అమీర్ కు ​కొన్ని ప్రశ్నలు ...!

Update: 2015-11-26 17:30 GMT
భారతదేశంలో ఇప్పుడు చాలా మందిని తీవ్రంగా వేధిస్తున్న ప్రశ్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కు అసహనం ఎందుకు? దేశంలో ఏం జరిగిందని ఆయన భార్య దేశం విడిచి వెళ్లిపోదామా అని అన్నారు? నరేంద్ర మోదీ ప్రభుత్వం గుజరాత్ తరహాలో మత కల్లోలాలకు పాల్పడిందా? మతాల మధ్య చిచ్చు రేపుతోందా? భారతదేశంలో ముస్లిములు బతికే పరిస్థితులు కనుమరుగు అయ్యాయా? ఆయన ఎందుకంత ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఈ ప్రశ్నలకు అమీర్ ఖాన్ మాత్రమే జవాబు చెప్పాలి.

కర్ణాటకలో కుల్బుర్గి హత్య జరిగింది. దానికి సంబంధించి విచారణ జరపాల్సింది అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం. రెండు మూడు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం దాని గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. కానీ, ఏమాత్రం సంబంధం లేని కేంద్రంలోని ప్రభుత్వంపై మాత్రం మేధావులు మండిపడుతున్నారు. గోమాంసం తిన్నందుకు హత్య చేసింది ఉత్తర ప్రదేశ్ లో. అక్కడ అధికారంలో ఉన్నది సమాజ్ వాదీ పార్టీ. ఆ ఘటనను అక్కడి ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు కూడా. అయినా, మేధావులు కేంద్రంలోని ప్రభుత్వాన్నే తిడుతున్నారు. ఇతర ఘటనల విషయంలో కూడా ఇదే పరిస్థితి.

ఇక, ఖాన్ ల విషయమే తీసుకుందాం. టైగర్ మెమన్ ఉరిశిక్షను సల్మాన్ ఖాన్ తీవ్రంగా వ్యతిరేకించాడు. విమర్శలు రావడంతో ఆ తర్వాత వెనక్కి తగ్గాడు. అసహనంపై షారుక్ ఖాన్ వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ఆ ఇద్దరి బాటలో అమీర్ ఖాన్ కూడా పయనించాడు. నిజానికి సామాజిక బాధ్యత కలిగిన నటుడిగా అమీర్ కు పేరుంది. అంతేనా.. అసహనానికి సంబంధించి తాను ఎందుకంత బాధ పడ్డానో తన భార్య ఎందుకంత దురదృష్టకర వ్యాఖ్య చేసిందో ఆయన వివరించి ఉండాల్సింది. కానీ, దానిని ఆయన చేయలేదు. విదేశాలు మోదీ ప్రభుత్వాన్ని కీర్తిస్తున్న సమయంలో, దేశంలో ఎటువంటి మత అసహనం నెలకొనని సమయంలో ఆయన ఎందుకంత తీవ్ర వ్యాఖ్య చేశాడో తెలియదు. అయితే, రాబోయే రోజుల్లో మోదీ తీవ్రంగా బలపడే అవకాశం ఉందని, ఆ తర్వాత మోదీని నిలువరించేవారే ఉండరని, అందుకే ఆయన అటువంటి వ్యాఖ్య చేశారనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

ఒకవేళ దేశంలో పెరుగుతున్న లైంగిక దాడులు - నేరాలు - ఘోరాలు - రోడ్డు ప్రమాదాలు తదితరాలపై తీవ్ర ఆవేదన చెంది ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేశాడని అనుకోవడానికి వీల్లేదు. ఇటువంటి వాటిపై ఆయన తన ఆవేదననున వ్యక్తం చేస్తే మేధావుల అవార్డుల వాపసీ గురించి మాట్లాడి ఉండే వాడు కాదు.
Tags:    

Similar News