రోడ్ డాక్టర్ : గుంతల సమస్యకు 20 నిమిషాల్లో శాశ్వత పరిష్కారం!
సాధారణంగా రోడ్డు మరమ్మతులు అంటే తారును భారీగా వేడి చేయడం, రోడ్లను తవ్వడం, ట్రాఫిక్‌ను గంటల తరబడి నిలిపివేయడం వంటి సమస్యలు ఉంటాయి. కానీ ఈ ‘రోడ్ డాక్టర్’ మెషీన్‌తో అలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అధ్వాన్నంగా మారిన రహదారుల మరమ్మతులపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో రోడ్లపై గుంతల కారణంగా వాహనదారులు పడుతున్న ఇబ్బందులకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సరికొత్తగా 'రోడ్ డాక్టర్' టెక్నాలజీని ప్రవేశపెడుతోందని చెబుతున్నారు. రహదారుల నిర్వహణను మరింత వేగవంతంగా, పర్యావరణహితంగా మార్చేందుకు మొబైల్ ఇన్ఫ్రారెడ్ మిషన్లను వినియోగించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా రోడ్డు మరమ్మతులు అంటే తారును భారీగా వేడి చేయడం, రోడ్లను తవ్వడం, ట్రాఫిక్‌ను గంటల తరబడి నిలిపివేయడం వంటి సమస్యలు ఉంటాయి. కానీ ఈ ‘రోడ్ డాక్టర్’ మెషీన్‌తో అలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు అంటున్నారు.
అధునాతన ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీతో రోడ్లను మరమ్మతు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇన్ఫ్రారెడ్ హీటింగ్ వ్యవస్థతో పనిచేసే ఈ టెక్నాలజీని వాడి గుంత పడిన ప్రాంతాన్ని వేడి చేసి, అక్కడికక్కడే రాళ్లు, తారు మిశ్రమాన్ని తయారు చేసి గుంతల్లో నింపుతారని చెబుతున్నారు. దీంతో కేవలం 15 నుండి 20 నిమిషాల వ్యవధిలోనే గుంతలను పూడ్చేయొచ్చని అంటున్నారు. ఒక పెద్ద గుంతను పూర్తిగా పూడ్చి, రోడ్డును సాధారణ స్థితికి తీసుకురావడానికి పెద్దగా సమయం అవసరం లేదని నిపుణులు చెబుతుండటంతో ప్రభుత్వం ఈ టెక్నాలజీపై ఆసక్తి చూపుతోందని అంటున్నారు.
అదేవిధంగా ఒక డ్రైవర్, నలుగురు కార్మికులతోనే ఈ వాహనాన్ని ఆపరేట్ చేయవచ్చునని అంటున్నారు. దీనివల్ల శ్రమ, సమయం భారీగా ఆదా అవుతాయని చెబుతున్నారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాల మున్సిపల్ కార్పొరేషన్లు ఇప్పటికే ఈ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయ. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సుమారు రూ.1.48 కోట్ల వ్యయంతో 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా ఈ అధునాతన ఇన్ఫ్రారెడ్ రోడ్డు మరమ్మతు వాహనాన్ని కొనుగోలు చేసి ప్రారంభించినట్లు చెబుతున్నారు. అదేవిధంగా గుంటూరులో కూడా రూ. 1.50 కోట్ల వ్యయంతో ఈ వాహనాన్ని వినియోగిస్తున్నారని సమాచారం. ఇది రోజుకు 10 నుంచి 15 ప్రధాన గుంతలను సునాయాసంగా పూడ్చేస్తోందని అంటున్నారు.
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా ఈ 'రోడ్ డాక్టర్' మెషీన్ల కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులు ఆదేశించారు. వర్షాకాలంలో త్వరితగతిన రోడ్లను బాగు చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. సాంప్రదాయ పద్ధతుల్లో రోడ్లు వేసేటప్పుడు వెలువడే దట్టమైన పొగ కారణంగా పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది. అయితే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ నివేదికల ప్రకారం, ఈ ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ ఆధారిత రోడ్ డాక్టర్ మిషన్లను వాడటం వల్ల కార్బన్ ఉద్గారాలు దాదాపు 98 శాతం వరకు తగ్గుతాయని అంటున్నారు.
ఇక రోడ్ల మరమ్మతులను ట్రాక్ చేయడానికి ప్రభుత్వం డాష్‌క్యామ్ సర్వే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కూడా జోడిస్తోందని అంటున్నారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయో గుర్తించి, వాటిని వెంటనే ఈ 'రోడ్ డాక్టర్' మిషన్ల ద్వారా సరిచేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఏపీని గుంతలు లేని రాష్ట్రంగా మార్చాలనే ప్రభుత్వ సంకల్పంలో ఈ 'రోడ్ డాక్టర్' ఒక విప్లవాత్మక అడుగు కానుందని అంటున్నారు. తక్కువ ఖర్చుతో, అత్యంత వేగంగా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా రోడ్లను బాగు చేసే ఈ టెక్నాలజీ రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన రహదారులపై అందుబాటులోకి రానుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.