వైజాగ్ స్టీల్‌లో విషాదం.. ఒక్క క్షణం నిర్లక్ష్యం 8 ప్రాణాలను బలిగొన్నదా?
విశాఖపట్నంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ, విశాఖ ఉక్కు కర్మాగారం మరోసారి భారీ ప్రమాదంతో ఉలిక్కిపడింది.
విశాఖపట్నంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ, విశాఖ ఉక్కు కర్మాగారం మరోసారి భారీ ప్రమాదంతో ఉలిక్కిపడింది. దేశంలోని అతిపెద్ద ఉక్కు పరిశ్రమల్లో ఒకటిగా పేరొందిన ఈ ప్లాంట్‌లో సోమవారం చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మొదట సాధారణ ప్రమాదంగా కొద్దిమందికి గాయాలయ్యాయనే వార్తలు వచ్చినప్పటికీ.. సమయం గడిచేకొద్దీ ఇది పెద్ద విషాదంగా మారింది. ఈ ఘటన ప్లాంట్‌లో కార్మికుల భద్రతా ప్రమాణాలపై మరోసారి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.
స్టీల్ మెల్టింగ్ షాప్‌లో అసలేం జరిగింది?
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. విశాఖ ఉక్కు కర్మాగారంలోని అత్యంత కీలకమైన స్టీల్ మెల్టింగ్ షాప్-2 విభాగంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ విభాగంలో వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఇనుమును ద్రవరూపంలోకి మార్చి వివిధ రకాల ఉక్కు ఉత్పత్తులను తయారు చేస్తారు. పరిశ్రమ మొత్తంలోనే ఇది అత్యంత ప్రమాదకరమైన సున్నితమైన విభాగం. ప్రాథమిక అంచనాల ప్రకారం.. అక్కడ పనిచేస్తున్న సమయంలో అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తింది. భద్రతా వ్యవస్థ వైఫల్యం చెందడం వల్ల లేదా ఒత్తిడి ఎక్కువవడం వల్ల అత్యంత వేడిగా, మరుగుతున్న ద్రవ లోహం ఒక్కసారిగా అక్కడే విధులు నిర్వహిస్తున్న కార్మికులపై చిందినట్లు తెలుస్తోంది. ద్రవ లోహం శరీరంపై పడటంతో క్షణాల వ్యవధిలోనే పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ,మార్గమధ్యంలోనే 9 మంది కార్మికులు మరణించినట్లు సమాచారం అందుతోంది.
ఉక్కు పరిశ్రమల్లో ప్రమాదాలకు ప్రధాన కారణాలు ఏమిటి?
స్టీల్ మెల్టింగ్ యూనిట్లలో పనిచేసే కార్మికులు ప్రతిరోజూ మృత్యువుతో పోరాడుతూనే విధులు నిర్వహిస్తుంటారు. వేల డిగ్రీల వేడి, భారీ యంత్రాలు, హై-ప్రెజర్ గ్యాస్ లైన్లు ఎల్లప్పుడూ ప్రమాదకరంగానే ఉంటాయి. పారిశ్రామిక భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇలాంటి భారీ ప్రమాదాలు జరగడానికి పాతబడిన యంత్రాలు లేదా సెన్సార్లు సమయానికి పని చేయకపోవడం... యంత్రాల భద్రతను క్రమ పద్ధతిలో తనిఖీ చేయకపోవడం. మేనేజ్‌మెంట్ స్థాయిలో రక్షణ నిబంధనలను కఠినంగా అమలు చేయకపోవడం... ప్రమాదం జరిగిన వెంటనే స్పందించే ఆటోమేటిక్ సేఫ్టీ సిస్టమ్స్ విఫలం కావడం... కార్మికులకు నాణ్యమైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ అందుబాటులో లేకపోవడం లేదా వాటిని ధరించడంలో నిర్లక్ష్యం కారణంగా కనిపిస్తోంది.
మేనేజ్‌మెంట్ , భద్రతా వ్యవస్థలపై ప్రశ్నల వర్షం
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, భారీ బడ్జెట్ ఉన్నప్పటికీ వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కావడం పట్ల కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసలు ఈ ప్రమాదానికి కారణం సాంకేతిక వైఫల్యమా? లేక మానవ తప్పిదమా? అనే కోణంలో ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాల్సి ఉంది. ఉత్పత్తి లక్ష్యాల కోసం యాజమాన్యం కార్మికుల ప్రాణాలను పణంగా పెడుతోందా అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
స్పందించిన ప్రభుత్వం.. ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి
ఈ ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన ఇతర కార్మికులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని జిల్లా అధికారులను, వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు. జిల్లా కలెక్టర్, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ప్లాంట్‌ను సందర్శించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఉత్పత్తి కంటే ప్రాణాలే ముఖ్యం!
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఈ విషాద ఘటన కేవలం ఒక ప్రమాదం మాత్రమే కాదు. దేశంలోని అన్ని భారీ పరిశ్రమలకు ఒక హెచ్చరిక. పరిశ్రమల్లో లాభాలు, ఉత్పత్తి లక్ష్యాల కంటే కార్మికుల ప్రాణాలకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలనే చేదు నిజాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. ప్రభుత్వ దర్యాప్తు నివేదిక వస్తేనే అసలు తప్పు ఎవరిదనేది తేలనుంది. ఏది ఏమైనప్పటికీ ఒకే ఒక్క క్షణం జరిగిన నిర్లక్ష్యం వల్ల ఎనిమిది మంది కార్మికుల కుటుంబాల్లో నిండిన చీకట్లు మాత్రం ఎప్పటికీ తీరని విషాదంగా మిగిలిపోనున్నాయి.