చంద్రబాబు నివాసం జప్తు పై ఏసీబీ కోర్టు విచారణ!

Update: 2023-05-31 13:59 GMT
అమరావతిలో చంద్రబాబు హయాంలో పలు అక్రమాలు, ఉల్లంఘనలు జరిగాయని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని కరకట్ట రోడ్డులో చంద్రబాబు ఉన్న ఇల్లు ఇలా అక్రమ పద్ధతిలో ఉన్నదేనని విమర్శిస్తోంది. నదీ యాజమాన్య, పరిరక్షణ చట్టాలను ఉల్లంఘించి, పంచాయతీ రోడ్లను ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడంలో చంద్రబాబు నివాసముంటున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.

ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి లింగమనేని రమేష్‌ కు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించినందుకు ఆయన నుంచి బహుమతిగా ఉండవల్లి కరకట్ట రోడ్డులోని గెస్టు హౌసును చంద్రబాబు బహుమతిగా పొందారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో  గుంటూరు జిల్లా ఉండవల్లిలోని కరకట్ట రోడ్డు సమీపంలో టీడీపీ అధినేత చంద్రబాబు నివసిస్తున్న ఇంటి జప్తు (ఎటాచ్‌)కు అనుమతి కోరుతూ విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టులో ఏపీ సీఐడీ దరఖాస్తు దాఖలు చేసింది.

ఈ క్రమంలో మే 30న జరిగిన విచారణలో ప్రత్యేక పీపీ వైఎన్‌ వివేకానంద వాదనలు వినిపించారు. ఎటాచ్‌మెంట్‌ కు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి ముందు ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించారు. అయితే చట్ట నిబంధనల పరిశీలన, తదుపరి వాదనలు వినేందుకు విచారణను మే 31కి వాయిదా వేస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారు.

అమరావతి రాజధాని నగర బృహత్‌ ప్రణాళిక, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ఎలైన్‌ మెంట్‌ మార్చడంలో అవినీతి చోటుచేసుకుందనే ఆరోపణతో గతేడాది మే నెలలో సీఐడీ పలువురిపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.  

చంద్రబాబు నివసిస్తున్న వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌ కు చెందిన కరకట్ట రోడ్డులోని ఇంటిని, మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ సంబంధీకులకు చెందిన ఆస్తులను ఎటాచ్‌ చేసేందుకు సీఐడీకి అనుమతిస్తూ హోం శాఖ మే 12న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు నుంచి అనుమతి పొందేందుకు సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో దరఖాస్తు దాఖలు చేసింది.

కాగా ఈ పిటిషన్‌ పై విచారణను మే 31 మధ్యాహ్నానికి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ చేపడతామని వెల్లడించింది. లంచ్‌ బ్రేక్‌ తర్వాత వాదనలు వినిపించాలని ఇరు పక్షాల న్యాయవాదులకు సూచించింది. దీంతో ఈ కేసులో ఏసీబీ కోర్టు ఏ ఆదేశాలు జారీ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Similar News