అందరి చూపు కవితపైనేనా ?

Update: 2023-03-18 10:07 GMT
ఇపుడందరి చూపులు కల్వకుంట్ల కవితపైనే నిలిచాయి. 20వ తేదీన కవిత ఏమి చేయబోతున్నారనేది ఆసక్తిగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను విచారించాల్సిందే అని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బాగా పట్టుదలగా ఉంది.  20వ తేదీన విచారణకు హాజరుకావాలని కవితకు ఇప్పటికే ఈడీ నోటీసులిచ్చింది. ఇదేసమయంలో ఎలాగైనా విచారణ నుండి తప్పించుకోవాలని కవిత ప్రయత్నిస్తున్నారు. తన ప్రయత్నాల్లో భాగంగా సుప్రింకోర్టులో పిటీషన్లు కూడా వేశారు. అయితే కోర్టులో ఊరట దక్కటంలేదు.

విచారణకు హాజరయ్యేందుకు కవిత కొన్ని అభ్యంతరాలను వ్యక్తంచేస్తు వేసిన పిటీషన్ పై 24వ తేదీన విచారిస్తామని కోర్టు స్పష్టంచేసింది. అయితే నాలుగు రోజుల ముందే కవితను విచారణకు రావాల్సిందే అని ఈడీ నోటీసులిచ్చింది. ఇపుడీ విచారణకు ఆమె హాజరవుతారా లేదా అన్నదే ఆసక్తిగా మారింది. ఒకవేళ కవిత విచారణకు హాజరుకాకపోతే ఏమవుతుంది ? ఏమవుతుందంటే విచారణలో కవిత సహకరించని విషయమై కోర్టులో ఈడీ పిటీషన్ వేసే అవకాశముంది.

కవితను అదుపులోకి తీసుకుని విచారించేందుకు ఈడీ కోర్టు అనుమతి కోరే అవకాశమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కవిత మీద ఈడీ పెట్టింది ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ). దీని ప్రకారం విచారణలో సహకరించని వారిని అదుపులోకి తీసుకుని విచారించే అధికారాలు ఈడీకి ఉన్నాయట. అలాగే ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే అనుమానితుల ఆస్తులను సీజ్ చేసే అధికారం కూడా ఉందని సమాచారం.

అయితే కవిత విషయంలో అలాంటి చర్యలకు ఈడీ వెళ్ళలేదు. నోటీసులిచ్చి విచారణకు రమ్మంటోంది. దీన్ని అలుసుగా తీసుకుంటే మాత్రం ఈడీ ఎక్స్ ట్రీమ్ చర్యలకు దిగే అవకాశముందని నిపుణులంటున్నారు. 20వ తేదీన విచారణకు రావాలని కవితకు ఈడీ ఇచ్చిన నోటీసు కీలకంగా మారింది. ఈ విషయాలను ఇప్పటికే కవితకు ఆమె లాయర్లు చెప్పేవుంటారు. ఈడీ విచారణను ఎవాయిడ్ చేస్తే ఎదురవ్వబోయే పరిణామాలను కూడా ఉదాహరణలతో సహా చెప్పుంటారనటంలో సందేహంలేదు. అయినాసరే కవిత ఏమిచేస్తారనేది ఆసక్తిగా మారింది. అందుకనే అందరి చూపు 20వ తేదీన పడింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News