ఢిల్లీలో పొలిటికల్ థ్రిల్లర్.. బెంగాల్ సీఎంతో 20 మంది టీఎంసీ ఎంపీల భేటీ.. దీదీకి షాక్

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. విపక్ష తృణమూల్ కాంగ్రెస్ తో తెగతెంపులు చేసుకోడానికి ఆ పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు రహస్యంగా సమావేశమయ్యారు.

Update: 2026-06-08 13:15 GMT

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. విపక్ష తృణమూల్ కాంగ్రెస్ తో తెగతెంపులు చేసుకోడానికి ఆ పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు రహస్యంగా సమావేశమయ్యారు. ఈ భేటీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కూడా హాజరయ్యారన్న ప్రచారం మరింత హీట్ పుట్టిస్తోంది. మరోవైపు ప్రతిపక్షం ఇండియా కూటమి భేటీకి వచ్చిన మాజీ సీఎం మమతా బెనర్జీ ఢిల్లీలోనే ఉన్నారు. ఇలా మొత్తం రాష్ట్ర రాజకీయం అంతా ఢిల్లీకి కేంద్రీకృతం కావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ ఎక్కువవుతోంది.

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ పార్టీకి చెందిన 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. సోమవారం ఢిల్లీలోని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ నివాసంలో ఈ ఎంపీలంతా అత్యవసరంగా భేటీ కావడం తీవ్ర సంచలనంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ పక్షనేతగా అభిషేక్ బెనర్జీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు 20 మంది ఎంపీలు మూకుమ్మడిగా ప్రకటించారు. పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు సాగుతున్నాయంటూ ఆరోపిస్తున్న పార్లమెంటు సభ్యులు టీఎంసీపీపీ నాయకుడు అభిషేక్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంపైనా అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్న పార్లమెంటు సభ్యులు, సభలో తమను ప్రత్యేక గ్రూపుగా ప్రకటించాలని కోరుతూ స్పీకర్ కు లేఖ రాయాలని నిర్ణయించారని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో స్పీకర్ నుంచి అనుకూల నిర్ణయం రాకపోతే మొత్తం ఎంపీలు అందరూ సామూహికంగా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. లోక్ సభలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మొత్తం 29 మంది ఎంపీలు ఉండగా, అందులో 20 మంది తిరుగుబాటు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

రాజ్యాంగం ప్రకారం 2/3 వంతు చీలిక రావడంతో మెజార్టీ ఉన్నవారినే అసలైన పార్టీ ప్రతినిధులుగా గుర్తించే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి మమత చేతుల నుంచి తృణమూల్ కాంగ్రెస్ చేజారిపోయే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే బెంగాల్ శాసనసభలో 60 మంది ఎమ్మెల్యేలు వేరుకుంపటి పెట్టుకుని మమతకు షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఎంపీలు కూడా అదే స్వరం వినిపిస్తుండటంతో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయంగా తీరని నష్టాన్ని ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు.

రాజ్యసభలోనూ రాజీనామాల పర్వం

కేవలం ఎమ్మెల్యేలు, లోక్‌సభ ఎంపీలు మాత్రమే కాదు, ఇటు రాజ్యసభలోనూ తృణమూల్ కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. పార్టీ అంతర్గత పరిణామాలపై అసంతృప్తితో ఉన్న కొందరు రాజ్యసభ ఎంపీలు సైతం తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఒకే రోజు అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభ సభ్యులు తిరుగుబాటు బాట పట్టడంతో తృణమూల్ కాంగ్రెస్ ఉనికికే ప్రమాదం ఏర్పడే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు.

Tags:    

Similar News