మాజీ ఎమ్మెల్యే జేసీ అనుచరుల హంగామా.. వైసీపీకి బహిరంగ హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. చాలా కాలం తర్వాత యాక్టివ్ అయిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి విపక్షం వైసీపీ నేతలకు బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. చాలా కాలం తర్వాత యాక్టివ్ అయిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి విపక్షం వైసీపీ నేతలకు బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో కూటమి తప్ప, మరే పార్టీ వారు పోటీ చేసేందుకు అనుమతించేది లేదని తేల్చిచెప్పేలా మాట్లాడారు. వైసీపీకి చెందిన మండల స్థాయి నేతల పేర్లు ఒక్కొక్కటి చెబుతూ ఊరు విడిచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు వేయాలని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి చెబుతున్నారని, ఆయన బాధ్యత కాబట్టి అలా మాట్లాడుతున్నారని, కానీ తాము ఎవరితో నామినేషన్లు వేయించే క్వశ్చనే లేదని స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై కేడర్ తో సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి వచ్చేమూడేళ్లు టీడీపీదే హవా అంటూ తేల్చిచెప్పారు. పెద్ద నాయకులు, బడా నాయకులు అనుకుంటున్న వైసీపీ నేతలు ఆ ఐదేళ్లు ఏం చేశారో గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. మీరు అప్పుడు ఏం చేశారో, మావాళ్లు ఇప్పుడు అదే చేస్తారంటూ స్పష్టం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. నేను వద్దన్నా, మా వాళ్లు వదిలేలా లేరు అంటూ కుండబద్ధలు కొట్టారు. మూడేళ్ల తర్వాత వస్తామంటూ కొందరు మాట్లాడుతున్నారని, అటువంటి వారు ఈ మూడేళ్లు అధికారం మా చేతిలో ఉందన్న విషయాన్ని మరచిపోవద్దని వ్యాఖ్యానించారు.
మీ నాయకుడు నామినేషన్లు వేయమన్నాడని ఎవరైనా బయటకు రావొచ్చు కానీ మా మావాళ్లు మంచివారు కారంటూ జేసీ తేల్చిచెప్పారు. స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గెలిపించే బాధ్యత తనదేనంటూ స్పష్టం చేశారు. గత రెండేళ్లలో కొన్ని పనులు చేయకపోవచ్చునని, ఎన్నికల సమయంలో చెప్పినవన్నీ చేయలేమని అన్నారు జేసీ. మూడేళ్ల తర్వాత ఏమైనా జరగొచ్చని, మేం కూడా అందుకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలిచ్చారు. అంతేకాని ఇప్పుడు జెండాలు పట్టుకుని వస్తే అంగీకరించేది లేదని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
50 వాహనాలతో హల్ చల్
ఇక జేసీ అనుచరులవిగా చెబుతున్న 50 వాహనాల కాన్వాయ్ తాడిపత్రిలో దుమారం రేపుతోంది. జేసీని ప్రశ్నించిన వైసీపీ నాయకుల ఇళ్లపై 50 వాహనాలతో టీడీపీ కార్యకర్తలు బయలు దేరారని వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో తాడిపత్రి రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. వైసీపీకి చెందిన ఒక్కొక్క పేరు చెబుతూ ఊరు విడిచి వెళ్లిపోవాలని మాజీ ఎమ్మెల్యే జేసీ ఇచ్చిన వార్నింగ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.