జూన్ 1కి వారు బెజవాడకు వెళ్లిపోవటమే

Update: 2015-12-02 05:12 GMT
మరో ఏడు నెలలంతే. హైదరాబాద్ లో పని చేస్తున్న 19,124 మంది ఏపీ క్యాడర్ ఉద్యోగులతా బెజవాడకు వెళ్లిపోనున్నారు. ఇందుకు సంబంధించి విస్పష్ట ఉత్తర్వులు విడుదలయ్యాయి. కొత్త రాజధాని ప్రాంతం నుంచి పని చేసేందుకు ఉద్యోగులంతా సిద్ధం కావాలంటూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో వెల్లడించారు.

ఏపీ క్యాడర్ ఉద్యోగులు హైదరాబాద్ ను వీడిపోతే.. విభజనలో అత్యంత కీలక అంకం ముగియటంతో పాటు.. హైదరాబాద్ లో ఏపీ ప్రభుత్వ ఆనవాళ్లు దాదాపుగా కనుమరుగైనట్లే. ఏడు నెలల వ్యవధిలో ఏపీకి రానున్న భాగ్యనగరంలోని ఏపీ క్యాడర్ ఉద్యోగులకు అవసరమైన వసతి సౌకర్యంపై ప్రభుత్వం దృష్టి సారించింది. తాజాగా ఏపీ సర్కారు విడుదల చేసిన విస్పష్ట ఆదేశాల నేపథ్యంలో.. జూన్ 1 నాటికి భాగ్యనగరిలోని ఏపీ ఉద్యోగులంతా బెజవాడకు వెళ్లిపోవటం కన్ఫర్మ్ అయినట్లే.

బెజవాడకు రానున్న అధికారులకు అవసరమైన ఆఫీసు వసతితో పాటు.. నివాస వసతికి సంబంధించిన అంచనాల్ని అధికారులు సిద్ధం చేశారు. సచివాలయం.. మిగిలిన ప్రాంతాల్లోని 35 కీలక విభాగాలకు సంబంధించి బెజవాడలో ఏర్పాట్లు చేయాలంటే ఎంత స్థలం అవసరమన్న లెక్కను కూడా ఏపీ సర్కారు సిద్ధం చేసింది. దీని ప్రకారం సుమారు 46 లక్షల అడుగుల స్థలం అవసరమని తేల్చారు. నివాసాల కోసం అంచనాలు వేయటం జరిగింది. మరి.. వీటికి సంబంధించిన ఏర్పాట్లు ఏడు నెలల వ్యవధిలో పూర్తి అవుతాయా? అన్నదే పెద్ద సందేహం. ప్రభుత్వ పరంగా చేయాల్సిన పనుల సంగతి ఎలా ఉన్నా.. ఉద్యోగులు మాత్రం బెజవాడకు తరలి వెళ్లేందుకు రెఢీ కావటం మినహా మరో అప్షన్ లేదన్నది తాజాగా విడుదల చేసిన ఉత్తర్వు స్పష్టం చేస్తోంది.
Tags:    

Similar News