వావ్.. అమేజింగ్ సేల్.. అమ్మకానికి మరో 13 ఎయిర్ పోర్టులు

Update: 2021-09-10 07:00 GMT
ఆలసించిన ఆశాభంగం.. మంచి తరుణం మించిపోక ముందే.. దేశ సంపదగా ఇంతకాలం ఉన్న ఆస్తుల్ని ప్రేవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్రంలోని మోడీ సర్కారు ప్రదర్శిస్తున్న ఆత్రుత అంతా ఇంతా కాదు. ఎయిర్ పోర్టులు మొదలు.. నేషనల్ హైవే రోడ్ల వరకు.. అయితే ఫర్ సేల్.. లేదంటే ఫర్ లీజ్ అంటూ భారీ థమాకా సేల్ ను తెర మీదకు తీసుకురావటం తెలిసిందే. బిజినెస్ చేయటం ప్రభుత్వ ‘బిజినెస్’ (పని) కాదంటూ సర్కారు చేయాల్సిందేమిటో మహా చక్కగా సెలవిచ్చిన మోడీ సర్కారు.. గత ప్రభుత్వాలకు భిన్నంగా ప్రభుత్వ ఆస్తుల్ని భారీ ఎత్తున అమ్మకానికి పెట్టేస్తున్న వైనం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు తెర తీసింది.

పార్టీలకు అతీతంగా నేతలు.. మేధావులు.. నిపుణులు.. ఇలా వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అందరూ ఈ తరహా ‘‘సేల్’’కు అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తున్నా.. వినకుండా ఒకటి తర్వాత ఒకటి చొప్పున ప్రకటనలు విడుదల చేస్తున్న మోడీ సర్కారు తాజాగా మరో బంఫర్ సేల్ ను ప్రకటించారు. ఇప్పటికే అమ్మకానికి పెట్టిన విమానాశ్రయాలు చాలవన్నట్లుగా.. తాజాగా మరో 13 విమానాశ్రయాల్ని కూడా ప్రైవేటీకరించేందుకు రెఢీ చెప్పింది.
తాజాగా ప్రకటించిన 13 ఎయిర్ పోర్టుల్లో ఆరు పెద్ద ఎయిర్ పోర్టులు.. ఏడు చిన్నవి ఉన్నాయి. వీటిని కలిపేసి మరింత పెద్ద ఎయిర్ పోర్టులుగా తీర్చి దిద్దనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే కేంద్రం ప్రకటించిన మానిటైజేషన్ ప్లాన్ కు ఇది అదనమని చెబుతున్నారు. తాజాగా అమ్మకానికి పెట్టిన 13 ఎయిర్ పోర్టుల్లో ఆరు పెద్ద ఎయిర్ పోర్టుల్లో..అమృత్‌సర్, భువనేశ్వర్, ఇండోర్, రాయ్‌పూర్, తిరుచ్చి, వారణాసిలు ఉన్నాయి.

ఒక.. ఏడు చిన్న ఎయిర్ పోర్టుల విషయానికి వస్తే.. హుబ్లి, తిరుపతి, ఔరంగాబాద్, జబల్‌పూర్, కంగ్రా, కుషినగర్, గయ ఉన్నాయి. వీటి ద్వారా మార్చి 2024 నాటికి విమానాశ్రయాల్లో దాదాపు రూ.3700 కోట్ల ప్రైవేటు పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. చిన్న ఎయిర్ పోర్టులను కలిపేసి పెద్దవిగా చేసే ప్రక్రియను వెల్లడించారు. ఇలా చిన్న విమానాశ్రయాలను పెద్దవాటితో కలపటం దేశంలో ఇదే తొలిసారి. పీపీఈ విధానంలోఆదాయపంపకాలు ఉన్నప్పటికీ యజామాన్యం మాత్రం ప్రభుత్వానిదే. ఇదే తీరులో హైదరాబాద్‌, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కొచ్చి, అహ్మదాబాద్, లక్నో, మంగళూరు విమానాశ్రయాలను డెవలప్ చేశారు. త్వరలోనే జైపూర్, గువాహటి, తిరువనంతపురం విమానాశ్రయాలను త్వరలోనే స్వాధీనం చేసుకోనున్న అదానీ గ్రూప్.. నవీ ముంబై విమానాశ్రయాన్ని నిర్మించనుంది.

చిన్న విమానాశ్రయాలను వేరే వాటితో కలిపి పెద్దవి చేస్తారన్న కాన్సెప్టులో ఉన్న ఎయిర్ పోర్టులు చూస్తే..
- వారణాసి విమానాశ్రయంలో కుషినగర్.. గయను కలుపుతారు
- అమృత్‌సర్‌లో కంగ్రాను కలుపుతారు
- తిరుపతితో భువనేశ్వర్‌ను కలిపేస్తారు
- రాయ్ పూర్ ను ఔరంగాబాద్ తో కలుపుతారు
- ఇండోర్ ను జబల్ పూర్ తో కలుపుతారు
- తిరుచ్చిని హుబ్లీతో కలిపేస్తారు



Tags:    

Similar News