కృష్ణంరాజు, అశ్వనీదత్‌లకు షాక్, భూములు అప్పగించండి!

Update: 2020-09-04 05:50 GMT
కృష్ణా జిల్లాలో విమానాశ్రయంలోని డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణ పనుల కోసం అక్కడి సినీ ప్రముఖుల భూములను తమకు అప్పగించాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌కు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లేఖ రాసింది. ఇక్కడ నటుడు కృష్ణంరాజు, నిర్మాత అశ్వనీదత్ సహా పలువురికి భూములు ఉన్నాయి. వీరికి చెందిన 70 ఎకరాల భూములు అప్పగించాలని, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ మధుసూదనరావు కలెక్టర్ ఇంతియాజ్‌కు లేఖ రాశారట.

విమానాశ్రయ విస్తరణ కోసం కేసరపల్లి, బుద్ధవారం, దావాజీగూడెం, అల్లాపురం, చినఔటపల్లి, అజ్జంపూడి గ్రాములకు చెందిన 700 ఎకరాల భూములను ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించింది జిల్లా యంత్రాంగం. ఇక్కడ దశలవారీగా పోర్టు విస్తరణ పనులు చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కేసరపల్లిలో కృష్ణంరాజుకు 30 ఎకరాలు, అశ్వనీదత్‌కు 39 ఎకరాలు ఎకరాలు ఉండగా, ఇక్కడ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌కు కేంద్రం ఇటీవల టెండర్లు పిలిచింది. నాలుగు నెలల్లో పనులు ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి భూముల స్వాధీనానికి అధికారులు దృష్టి సారించారు.

ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌కు అవసరమైన భూములను కాంట్రాక్టు సంస్థకు అప్పగించనున్నారు. దీనిని 3.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాల్సి ఉంది. దీనికి సంబంధించిన భూములను చదును చేసి అప్పగిస్తారు. కానీ ఇక్కడ కృష్ణంరాజు, అశ్వనీదత్ సహా పలువురు తోటలు సాగు చేస్తున్నారు. వీరు తమ భూములు ఇచ్చేందుకు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదట. దీంతో సమస్యను ఎయిర్ పోర్టు అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లారు.

గతంలో తమ భూములు అప్పగించేందుకు అంగీకరించిన వీరు, ఇప్పుడు మాత్రం సుముఖంగా లేరు. అందుకు కారణం ఉంది. గతంలో ఇక్కడ తమ భూములకు ప్రతిగా రాజధాని అమరావతిలో భూములు వచ్చాయి. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక మూడు రాజధానులు తెరపైకి రావడంతో, అమరావతి భూములకు విలువ పడిపోయింది. వీటితో పోలిస్తే కృష్ణంరాజు, అశ్వనీదత్ సొంత భూముల ధరలు చాలా ఎక్కువ. అందుకే వారు ఇవ్వడానికి ఆసక్తి చూపించడం లేదట. దీంతో విమానాశ్రయ అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చారు. ఆయన వారితో చర్చలు జరపనున్నారని తెలుస్తోంది.
Tags:    

Similar News