అంబటి కామెంట్..కోడెల ఆత్మహత్యకు బాబే కారణమట!

Update: 2019-09-20 16:33 GMT
టీడీపీ సీనియర్ నేత - ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై టీడీపీ - వైసీపీల మధ్య మాటల మంటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీ వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ చెబుతోంటే... చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు పట్టించుకోకపోవడం కారణంగానే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని వైసీపీ వాదిస్తోంది. టీడీపీ వాదన ప్రకారం కోడెల ఆత్మహత్యకు ప్రధాన కారణంగా కోడెల ఇంటికి తరలిన అసెంబ్లీ ఫర్నీచర్ కు సంబందించి నమోదైన కేసేనని చెప్పాలి. లక్ష రూపాయల విలువ చేసే ఫర్నీచర్ ను తీసుకెళ్లారని కోడెలపై కేసులు పెడతారా? అంటూ టీడీపీ - ప్రత్యేకించి ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో బాబు విమర్శలకు కౌంటర్ ఇచ్చిన వైసీపీ కీలక నేత - కోడెలను మొన్నటి ఎన్నికల్లో ఓడించిన సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

కోడెల ఏకాకిగా మారిన కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారన్న ఇదివరకే చెప్పిన తన మాటను అంబటి శుక్రవారం మరోమారు ప్రస్తావించారు. కోడెల గత నెల 23న స్లీపింగ్ పిల్స్ మింగి ఆత్మహత్యాయత్నం చేసిన సమయంలో చంద్రబాబు పలకరించి ఉంటే... ఇప్పుడు కోడెల ఆత్మహత్య చేసుకునే వారు కాదని అంబటి చెప్పారు. పార్టీలో క్రియాశీలనేతగా ఉన్న కోడెల తీవ్ర మానసిక వేదనలో కూరుకుపోయిన సమయంలో ఆయనకు పరామర్శించి ధైర్యం చెప్పాల్సిన చంద్రబాబు... ఆ పని చేయకుండా ఇప్పుడు కోడెల ఆత్మహత్యను తమపైకి రుద్దుతున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలిసారి ఆత్మహత్యాయత్నం చేసుకున్నప్పుడు కోడెలకు చంద్రబాబు ధైర్యం చెప్పి ఉంటే... ఇప్పుడు కోడెల చనిపోయేవారు కాదు కదా అని కూడా అంబటి అన్నారు.

ఇదిలా ఉంటే... కోడెల తన ఇంటికి తరలించిన అసెంబ్లీ ఫర్నీచర్ విలువ లక్ష రూపాయలేనంటూ చంద్రబాబు చేస్తున్న విమర్శలపైనా అంబటి తనదైన రేంజిలో ఫైరయ్యారు. కోడెల ఇంటికి తరలిన ఫర్నీచర్ విలువ లక్ష రూపాయలేనంటూ చంద్రబాబు అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తిన అంబటి... ఆ ఫర్నీచర్ విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని ఫర్నీచర్ అతి పురాతనమైనదని - దాని విలువ లక్షల్లో కాదు కోట్లలో ఉంటుందని అంబటి చెప్పారు. కోట్ల రూపాయల విలువ చేసే అతి పురాతనమైన అసెంబ్లీ ఫర్నీచర్ ను కోడెల ఎలాంటి అనుమతి లేకుండానే తన ఇంటికి తరలించుకునిపోయారని ధ్వజమెత్తారు. మొత్తంగా కోడెల ఆత్మహత్యకు చంద్రబాబే కారణమని - అదే సమయంలో కోడెల తరలించుకుపోయిన ఫర్నీచర్ విలువ కోట్లలో ఉంటుందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయాయి.
 

Tags:    

Similar News