10% ఇళ్లకు తాళాలు.. తెలంగాణలో మనుషులున్నట్లా? లేనట్లా?

మే 11 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన జనగణన ప్రక్రియలో ఎన్యూమరేటర్లు తలుపులు తట్టుకుంటూ వెళ్తుంటే... ఊహించని షాక్‌లు తగులుతున్నాయి.

Update: 2026-06-08 16:53 GMT

తెలంగాణ జనగణనలో సరికొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో అసలు జనాభా ఎంత ఉందన్న విషయాన్ని పక్కనపెడితే... కొంతమంది ఇంకా తెలంగాణలోనే ఉన్నారా? లేక ఇప్పటికే మరో గ్రహానికి వలస వెళ్లారా? అన్న వింత సందేహం ఇప్పుడు అధికారులను, ఎన్యూమరేటర్లను వెంటాడుతోంది.

మే 11 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన జనగణన ప్రక్రియలో ఎన్యూమరేటర్లు తలుపులు తట్టుకుంటూ వెళ్తుంటే... ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.28 లక్షల ఇళ్లకు తాళాలు వేలాడుతూ కనిపించాయి. దీంతో క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది "మాకు జనాభా లెక్కల కంటే తాళాల లెక్కలే ఎక్కువగా కనిపిస్తున్నాయి" అంటూ సరదాగా వాపోతున్నారు.

"మేమున్నాం... కానీ ఇంట్లో లేం!"

గణన కోసం వెళ్లిన సిబ్బందికి కొన్ని ఇళ్ల దగ్గర చిత్ర విచిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. కొన్ని ఇళ్ల యజమానుల నంబర్లు సంపాదించి ఫోన్ చేస్తే... "మేమున్నాం సార్... కాకపోతే ఇంట్లో లేం" అంటూ కూల్‌గా సమాధానం ఇస్తున్నారు. మరికొన్ని ఇళ్ల పరిస్థితి అయితే మరీ ఆసక్తికరంగా ఉంది. ఇంట్లో ఎవరూ కనిపించరు... ఫోన్ చేస్తే అస్సలు ఎత్తరు. కానీ... నెలనెలా కరెంట్ బిల్లు మాత్రం టంచన్‌గా వస్తూనే ఉంటుంది. దీంతో ఆ ఇళ్లలో అసలు మనుషులు ఉంటున్నారా? లేక కేవలం వై-ఫై, స్మార్ట్ హోమ్ అప్లయన్స్ మాత్రమే జీవిస్తున్నాయా? అనే చర్చ జోరుగా సాగుతోంది. "ఒక ఇంటికి వరుసగా మూడు సార్లు వెళ్లాం. ప్రతిసారీ తాళమే దర్శనమిచ్చింది. నాలుగోసారి వెళ్తే ఆ తాళానికి కూడా సెలవు పెట్టి, ఇంకేదైనా కొత్త తాళం పెడతారేమో అని భయమేస్తోంది!" అని ఒక ఎన్యూమరేటర్ ఆవేదన వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో మీమ్స్ పండగ

ఈ తాళాల భాగోతంపై సోషల్ మీడియాలో మీమ్స్ రాయుళ్లు పండగ చేసుకుంటున్నారు. నెటిజన్లు రకరకాల సెటైర్లతో పోస్టులు పెడుతున్నారు. "అధికారులు వెళ్ళింది జనాభా లెక్కలు తీయడానికా? లేక తప్పిపోయిన ఇంటి యజమానులను వెతకడానికా?" అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. "తెలంగాణలో జనాభా కంటే తాళాల సంఖ్యే పక్కాగా తెలిసేలా ఉంది" అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు.

ఒక అంచనా... కొన్ని మిస్టరీలు!

మరోవైపు అధికారులు మాత్రం రాష్ట్ర జనాభా దాదాపు 4.10 కోట్ల వరకు ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే ఈ 4.10 కోట్లలో తాళం వేసిన ఇళ్లు సుమారు 1.28 లక్షలు.. ఫోన్ రెస్పాన్స్ "ఉన్నాం కానీ లేం" బ్యాచ్ .. సైలెంట్ మోడ్ లో ఇంట్లో ఉన్నా తలుపు తీయని వారు ఉన్నారు.

ఈ లెక్కలన్నీ తేలాలంటే "తాళం వేసిన ఇళ్ల కోసం ప్రత్యేక జనగణన" ఏమైనా పెట్టాలేమోనని అధికారులు జోకులు పేలుస్తున్నారు. ప్రస్తుతానికి తెలంగాణలో అత్యంత క్లిష్టమైన ప్రశ్న "రాష్ట్ర జనాభా ఎంత?" అనేది కాదు... ఆ తాళం వేసిన ఇంట్లో అసలు ఎవరైనా ఉన్నారా? లేరా?" అన్నదే పెద్ద ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News