రాజకీయంతో కంట్రోల్ చేసే రోజులు పోయాయా?

Update: 2022-05-25 07:34 GMT
అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటం మామూలే. అధికారపక్షం తీసుకున్న నిర్ణయాల్ని వ్యతిరేకిస్తూ ప్రజలు రోడ్ల మీదకు రావటం తెలిసిందే. అయితే.. ఇలాంటివాటిని 'రాజకీయం'తో అణిచివేయటం తమకు చాలా అలవాటైన విషయంగా నేతలు భావిస్తుంటేవారు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తున్నప్పుడు.. రాజకీయం కొత్త పాఠాలు నేర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్న భావన కలుగక మానదు.

అమలాపురం పట్టణంలో చోటు చేసుకున్న అరుదైన ఆగ్రహావేశాల్ని చూస్తే.. రాజకీయ వర్గాలకు నిరసనకారులు.. ఆందోళనకారులు సరికొత్త వార్నింగ్ ఇచ్చారా? అన్న సందేహం కలుగక మానదు. పేరుకు నిరసనకారులు.. ఆందోళనకారులు అంటూ మీడియాలో ఉదరగొట్టేస్తున్నా.. వారంతా ఎవరు. జనాలేగా? నిజంగా జనాల్లో వ్యతిరేకత లేకుంటే.. అంద పెద్ద జనసమూహం ఎలా తయారవుతుంది. ఏ తండ్రి తమ కొడుకును ఆందోళనల్లో పాల్గొనాలని.. నిరసనల్లో భాగం చేయాలని అస్సలు భావించరు.

అమలాపురం ఎపిసోడ్ ను చూసినప్పుడు ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అదేమంటే.. తాజాగా చేపట్టిన ఆందోళనలో పాల్గొన్న వారంతా ముప్ఫై ఏళ్ల లోపు వారే. ఇంకాస్త సరిగ్గా చెప్పాలంటే పాతికేళ్ల లోపు వారే అన్న మాట పలువురు మీడియా ప్రతినిధులతో మాట్లాడినప్పుడు అర్థమవుతుంది. వారంతా ముందు నుంచే వాట్సాప్ గ్రూపుల్లో తాము చేయబోయే ఆందోళన గురించి మాట్లాడుకోవటం.. సమన్వయం చేసుకోవటంతోపాటు.. ఎవరు ఎక్కడ ఉన్నా సరే.. తమ ఆలోచనల్ని అందరితో పంచుకునేందుకు అవకాశం ఇచ్చిన సాంకేతికత కూడా ఇలాంటి పరిస్థితికి కారణంగా చెప్పొచ్చు.

ఇటీవల కాలంలో ఏపీలోనే కాదు తెలంగాణలోనూ చూడని అరుదైన సన్నివేశానికి అమలాపురం సాక్ష్యంగా మారింది. రాష్ట్ర మంత్రికి చెందిన రెండు ఇళ్లను నిరసనకారులు తగలబెట్టయటంతో పాటు.. ఎమ్మెల్యే ఇంటి మీదా దాడికి పాల్పడి.. ఇంటికి నిప్పు పెట్టారు. ఈ చర్యతో నిరసనకారులు.. ఆందోళనకారులు ఇచ్చిన సందేశం ఏమిటి? తమకు నచ్చని పనులు చేసే విషయంలో తమకు అండగా నిలవకుండా.. ప్రభుత్వానికి దన్నుగా నిలిస్తే.. తాము ఊరుకోమన్న సంకేతాన్ని తమ దుందుడుకు చేష్టలతో స్పష్టం చేశారని చెప్పాలి.

ఇలాంటి ఘటనలు అసలు మొదలే కాకూడదు. ఒకసారి ఇలాంటివి ఏ రూపంలో మొదలైనా.. దాని విపరీత ధోరణలు అంతకంతకూ ఎక్కువ అవుతుంటాయి. అవేవీ మంచిది కాదు. ఏపీలోని ఏ పార్టీ అయినా సరే ఇప్పుడు ఆలోచించాల్సింది.. ప్రజల్ని కంట్రోల్ చేసే రాజకీయానికి సవాలు విసిరేలా? వారు సైతం విస్మయానికి గురయ్యేలా ప్రజాగ్రహం ఎలా సాధ్యమైందన్న దానిపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇవాళ వైసీపీ కావొచ్చు. రేపొద్దున టీడీపీ.. జనసేనల్ని కూడా ఇలాంటి అగ్రహం  వదిలిపెట్టదన్నది స్పష్టం.

అందుకే.. ఈ ఉదంతం ఏపీ అధికారపక్షానికి సంబంధించింది కాదు.. ఇది తెలుగు రాజకీయ పార్టీలన్ని జాగ్రత్తగా చూడాల్సిన విషయమన్నది మర్చిపోకూడదు. అమలాపురంలో చోటు చేసుకున్నది భవిష్యత్తు రాజకీయాలకు ఒక వార్నింగ్ లాంటిదే అన్నది ముమ్మాటికి హెచ్చరికే. మరి.. రాజకీయ పార్టీలు అమలాపురం ఎపిసోడ్ నుంచి ఏయే పాఠాలు నేర్చుకుంటాయో చూడాలి.
Tags:    

Similar News