విద్యాకానుకలో కొత్త వస్తువు చేరింది

Update: 2021-03-16 15:30 GMT
ప్రభుత్వ పథకాలంటే లబ్థిదారులకంటే కూడా వాటిని సప్లై చేసే వారికి మేలు కలిగించేలా అస్సలు ఉండకూడదు. బ్యాడ్ లక్ ఏమంటే.. చాలామంది పాలకులు సంక్షేమ పథకాల్ని మనసుతో కంటే.. మైలేజీ కోసమే చేస్తుంటారు. దీంతో.. లబ్థిదారులకు పూర్తిస్థాయి ప్రయోజనం ఉండదు. ఎక్కడిదాకానో ఎందుకు.. బియ్యం సంగతే తీసుకోండి. ఈ పథకం కోసం వేల కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తుంటారు. కానీ.. ఎంతమంది రేషన్ బియ్యం తమ ఇంట్లో వాడతారు. రేషన్ దగ్గర ఫ్రీగా తీసుకొని దగ్గర్లోని కిరాణాషాపు వాడికో.. హోటల్ వాడికో అమ్మేయటం మనం చూస్తున్నదే.

ఇలాంటి పథకాల కారణంగా ఖజానా మీద భారం పడితే తప్పించి.. మరింకేమీ ఉండదు. ఏపీలోని జగన్ సర్కారును చూస్తే.. అనూహ్యంగా ఎప్పటికప్పుడు కొత్త పథకాల్ని తెర మీదకు తీసుకొస్తుంటారు. స్కూల్ విద్యార్థుల కోసం విద్యా కానుక పేరుతో ఖరీదైన బ్యాగుతో పాటు.. స్టూడెంట్ కు అవసరమైన వస్తువుల్ని అందిస్తున్నారు. అయినప్పటికీ.. ఈ పథకాన్ని మరింత మెరుగ్గా అందించాలన్న తపన ఉన్న జగన్ సర్కారు తాజాగా ఒక కానుకను అదనంగా చేర్చారు. అదేమంటే.. ప్రతి విద్యార్థికి అవసరమైన డిక్షనరీని కూడా అందించాలని నిర్ణయించారు.

చదువుకునే ప్రతి విద్యార్థికి డిక్షనరీ చాలా అవసరం. కానీ.. ఖరీదు కాస్త ఎక్కువగా ఉండటంతో పేదలు.. సామాన్యులు దీన్ని కొనలేని పరిస్థితి. అందుకు భిన్నంగా ప్రతి విద్యార్థికి ఇచ్చే విద్యా కానుకలోనే డిక్షనరీ ఇస్తే.. మరింత మేలు కలుగుతుంది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు జగనన్న విద్యాకానుకలో భాగంగా 3 జతల యూనిఫారం.. షూ.. 2 జతల సాక్సులు.. బెల్టు.. స్కూల్ బ్యాగ్.. పాఠ్య పుస్తకాలు..వర్కుబుక్కులు.. నోట్ బుక్కులతో పాటు ఇంగ్లిషు-తెలుగు డిక్షనరీని అందించనున్నారు. ప్రభుత్వ పథకాల్ని షురూ చేయటం.. మధ్యలో వదిలేయటం కాకుండా.. దానికిఅవసరమైన హంగుల్ని ఎప్పటికప్పుడు చేర్చటం చాలా అవసరం. ఈ విషయంలో జగన్ సర్కారును అస్సలు వంక పెట్టలేమని చెప్పాలి.
Tags:    

Similar News