ఆ తప్పు చేస్తే రూ.100 కోట్ల ఫైన్

Update: 2016-05-06 07:06 GMT
భారీ తప్పుల్ని సింఫుల్ గా చేసేయటం కొందరికి అలవాటు. ఏం అవుతుందన్న  తేలికభావం.. ఏదైనా జరిగితే చూసుకుందాం? అన్న ధోరణి కూడా దీనికి కారణంగా చెప్పొచ్చు. ఇలాంటి వాటికి భారీ శిక్షలతో చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాజాగా అలాంటి నిర్ణయం తీసుకునే దిశగా మోడీ సర్కారు అడుగులు వేస్తోంది. కొన్ని అంతర్జాతీయ సంస్థలు.. సోషల్ మీడియాలు తమకు ఇష్టానుసారంగా భారత్ చిత్రపటాన్ని ఇష్టానికి తగినట్లుగా సరిహద్దులు మార్చేసి ప్రచురించటం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది.

జమ్మూకాశ్మీర్ ను పాకిస్థాన్ లో.. అరుణాచల్ ప్రదేశ్ ను చైనాలో చూపించే వారు కూడా చాలామందే ఉన్నారు. ఇలా.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ దేశ సరిహద్దుల్ని తమకుతగ్గట్లుగా మార్చుకునే వారికి కళ్లాలు వేసే దిశగా ప్రభుత్వం సమాయుత్తమవుతోంది. ఇలా తప్పు చేసిన ప్రతిసారీ దీనిపై మీడియాలో వార్తలు రావటం.. ప్రభుత్వం స్పందించిన సదరు సంస్థలకు నోటీసులు ఇస్తే కానీ మార్పు రాని పరిస్థితి.

 ఇలాంటి వాటికి చెక్ చెప్పే పనిలో భాగంగా.. భారత దేశ చిత్రపఠాన్ని తప్పుగా ప్రచురించిన పక్షంలో రూ.వంద కోట్ల జరిమానా వేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ నిర్ణయం కానీ అధికారికం అయిన పక్షంలో ఇష్టారాజ్యంగా భారతదేశ చిత్రపటాల్ని వాడే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News