దళపతి 'చెక్ మేట్' : వరల్డ్ ఛాంపియన్‌తో తలపడ్డ సీఎం విజయ్!
ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లు తలపడే నార్వే చెస్ టోర్నీలో ప్రజ్ఞానంద సాధించిన విజయం సామాన్యమైనది కాదని అంటున్నారు.
రాజకీయ చదరంగంలో విజేతగా నిలిచిన తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నిజమైన చెస్ బోర్డుపైనా పావులు చురుగ్గా కదిపారు. ప్రపంచ ఛాంపయన్ ప్రజ్ఞానందకు చెక్ చెప్పే ప్రయత్నం చేసి అబ్బురపరిచారు. ఒకవైపు సీఎం విజయ్, మరోవైపు వరల్డ్ ఛాంపియన్ ప్రజ్ఞానంద మధ్య ఎత్తులకు పైఎత్తులతో సాగిన పోరు ఆసక్తి రేపింది. సరదాగా సాగిన ఇద్దరు విజేతల మధ్య చదరంగం సరికొత్త మజాను అందించింది. అంతర్జాతీయ వేదికపై భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగురవేసిన యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానందను సీఎం విజయ్ చెన్నైలోని సచివాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సచివాలయంలో ప్రజ్ఙానందతో కాసేపు చెస్ ఆడిన సీఎం విజయ్ తనలోని ప్రతిభను చాటుకున్నారు.
రూ. 50 లక్షల నజరానా
ప్రతిష్టాత్మక 'నార్వే చెస్ 2026' సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో చారిత్రాత్మక విజయం సాధించిన ప్రజ్ఞానందను అభినందిస్తూ, తమిళనాడు ప్రభుత్వం తరఫున రూ. 50 లక్షల నగదు బహుమతిని సీఎం విజయ్ అందజేశారు. కేవలం అధికారిక సత్కారానికే పరిమితం కాకుండా, దళపతి విజయ్ యువ గ్రాండ్‌మాస్టర్‌తో కాసేపు సరదాగా చెస్ ఆడారు. బోర్డుపై పావులను కదుపుతూ ప్రజ్ఞానందకు గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి, ప్రపంచ స్థాయి చెస్ ప్లేయర్ తలపడిన ఈ అరుదైన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దళపతి స్టైలిష్ లుక్, చెస్ బోర్డు వైపు ఆయన సీరియస్‌గా చూస్తున్న ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద
ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లు తలపడే నార్వే చెస్ టోర్నీలో ప్రజ్ఞానంద సాధించిన విజయం సామాన్యమైనది కాదని అంటున్నారు. ప్రపంచ ఛాంపియన్లను, టాప్ సీడెడ్ ఆటగాళ్లను తన మేధస్సుతో మట్టికరిపించి, ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను కైవసం చేసుకున్న తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద సరికొత్త రికార్డును లిఖించాడు. క్లిష్టమైన సమయాల్లోనూ ఏమాత్రం ఒత్తిడికి లోనవకుండా ప్రజ్ఞానంద ప్రదర్శించిన వ్యూహాలు అంతర్జాతీయ చెస్ వర్గాలను సైతం అబ్బురపరిచాయి. ఈ అద్భుత విజయంతో భారతదేశంతో పాటు తమిళనాడు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసినందుకు సీఎం విజయ్ ప్రజ్ఞానందను అభినందించారు.
క్రీడలకు దళపతి అండ!
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్ మాట్లాడుతూ.. ప్రజ్ఞానంద విజయం దేశంలోని లక్షలాది మంది యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. భవిష్యత్తులో ప్రజ్ఞానంద మరిన్ని అంతర్జాతీయ వేదికలపై రాణించేలా ప్రభుత్వం తరఫున పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతుల కల్పనకు, యువ ప్రతిభను ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. ఈ భేటీలో ప్రజ్ఞానంద కుటుంబ సభ్యులతో పాటు క్రీడా శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.