గవర్నర్ గా పని చేసిన తర్వాత ఎన్నికల బరిలో
ఇదంతా ఎందుకంటారా.. అక్కడికే వస్తున్నాం. దేశానికి రాష్ట్రపతి ఎలానో.. ఒక రాష్ట్రానికి గవర్నర్ పదవి అలాంటిదే.;
రాష్ట్రపతి స్థాయి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలాంటి పదవిలో ఉండి.. పదవీ విరమణ తర్వాత ఆయన ఒక ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగితే? ఈ ఊహే ఇబ్బందిగా ఉంటుంది కదా? నిజమే.. రాష్ట్రపతి హోదాలో ఉన్న వారు లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేయటం ఏ మాత్రం బాగోదు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. రాజ్యాంగంలో ఎక్కడా కూడా రాష్ట్రపతి పదవిని చేపట్టిన వారు తర్వాతి కాలంలో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న నిబంధన ఎక్కడా లేదు. కాకుంటే.. దేశంలోనే అత్యున్నత స్థానంతో పాటు ప్రోటోకాల్ ప్రకారం మొదటి పౌరుడి హోదాలో ఉన్న వ్యక్తి.. ఆ తర్వాత తన కంటే తక్కువ స్థాయి ప్రోటోకాల్ ఉండే ఎంపీ పదవికి పోటీ చేయటం నైతిక.. గౌరవప్రదమైన కోణంలో చూస్తే చర్చనీయాంశంగా చెప్పాలి. ప్రోటోకాల్ ప్రకారం చూస్తే.. రాష్ట్రపతి మొదటిస్థానంలో ఉంటే.. ఎంపీలు 21వ స్థానంలో ఉంటారు. అంతేకాదు.. ప్రోటోకాల్ ప్రకారం చూసినా మాజీ రాష్ట్రపతి ఐదో స్థానంలో ఉంటారు.
ఇదంతా ఎందుకంటారా.. అక్కడికే వస్తున్నాం. దేశానికి రాష్ట్రపతి ఎలానో.. ఒక రాష్ట్రానికి గవర్నర్ పదవి అలాంటిదే. ఒక రాష్ట్రానికి ప్రధమ పౌరుడిగా వ్యవహరించే గవర్నర్.. తన పదవీ కాలం పూర్తి అయిన తర్వాత కానీ పదవి నుంచి వైదొలిగిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయటం చూస్తే కాస్తంత ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే.. గడిచిన కొన్ని దశాబ్దాలుగా పలువురు గవర్నర్లు.. తమ పదవీ కాలం ముగిసిన తర్వాత ఎమ్మెల్యేగా.. ఎంపీగా పోటీ చేసిన సందర్భాలున్నాయి. ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ నాలుగో స్థానంలో ఉంటారు. అదే సమయంలో గవర్నర్లు తాము పని చేసే రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉంటారు. కానీ.. అదే రాష్ట్రానికి రాష్ట్రపతి.. ప్రధానమంత్రి.. ఉప రాష్ట్రపతులు వస్తే మాత్రం.. వారి స్థానం నాలుగుగా ఉంటుంది. చివరకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సైతం ప్రోటోకాల్ ప్రకారం ఎనిమిదో స్థానంలో ఉంటారు. ఎందుకిలా అంటే.. గవర్నర్ ఒక రాష్ట్రానికి రాజ్యాంగబద్ధమైన అధిపతి కావటమే.
అలాంటి అత్యుత్తమ స్థానంలో ఉండే వ్యక్తి.. పదవీ విరమణ తర్వాత ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయటం కాస్తంత ఎబ్బెట్టుగా ఉంటుంది. ఇప్పుడే కాదు.. దశాబ్దాల క్రితం నుంచి ఈ తీరుపై ప్రజల్లో కానీ.. రాజకీయ వర్గాల్లో కానీ.. కీలక వ్యవస్థల్లో కానీ పెద్దగా చర్చ జరగకపోవటంతో.. గవర్నర్లుగా వ్యవహరించిన వారు తర్వాతి రోజుల్లో రాజకీయాల్లో కీలకంగా మారి.. రాజకీయాలను ప్రభావితం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇదంతా ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా వ్యవహరించిన తమిళసై.. ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
రాష్ట్రపతి పదవిని.. గవర్నర్ పదవితో పోల్చటం కాదు కానీ.. ఈ రెండింటి మధ్య ఒక ప్రధాన తేడా ఉంది. రాష్ట్రపతి పదవీ విరమణ తర్వాత కూడా ప్రోటోకాల్ లో నాలుగో స్థానంలో నిలిస్తే.. మాజీ గవర్నర్ కు ప్రోటోకాల్ లో ఎలాంటి చోటు కల్పించకపోవటం కనిపిస్తుంది. విలువల పరంగా చూసినప్పుడు.. ఒక రాష్ట్రానికి మొదటి పౌరుడిగా వ్యవహరించి.. రాజ్యాంగబద్ధమైన స్థానంలో కొంతకాలం ఉన్న తరవాత.. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయటం సబబుగా అనిపించదు. అయితే.. ఇప్పుడున్నరాజకీయ రంగంలో ఇలాంటి వాటి గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి చర్చను లేవనెత్తితో.. తమకంటే ముందుగా ఎంతో మంది అలాంటి పని చేశారు కదా? అని జాబితాను చూపించే అవకాశం లేకపోలేదు.
ఇక్కడే మన దేశ చరిత్రను చూస్తే మరో ఆసక్తికర సన్నివేశం కనిపిస్తుంది. దేశానికి తొలి గవర్నర్ జనరల్.. అంటే ఇప్పటి రాష్ట్రపతి పదవికి సమానమైన పదవిలో ఉన్న రాజగోపాలాచారి ఆ తర్వాతి కాలంలో మండలికి ఎన్నిక కావటం.. తమిళనాడుకు ముఖ్యమంత్రి కావటం చూసినప్పుడు.. వైరుధ్యం కనిపిస్తుంది. అయితే.. మండలికి ఆయన పోటీ చేయటం ద్వారా ఎన్నిక కాలేదు. గవర్నర్ నామినేట్ చేశారు. దేశ విభజన తర్వాత నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో నాటి అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా కోరటంతో ఆయన అందుకు ఒప్పుకున్నట్లు చెబుతారు.నిజానికి ఈతీరును అప్పటి ప్రతిపక్ష నేత ప్రకాశం పంతులు తీవ్రంగా ఆక్షేపించారు. పార్టీ కోరితే తాను ఏ పని చేయటానికైనా సిద్ధమని రాజాజీ పేర్కొనటమే ేకాదు.. తాను చేసిన పనిని త్యాగంగా ఆయన మద్దతుదారులు పేర్కొనేవారు. కాకుంటే.. రాజాజీ వ్యక్తిత్వాన్ని చూసినప్పుడు విమర్శకులు సైతం ఒక అడుగు వెనక్కి వేసే పరిస్థితి. ఆయన కానీ ముఖ్యమంత్రి కాకుంటే.. కమ్యునిస్టుల చేతుల్లోకి తమిళనాడు అధికార పగ్గాలు వెళ్లేవి. దీన్ని నిరోధించేందుకు రాజాజీని నాటి కాంగ్రెస్ అధినాయకత్వం ప్రయోగించిందని చెప్పాలి.
ఆయన తర్వాత ఇంకెవ్వరూ కూడా ఎమ్మెల్యేగా.. ఎంపీగా పోటీ చేసింది లేదు. కానీ.. గవర్నర్ పదవిని చేపట్టి.. .ఆ తర్వాతి కాలంలో అసెంబ్లీకి పోటీ చేసిన ఘన చరిత్రకు 1981-84 మధ్యలో నెలకొందని చెప్పాలి. సిక్కిం గవర్నర్ గా వ్యవహరించిన హోమి జె. తాల్యార్ ఖాన్ వ్యవహరించేవారు. ఆ తర్వాత ఆయన మహారాష్ట్ర అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత సునీల్ కుమార్ షిండే గవర్నర్ గా వ్యవహరించిన తర్వాత ఆ పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో గెలవటమే కాదు మహారాష్ట్ర రాజకీయాల్లో ఎంతటి కీలకభూమిక పోషించారో తెలిసిందే.
ఆయన మాదిరే మదన్ లాల్ ఖురానా, బేబీ రాణి మౌర్యలు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. అయితే.. వీరికి భిన్నంగా అరుణాచల్ ప్రదేశ్ కు గవర్నర్ గా వ్యవహరించిన జేజే సింగ్ ఆ తర్వాతి కాలంలో పంజాబ్ లోని పాటియాలా నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తెలంగాణ, పుదుచ్చేరిలకు గవర్నర్ గా వ్యవహరించిన తమిళసై 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఆమె మరోసారి మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నిబంధనలు అనుమతి ఇస్తున్నా.. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి.. ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయటమనే సంప్రదాయానికి ఇప్పుడు కాకున్నా.. భవిష్యత్తులో అయినా చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. రాష్ట్రపతి.. గవర్నర్ లాంటి పదవుల్లో ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని చెప్పి.. ఆ తర్వాత ఒక రాజకీయ పార్టీకి పరిమితమయ్యేలా పోటీ చేయటం.. తర్వాతి కాలంలో మరోసారి గవర్నర్ గా ఎంపికైతే.. చూసేందుకు ఎబ్బెట్టుగా ఉండటమే కాదు.. ఒక తప్పుడు సంప్రదాయానికి తెర తీసినట్లు అవుతుందన్నది మర్చిపోకూడదు.