ఆనం వివేకా ఎంత పేదోడంటే..

Update: 2017-02-19 07:28 GMT
ఆనం వివేకానంద రెడ్డి.. తెలుగు రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరిది. వయసు 70 ఏళ్లకు రీచయిపోతున్నా ఇంకా ఆయన పూల రంగడే. తన వ్యతిరేకులపై విమర్శలు చేశారంటే ఆ రోజు మీడియాలో అది హాట్ టాపిక్కే అవుతుంది. అంతలా రెచ్చిపోయి విమర్శలు చేస్తారాయన. సినిమాల్లో నటించాలన్న కోరికా తక్కువేమీ కాదు, కానీ, అవకాశాలే రావడం లేదు. ఆయన లైఫ్ స్టైల్ కూడా చాలా కాస్ట్ లీ. ఆయన సిగరెట్ల ఖర్చు ఒక మధ్య తరగతి మనిషి నెల జీతం కంటే ఎక్కువే ఉంటుందంటుంటారు. ఆయన గాగుల్స్ - షూష్ అత్యంత ఖరీదైనవే వాడుతారట. పైగా పెద్ద కలెక్షన్ కూడా ఉందని ఆయన పరిచయస్థులు చెబుతుంటారు. ఘనమైన రాజకీయ వారసత్వం - వ్యాపారాలు - చాలాకాలం పాటు వరుస విజయాలతో ఆనం మంచి స్థితిమంతుడే. కానీ, ఇప్పుడు మాత్రం ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా డబ్బుల్లేవని చెబుతున్నారు. అదెంతవరకు నిజమో ఆయనకే తెలియాలి కానీ.. ఆయన ఇప్పుడు ఆ మాట ఎందుకు చెబుతున్నారన్నది చూస్తే మాత్రం ఔనా అనుకోవాలి.
    
ఆనం వివేకా తమ్ముడు రాంనారాయణరెడ్డి గత ప్రభుత్వాల్లో కీలక మంత్రి. ఇంతవరకు సోదరులిద్దరిదీ ఒకటే మాట. నిజం చెప్పాలంటే రాజకీయాల్లో ఆనం వివేకా చిన్నోడేం కాకపోయినా పెద్ద పదవులు మాత్రం ఆయనకు దక్కలేదు. కారణం.. ఆయన వివాదాస్పద వ్యవహారా శైలే. వివేకాకు భిన్నంగా రాంనారాయణరెడ్డికి సౌమ్యుడు - లౌక్యమెరిగిన నేతగా పేరు. అందుకే ఆయనకు ఆర్థిక శాఖ వంటి కీలక శాఖలు గతంలో దొరికాయి. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వారు రాగలిగారంటే కూడా అది రాంనారాయణ వల్లే. అయితే.. అదే రాంనారాయణతో సంబంధం లేకుండా వివేకా ఎమ్మెల్సీ పదవిపై గురిపెట్టారట. చంద్రబాబును మెప్పించి ఎమ్మెల్సీ పదవిని కొట్టేయడానికి సొంతంగా పావులు కదిపారట. అది రాంనారాయణకు నచ్చలేదని.. అన్నదమ్ములిద్దరి మధ్య విభేదాలకు దారితీసిందని చెబుతున్నారు.
    
అయితే.. వివేకా మాత్రం అదేమీ లేదంటున్నారు. తన సోదరుడికి తెలియకుండా తాను ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నిస్తున్నట్టు వస్తున్న విమర్శలన్నీ అవాస్తవమని ఆయన కొట్టిపారేస్తున్నారు. తన తమ్ముడితో ఎటువంటి విభేదాలు లేవని, జీవితాంతం ఇద్దరమూ కలిసే ఉంటామని అంటున్నారు.  ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్న వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి విజయానికి కృషి చేస్తున్నామని అన్నారు. పట్టాభి నామినేషన్ సందర్భంగా తాను లేనని, ఆ సమయంలో తాను చంద్రబాబు వద్ద ఉన్నానని, తిరుగు ప్రయాణంలో నెల్లూరుకు వస్తున్న సమయంలో రామనారాయణ విజయవాడకు వస్తుండగా, దారి మధ్యలో కలిసి మాట్లాడుకున్నామని తెలిపారు. అంతే తప్ప అది తమ్ముడితో విభేదాల వల్ల రాకపోవడం కాదని చెబుతున్నారు.
    
తమలో ఎవరికి పదవి వచ్చినా మరొకరు అడ్డుకోబోరని, ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లో ఉన్నామని చెప్పుకొచ్చారు. తనకు ఎమ్మెల్సీ కావాలన్న కోరిక ఉండడం వాస్తవమేనని.. అయితే, తమ్ముడికి ఇష్టం లేకుండా ఏ పదవీ చేపట్టనని చెబుతున్నారు. అంతేకాదు.. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేంత ఆర్థిక బలం తనకు లేదని.. గవర్నర్ లేదా ఎమ్మెల్యేల కోటాలో వస్తే తీసుకుంటానని అంటున్నారు. ఆనం వివేకా ఎంత పేదోడో మరి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News