
ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు :
మాకేంటి ఈ పరిస్థితి అన్నది కూడా వారిలో కలుగుతోంది అని అంటున్నారు. దాంతో మా దేశాలను మా ప్రాంతాలను తమ భూ భాగాలను ఇరాన్ కి ప్రతీకార వేదికలుగా చేయవద్దు అని యూఏఈ ఇండైరెక్ట్ గానే అమెరికాని కోరడం ఇపుడు అతి పెద్ద చర్చగా మారింది. యూఏఈ సాయం లేకపోతే అమెరికాకు నిలువ నీడ ఉండదు, ఇరాన్ మీద ఎటాక్స్ కూడా బేస్ దొరకదు. మరి పెద్దన్న దీని మీద ఎలా రియాక్ట్ అవుతాడో చూడాల్సి ఉంది. మొత్తానికి తమ సుప్రీం లీడర్ ఖమేనీ సహా అగ్ర నాయకత్వం హతమైనా ఇరాన్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు అన్నది స్పష్టం అవుతోంది అంటున్నారు.