'పోలవరం' సెంటిమెంటు.. రిపీట్ ఖాయమా.. ?
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం నియోజకవర్గంలో గత 15 సంవత్సరాలుగా ఒక సెంటిమెంటు తీవ్ర ప్రభావం చూపిస్తోంది.;
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం నియోజకవర్గంలో గత 15 సంవత్సరాలుగా ఒక సెంటిమెంటు తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఒకసారి ఎన్నుకున్న నాయకుడిని ఇక్కడి ప్రజలు మరోసారి ఎన్నుకోకపోవడం.. సెంటిమెంట్ గా మారింది. దీంతో వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే తరహా సెంటిమెంటు రిపీట్ అయ్యే అవకాశం ఉందని తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. వాస్తవానికి 2004 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో తెల్లం బాలరాజు ఒకే అభ్యర్థి విజయం సాధించారు.
కానీ 2014 ఎన్నికల నుంచి ఇక్కడ పరిస్థితి మారిపోయింది. ఒకసారి ఎన్నుకున్న అభ్యర్థిని ఇక్కడి గిరిజనులు రెండోసారి ఎన్నుకోవడం లేదు. దీంతో ప్రతి ఎన్నికలోను ఎమ్మెల్యే మారిపోతున్నారు. అదే సమయంలో పార్టీలు కూడా మారుతున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న పోలవరం నియోజకవర్గం 2014లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టింది. ఆ ఎన్నికల్లో మొడియం శ్రీనివాసరావు విజయం సాధించారు.
ఆ తర్వాత వైసిపి ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కింది. ఈ పార్టీ తరఫున తెల్లం బాలరాజు విజయం దక్కించుకున్నారు. ఇక గత ఎన్నికల్లో జనసేన పార్టీ అనూహ్య విజయం సాధించింది. ఈ పార్టీ తరఫున చెర్రి బాలరాజు గెలుపొందారు. ఇలా గత మూడు ఎన్నికల పరిస్థితిని గమనిస్తే ముగ్గురు అభ్యర్థులను పోలవరం ఓటర్లు మారుస్తూ వచ్చారు. వీటికి కొన్ని ప్రధాన కారణాలు కూడా ఉన్నాయనేది స్థానికంగా ఉన్న చర్చ. పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు వరుసగా ఉన్నప్పటికీ ప్రజల నాడి మాత్రం డిఫరెంట్ అభ్యర్థులను ఎంచుకునే దిశగా మారుతుంది.
కీలకమైన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయకపోవడం, అవినీతి.. అక్రమాల వ్యవహారాలు ఎక్కువగా కనిపిస్తుండడంతో పోలవరం ఓటర్లు మార్పు దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక ఇప్పుడు పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉందన్న చర్చ నడుస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే చెర్రి బాలరాజు కూడా ఇటువంటి ఆరోపణల్లోనే మునిగిపోయారు. ఫలితంగా వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ ఇక్కడ అభ్యర్థి గెలుపు మారిపోతుందన్నది స్థానికంగా జరుగుతున్న చర్చ మరి ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతం పోలవరం సెంటిమెంటుపై మాత్రం స్థానికంగా చర్చ నడుస్తున్న చర్చ ఆసక్తిగా మారింది.