49 బంతులు 82 పరుగులు.. క్రికెట్ మలుపు తిరిగిన రోజు

Update: 2023-03-27 22:00 GMT
వన్డే క్రికెట్ లో టీమిండియా రెండు సార్లు ప్రపంచ చాంపియన్. గత రెండు ప్రపంచ కప్ లలో సెమీఫైనలిస్టు. వచ్చే ప్రపంచ కప్ మనదగ్గరే జరగబోతోంది కాబట్టి మనమే ఫేవరెట్. క్షణాల్లో ఫలితం మారే టి20ల సంగతి పక్కన పెడితే వన్డేల్లో మన జట్టు చాలా పటిష్ఠం. లోపాలను సరిచేసుకుంటే జగజ్జేత గా నిలిచే అవకాశాలు చాలా ఎక్కువ. మరి ముప్పై ఏళ్ల కిందట కూడా టీమిండియా ఇలానే ఉందా? లేదు.. కానీ, ఆ ఒక్క ఇన్నింగ్స్ భారత వన్డే క్రికెట్ చరిత్రను మార్చింది. ఆ ఇన్నింగ్స్ నమోదైంది మార్చి 27నే. అంటే ఈ రోజే.

ఏమిటా ఇన్నింగ్స్?

అప్పటివరకు భారత క్రికెట్ మూస పద్ధతిలో సాగేది. వన్డేల్లో మహా అయితే 250 పరుగులు చేసేది. అంతకుమించి స్కోరు చేస్తే వామ్మో అనుకోవాల్సి వచ్చేది. అలాంటి సమయంలో వచ్చింది తూఫాన్ ఇన్నింగ్స్. క్రికెట్ చరిత్రను మలుపుతిప్పిన ఆ ఇన్నింగ్స్ ఆడింది ఇంకెవరో కాదు.. భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్. 1994లో న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా జరిగిన వన్డేలో ఓపెనర్ నవజ్యోత్ సిద్ధూ గాయపడ్డాడు. దీంతో సచిన్ ను ఓపెనింగ్ చేయమన్నాడు కెప్టెన్, హైదరాబాదీ అజహరుద్దీన్.

యువ సచిన్ అదే ఊపులో బరిలో దిగి న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ ఫాస్ట్ పిచ్ పై చెలరేగాడు. కేవలం 49 బంతుల్లోనే 82 పరుగులు చేశాడు. అప్పటివరకు సచిన్ లో చూడని దూకుడు ఇది. అంతే.. వన్డే ఓపెనింగ్ స్థానంలో కుదురుకున్నాడు. 344 వన్డేల్లో ఓపెనర్ గా సచిన్ కెరీర్ లో 463 వన్డేలు ఆడితే 344 మ్యాచ్ ల్లో ఓపెనర్ గానే వచ్చాడు. మొత్తం 18426 పరుగులు చేస్తే ఓపెనర్ గానే 15,310 చేశాడు. 49 సెంచరీలకు గాను 45 ఓపెనర్ గానే బాదాడు. ఓపెనర్ గా అతడి సగటు 48.29. ఇక మిగతా బ్యాటింగ్ ఆర్డర్ లో సచిన్ చేసినవి 3,116 పరుగులు. 119 మ్యాచ్ లలో వివిధ స్థానాల్ల బ్యాటింగ్ దిగి 3,116 పరుగులు చేశాడు. సగటు కేవలం 33.

కొసమెరుపు.. : 1994 లో సచిన్ ఆడిన తూఫాన్ ఇన్నింగ్స్ భారత క్రికెట్ చరిత్రను ప్రభావితం చేసిందనే అనుకుంటున్నాం. కానీ, ప్రపంచ క్రికెట్ చరిత్రను మలుపుతిప్పింది. సచిన్ స్ఫూర్తితో చెలరేగిన శ్రీలంక ఓపెనర్లు జయసూర్య, కలువితరణ తమ జట్టుకు మెరుపు ఆరంభాలనిచ్చారు. వారిద్దరి దూకుడే 1996లో జరిగిన ప్రపంచ కప్ లో శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News