5 కిలోల బియ్యం రూ.5.. సంచి మాత్రం రూ.9!

Update: 2019-07-27 04:59 GMT
అధికారులు తీసుకునే కొన్ని నిర్ణ‌యాలు ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు తెచ్చేలా మారుతుంటాయి. ఇలాంటి వాటి విష‌యంలో ప్ర‌భుత్వాధినేత‌లు ప‌ట్టించుకోకుండా చివ‌ర‌కు అప్ర‌దిష్ట‌పాలు కావాల్సిందే ప్ర‌భుత్వ‌మే. ఏపీలో ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితే నెల‌కొంది. ఖ‌ర్చు విష‌యంలో ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీరుకు భిన్నంగా కొన్ని శాఖ‌ల అధికారులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగానే కాదు.. చ‌ర్చ‌గా మారింది.

ప్ర‌భుత్వం అందిస్తున్న బియ్యం ద్వారా వ‌చ్చే ఆదాయం కంటే కూడా.. దానికి వినియోగించే సంచి కోసం పెట్టే ఖ‌ర్చు భారీగా ఉండ‌టం ఆశ్చ‌ర్యానికి గురి చేసే అంశం. ఐదు కేజీల బియ్యం రూ.5 చొప్పున ప్ర‌భుత్వం వ‌సూలు చేస్తుంటే.. అదే ఐదు కేజీల బియ్యాన్ని ప్యాక్ కోసం రూ.9 ఖ‌ర్చు చేయ‌టం షాకింగ్ గా మారింది. అంతే కాదు ప‌ది కేజీల బియ్యాన్ని ప్యాక్ చేసే సంచికి రూ.12.. 20 కేజీల బియ్యం సంచి కోసం రూ.14 ఖ‌ర్చు చేయ‌టం సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. ఏపీ ప్ర‌భుత్వాన్ని వేలెత్తి చూపేలా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ప్ర‌స్తుతానికి సంచుల్లో బియ్యాన్ని ల‌బ్థిదారుల‌కు పంపిణీ చేసేందుకు వీలుగా ప్ర‌యోగాత్మ‌కంగా శ్రీ‌కాకుళం ప‌ట్ట‌ణంలో ఈ కొత్త విధానాన్ని అమ‌లు చేస్తున్నారు. అనంత‌రం రాష్ట్రం మొత్తం ఇదే విధానాన్ని అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. ల‌బ్థిదారుల ఇళ్ల‌కే బియ్యాన్ని డోర్ డెలివ‌రీ చేయాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా సంచుల్లో బియ్యాన్ని స‌ర‌ఫ‌రా చేయాల‌ని డిసైడ్ చేశారు. ఇదంతా బాగానే ఉన్నా.. కేవ‌లం సంచుల‌కే వంద‌ల కోట్లు ఖ‌ర్చు కావ‌టం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.

ఒక అంచ‌నా ప్ర‌కారం సంచుల కోసం ఏటా రూ.750 కోట్లు ఖ‌ర్చు పెట్టాల్సి వ‌స్తుంద‌ని చెబుతున్నారు. ఇంత భారీ మొత్తం కేవ‌లం ప్యాక్ చేసిన బియ్యం కోసం అంటే అద‌న‌పు భారం కిందకే వ‌స్తుంది. ఆ ఖ‌ర్చుతో ఇప్పుడిస్తున్న బియ్యానికి బ‌దులుగా స‌న్న బియ్యం ఇస్తే మ‌రింత ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంద‌న్న సూచ‌న‌లు వినిపిస్తున్నాయి.  ల‌బ్థిదారుల ఇళ్ల‌కు సంచుల్లో బియ్యాన్ని అందించ‌టం బాగున్నా.. సంచుల కోసం ఇంత భారీగా ఖ‌ర్చు చేయ‌టం ప్ర‌భుత్వంపై వేలెత్తి చూపించే వీలుంది. ఈ సంచుల వ్య‌వ‌హారంపై జ‌గ‌న్ ఒక‌సారి దృష్టి సారిస్తే మంచిద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News