నీటి ఊట కోసం వేట.. ఆ మహానగరంలో 10 లక్షల బావుల తవ్వకం

Update: 2020-10-09 23:30 GMT
మనదేశంలో చాలా వేగంగా అభివృద్ధి చెందిన నగరాల్లో బెంగళూరు ఒకటి. ఈ నగరం ఎంత ఆహ్లాదభరితంగా ఉంటుందో.. అంత సుందరంగా ఉంటుంది. పర్యావరణానికి ఇక్కడ పెద్దపీట వేస్తారు. అయితే బెంగళూరులో ప్రస్తుతం నీటి కొరత ఏర్పడింది. ఇందుకోసం అక్కడి ప్రభుత్వం ఏకంగా 10 లక్షల బావుల తవ్వకానికి పూనుకుంది. ఇప్పటికే పనులు  కూడా ప్రారంభమయ్యాయి. అయితే పర్యావరణానికి ఏ మాత్రం హాని వాటిళ్లకుండా సాంప్రదాయపద్ధతుల్లో పనులు మొదలుపెట్టారు.

బెంగళూరు ఆగ్నేయ ప్రాంతమైన కైకొండ్రహల్లి ప్రస్తుతం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. కానీ, అక్కడ జనాభాకు సరిపడా తాగునీరు లేదు. ఇటువంటి ప్రాంతాలు బెంగళూరు చుట్టుపక్కల చాలా ఉన్నాయి. దీంతో అక్కడ స్కూళ్లలో, ఇతర ఖాళీస్థలాలు ఉన్న చోట నీటికోసం బావులు తవ్వాలని సంకల్పించింది ప్రభుత్వం. వాస్తవానికి బెంగళూరు నగరానికి ప్రధాన నీటి వనరులు అర్కావతి, కావేరీ నదులు కానీ ప్రస్తుతం ఈ నదులు ప్రజలకు సరిపడా నీటిని ఇవ్వలేకపోతున్నాయి. ఇక మిగిలిన ఒకే ప్రత్యామ్నాయ మార్గం భూగర్భ జలాలను వెలికితీయడం.  

బెంగళూరులో నాలుగు లక్షల అక్రమ బోరు బావులు ఉన్నాయి. 200 అడుగుల కింద ఉన్న రాతి పొరల నుంచి బోరు బావుల ద్వారా భూగర్భ జలం పైకి వస్తుంది. ప్రస్తుతం అవి ఎండిపోయాయి. దీంతో నీటి సమస్య పెరిగిపోయింది. అయితే బెంగళూరులో భూగర్భజలాలు ఆశించినస్థాయిలో లేవని బ్రిటన్‌లోని షెఫీల్డ్ అర్బన్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకురాలు డాక్టర్ హిత ఉన్నికృష్ణన్ అంటున్నారు. ఆమె ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లోని నీటివనరుల గురించి అధ్యయనం చేస్తున్నారు. బెంగళూరులో వర్షపాతం కూడా బాగానే నమోదవుతుంది. కానీ నగరమంతా కాంక్రీట్​ బెడ్లతో నిండిపోవడంతో నీరు ఇంకే పరిస్థితి లేదు.

అక్కడ భూగర్భ జలాలు లేకపోవడానికి ఇదీ ఓ కారణం. ప్రస్తుతం విశ్వనాథ్ బయోమీ ఎన్విరాన్మెంటల్ ట్రస్టు ఆధ్వర్యంలో బెంగళూరులో బావులు తవ్వుతున్నారు.

అయితే ఈ బావులు తవ్వడం ద్వారా వర్షపునీరు ఇంకేలా చేయవచ్చని అక్కడి పర్యావరణ శాస్త్రవేత్తలు ప్రణాళికలు రచించారు. అనుకున్నట్టుగానే త్వరితగతిన బావులు తవ్వితే వర్షపు నీరు ఒడిసిపట్టుకోవచ్చని.. దీనివల్ల నగరంలో అడుగంటిన బోర్లలో నీరు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

మన్ను వడ్డరల్లో ఒకరు తవ్వే పని చేస్తారు. మిగతా వాళ్లు తట్టలతో మట్టిని తీస్తారు. మట్టి వదులుగా ఉంటే, బావి గోడలు కూలిపోకుండా, ముందుగానే అచ్చు వేసుకున్న ఓ లోహపు జాలిని పెడతారు. ఆ తర్వాత జాలిని తీసి, సిమెంటు రింగులు పెడతారు. అడుగున మట్టి మెత్తగా మారి, నీటి సంకేతాలు కనిపిస్తే మన్ను వడ్డరల పని దగ్గరపడినట్లే. పది నుంచి వంద అడుగుల లోతులో ఉంటే నీటి ఊటను చేరుకోగానే, బావిలోకి నీళ్లు రావడం మొదలవుతుంది. వాళ్లు, అలాగే మరో 8 నుంచి 10 అడుగుల లోతు తవ్వుతారు. అది చాలా కష్టమైన పని.

ఇది వరకు బావి లోపల చుట్టూ మట్టి కూలిపోకుండా  రాళ్లు పెట్టేవారు. ఇప్పుడు సిమెంట్ రింగ్‌లు పెడుతున్నారు. రాళ్ల మధ్యలో ఉండే సందు ద్వారా బావిలోకి నీరు ఊరేది. ఇప్పుడు సిమెంట్ రింగ్‌లకు కూడా అలాగే నాలుగు ఇంచుల వెడల్పుతో ఉండేలా రంధ్రాలు చేస్తున్నారు. 40 అడుగల లోతు బావిని తవ్వడానికి ఏడు, ఎనిమిది మంది ఉన్న మన్ను వడ్డరల బృందానికి మూడు రోజులు పడుతుంది. కుటుంబ సభ్యులు, బంధువులు కలిసే ఇలా బృందంగా ఏర్పడతారు. కష్టాన్ని, సంపాదనను సమంగా పంచుకుంటారు. లోతును బట్టి ఒక్కో బావికి 30 వేల నుంచి 1.5 లక్షల రూపాయల దాకా డబ్బు వస్తుంది. సగటున రోజుకు ఒక్కొక్కరూ 1,200 రూపాయల దాకా సంపాదిస్తారు. ''నేను తవ్విన ప్రతి బావిలో నీళ్లు పడతాయని హామీ ఇవ్వగలను. నీళ్లు పడితేనే డబ్బులు తీసుకుంటా. పడని సందర్భం ఒక్కటి కూడా లేదు'' అని ఎల్లమ్మపాల్యకు చెందిన పెద్దన్న అన్నారు. బెంగళూరు శివారు ప్రాంతంలో ఉన్న ఈ గ్రామంలో దాదాపు 75 మన్ను వడ్డర కుటుంబాలు ఉన్నాయి. నిజానికి బావులు తవ్వే పని విజయవంతంగా పూర్తయితే బెంగళూరుకు ఇక నీటి కష్టాలు ఉండవు.
Tags:    

Similar News