పంచ్ అదిరింది కానీ ప‌క్క‌దారి పట్టింది రాహుల్‌!

Update: 2019-01-03 10:39 GMT
విమ‌ర్శ సూటిగా సుత్తి లేకుండా ఉండాలి. టార్గెట్‌ ను చేధించేలా ఉండాలి. ఏ మాత్రం ప‌క్క‌కు త‌ప్పినా మైలేజీ కాస్తా మ‌టాష్ కావ‌టం ఖాయం. తాజాగా కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప‌రిస్థితి ఇంచుమించు ఇలాంటిదే. మారిన ప‌రిస్థితుల్లో ప్ర‌ధాని మోడీ పై రాహుల్ సంధిస్తున్న విమ‌ర్శ‌నాస్త్రాలు.. ఆరోప‌ణ బాణాలు సూటిగా తాకుతున్నాయి. ఇలాంటి వేళ‌లో మ‌రింత జాగ్ర‌త్త తీసుకోవాల్సిన అవ‌స‌రం రాహుల్ మీద ఉంది.

మోడీకి రాహుల్ విసురుతున్న పంచ్ లకు కౌంట‌ర్లుగా క‌మ‌ల‌నాథులు వేస్తున్న కౌంట‌ర్లు పెద్ద‌గా వ‌ర్క్ వుట్ కావ‌టం లేదు. దీనికి తోడు జ‌నం నుంచి వ‌స్తున్న రెస్పాన్స్ కూడా అంతంత‌మాత్రంగానే ఉండ‌టంతో రాహుల్ లో ఆత్మ‌స్థైర్యం అంత‌కంత‌కూ పెరుగుతోంది. రాఫెల్ లో మోడీని ఒక ఆట ఆడుకుంటున్న రాహుల్‌.. ఆ ఎపిసోడ్‌ లో త‌న‌దే పైచేయిగా నిలిచారు.

ఇలాంటి వేళ‌.. తాజాగా చేసిన త‌ప్పు రాహుల్ ను వేలెత్తి చూపేలా చేస్తోంది. ప్ర‌త్య‌ర్థి బ‌ల‌హీన‌త‌ల మీద పెట్టాల్సిన త‌న గురిని ప‌క్క‌కు మ‌ర్చ‌ల‌టంతో ఇలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ధ‌మా అంటూ మోడీకి రాహుల్ విసురుతున్న స‌వాళ్ల‌కు ప్ర‌ధాని స‌మాధానం చెప్ప‌ని ప‌రిస్థితి. ఇలాంటి వేళ ఏషియ‌న్ న్యూస్ ఇంట‌ర్నేష‌న‌ల్ వార్తా సంస్థ ఎడిట‌ర్ స్మితా ప్ర‌కాష్ కు ప్ర‌ధాని మోడీ ఇంట‌ర్వ్యూ కావ‌టం.. అది కాస్తా మీడియాలో పెద్ద ఎత్తున క‌వ‌ర్ కావ‌టం తెలిసిందే.అయితే.. మోడీ లాంటి వ్య‌క్తిని ఇంట‌ర్వ్యూ చేసే అవ‌కాశం ల‌భించిన‌ప్పుడు కాసిన్ని మెరుపులు మెరిపించాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ.. ఇంట‌ర్వ్యూ మొత్తం చూశాక‌.. ఇంట‌ర్వ్యూ ఎలాంటి ప‌రిస్థితుల్లో మోడీ ఇచ్చార‌న్న‌ది అర్థ‌మ‌య్యే ప‌రిస్థితి. అయితే.. ఇలాంటి వాటిని ప్ర‌స్తావించ‌టం వ‌ల్ల ప్ర‌యోజ‌నం శూన్యం. ఆ విష‌యాన్ని రాహుల్ మిస్ అయ్యారు. ప్ర‌ధాని మోడీకి మీడియా ముందు వ‌చ్చి కూర్చునే ద‌మ్ము లేద‌ని.. కానీ తాను మాత్రం వ‌చ్చాన‌ని చెప్పారు.

తానిక ప్ర‌తి వారం ఒక‌సారి మీడియా ముందుకు వ‌స్తాన‌ని చెప్పారు. త‌న‌ను ఏ ప్ర‌శ్న అయినా అడ‌గొచ్చ‌న్న ఆయ‌న‌.. అక్క‌డితో ఆగితే ప్ర‌ధాని పై ఆయ‌న విస‌రాల‌నుకునే పంచ్ నేరుగా తాకేది. కానీ.. ఇక్క‌డే రాహుల్ త‌ప్పులో కాలేశారు. మోడీని విమ‌ర్శించే క్ర‌మంలో ఆయ‌న్ను ఇంట‌ర్వ్యూ చేసిన జ‌ర్న‌లిస్ట్‌ ను టార్గెట్ చేశారు. మోడీ ఇంట‌ర్వ్యూ మొత్తంగా సానుకూలంగా ఉండే జ‌ర్న‌లిస్టు చేసింద‌న్న ఆరోప‌ణ‌తో పాటు.. ఒక ప్ర‌శ్న అడుగుతూనే.. మ‌రోప‌క్క ప్ర‌శ్న‌కు స‌మాధానం ఆమే ఇస్తున్న‌ట్లుగా మొత్తం ఇంట‌ర్వ్యూ ఉంద‌న్న వ్యాఖ్య‌ను చేశారు.

ప్ర‌ముఖుల‌ను ఇంట‌ర్వ్యూ ను చేసే విష‌యంలో కొన్ని సంద‌ర్భాల్లో కొన్ని ప‌రిమితులు ఉంటాయి. ఆ విష‌యం రాహుల్ కు తెలియంది కాదు. ఆ ప‌రిమితుల‌కు లోబ‌డి జ‌ర్న‌లిస్టు ఇంట‌ర్వ్యూ చేయాల్సి ఉంటుంది. ఆ విష‌యం తెలిసి మోడీతో పాటు.. ఇంట‌ర్వ్యూ చేసిన పాత్రికేయురాలిని మాట అన‌టంలో అర్థం లేదు. గ‌తంలో తాను ఇంట‌ర్వ్యూ ఇచ్చిన సంద‌ర్భంగా తాను స‌మాధానం చెప్ప‌లేక‌పోవటం.. ఆ కార‌ణంగా త‌న ఇమేజ్ డ్యామేజ్ కావ‌టం రాహుల్ కు చేదు గుర్తుగా ఉండొచ్చు. అదంతా ఆయ‌న స్వ‌యంకృతం. అంత మాత్రానికి.. త‌న‌ను తాను నిందించుకోవాల్సింది పోయి ఒక జ‌ర్న‌లిస్టును విమ‌ర్శించ‌టం స‌రిగా లేద‌న్న మాట వినిపిస్తోంది.మోడీని టార్గెట్ చేయాల్సిన రాహుల్‌.. త‌న స్థాయికి ఏ మాత్రం స‌రిపోని రీతిలో ఒక పాత్రికేయురాలిని ల‌క్ష్యంగా చేసుకోవ‌టం వ‌ల్ల ఆయ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్న స‌త్యాన్ని గుర్తిస్తే మంచిది.





Full View
Tags:    

Similar News