దేశంలో 165కు చేరిన స్ట్రెయిన్ వైరస్ కేసులు ...

Update: 2021-01-29 10:58 GMT
దేశంలో కొత్త రకం కరోనా కేసుల సంఖ్య 165కు చేరింది. దేశవ్యాప్తంగా పలు కేంద్రీయ ల్యాబ్స్ ‌లో బ్రిటన్‌ లో వెలుగులోకి వచ్చిన‌ కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. ఢిల్లీలోని ఐజీఐబీలో గరిష్ఠంగా 51 నమానాలు, ఢిల్లీలోని ఎన్‌ సీడీసీలో 42, పూణేలోని ఎన్‌ ఐవీలో 44, బెంగళూరులోని ఎన్ ‌ఐఎంహెచ్‌ ఏఎన్‌ ఎస్‌ లో 14, హైదరాబాద్‌ సీసీఎంబీలో 8, బెంగళూరులోని ఎస్‌ సీబీఎస్‌ లో 5, కోల్‌కతాలోని ఎన్‌ ఐబీజీలో ఒకటి చొప్పున మొత్తం 165 నమూనాలు బ్రిటన్‌ వేరియంట్‌ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యినట్లు తెలిపింది.

బ్రిటన్‌ లో కొత్త రకం కరోనా వైరస్‌ వ్యాప్తి వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో గత ఏడాది నవంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు సుమారు 33 వేల మంది విమాన ప్రయాణికులు యూకే నుంచి భారత్‌ కు వచ్చారు. వీరికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొందరికి ‌ కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో కొత్త రకం కరోనా సోకిన వారిని ప్రత్యేక ఐసొలేషన్‌ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. వారిని కలిసిన వ్యక్తులను గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వివరించింది. ఈ చర్యల వల్ల దేశంలో బ్రిటన్‌ వేరియంట్‌ కరోనా పూర్తిగా నియంత్రణలో ఉన్నదని, వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని వెల్లడించింది.

ఇది ఇలావుండగా, గత కొద్ది వారాలుగా తగ్గుకుంటూ వచ్చిన కొత్త కరోనా కేసులు ఒక్క రోజు వ్యవధిలో కొంత పెరిగాయి. గురువారం ఒక్కరోజే 7,42,306 నమూనాలను పరీక్షించగా 18,855 కొత్త వైరస్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,07,20,048కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 163 మంది కరోనా బారినపడి మరనించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 1,54,010కి చేరింది. నిన్న ఒక్కరోజే 20,746 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,03,94,352కి చేరింది.
Tags:    

Similar News